తల్లి దహన సంస్కారాలు దూరం నుంచి చూస్తున్న కుమారులు
మల్యాల(చొప్పదండి): కరోనా వైరస్..తల్లిని కడచూపు కూడా చూడకుండా చేసిన విషాదకర సంఘటన మల్యాల మండలం తాటిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. తాటిపల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి మీనమ్మ(85) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. మీనమ్మకు నలుగురు కుమారులు. చిన్న కుమారుడు రాజమల్లు పదేళ్లక్రితం సౌదీలో మృతిచెందాడు. పెద్ద కుమారుడు రాజన్న ఇంటివద్ద కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగతా ఇద్దరు కుమారులు జీవనోపాధి కోసం ముంబాయిలో ఉంటున్నారు.
లాక్‌డౌన్ సడలింపులతో ఇటీవల తాటిపల్లి వచ్చారు. వీరిలో మూడో కుమారుడు ఎల్లయ్య స్థానిక పాఠశాలలో క్వారంటైన్ ఉండగా రెండో కుమారుడు, కోడలు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. తల్లి మృతిచెందడంతో మృతదేహన్ని చూడలేని దుస్థితి ఏర్పడింది. దీంతో దూరంగా ఉండి కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా సర్పంచ్ బింగి జ్యోత్న్సవేణు ఇద్దరు కుమారులను జాగ్రత్తలు తీసుకొని తల్లి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం మళ్లీ క్వారంటైన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment