సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో రోగుల సంఖ్య పడిపోయింది. లాక్‌డౌన్ ప్రకటించడం, అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటుండం తో ఆస్పత్రులన్నీ ఖాళీగా కనిపించాయి. కొన్నిచోట్ల అత్యవసర కేసులను కూడా సర్కారు ఆస్పత్రుల్లో డాక్టర్లు తీసుకోలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద వచ్చే వారిని కూడా నెట్‌వర్క్ ఆస్పత్రులు నిరాకరించాయి. వరంగల్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల మహిళ గుండె వ్యాధితో అమీర్‌పేటలోని ఓ నెట్‌వర్క్ ప్రైవేట్ ఆస్పత్రికి రాగా, అత్యవసరమైన కేసు అయినా ఆమెను చేర్చుకోవడానికి ఆస్పత్రి వర్గాలు ముందుగా నిరాకరించాయి. వారు బతిమిలాడగా చేర్చుకున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేదలకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోంది.
హైదరాబాద్‌లో పడిపోయిన ఓపీ..
హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు వేలాది మంది వైద్యం కోసం వస్తుం టారు. ఒక్క గాంధీ ఆస్పత్రికే రోజుకు ఓపీ కోసం 1,500 పైగా వచ్చేవారు. ఉస్మానియా ఆస్పత్రికి 2 వేల వరకు వచ్చేవారు. నిలోఫర్ ఆస్పత్రికి వెయ్యి మందికి పైగా వస్తుంటారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులకు కనీసం 10 వేల మందికి పైగా ఓపీ కోసం వస్తుంటారని అంచనా. ఇన్‌పేషెంట్లు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి రెగ్యులర్‌గా 10 వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. జిల్లాల్లో మరో 15 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తుంటారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ కేసులను కూడా ఆస్పత్రులు నిరాకరించడంపై రోగుల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని సాకుగా తీసుకుని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
డాక్టర్లను బాదుతున్న పోలీసులు..
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో అత్యవసర పని మీద ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు కనికరించట్లేదు. ఆస్పత్రులకు వెళ్లే డాక్టర్లను కూడా అడ్డుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో సేవలందించే డాక్టర్లు, నర్సులకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు డాక్టర్లపై పోలీసులు జులుం ప్రదర్శించినట్లు వైద్య సిబ్బంది ఆరోపిస్తోంది. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా పోలీసుల నుంచి తప్పించుకుని ఆస్పత్రికి రావడం కష్టమైపోతోంది. కీలక సమయంలో వారి సేవలను వినియోగించుకోవాల్సి ఉన్నా.. ఇలా అడ్డంకులు సృష్టించడం సమంజ సం కాదని వైద్యులు మండిపడుతున్నారు.
ప్రత్యేక ఐడీలు..
సర్కారు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సు లు సహా అన్ని కేడర్ల ఉద్యోగులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి సిబ్బందిని కూడా అడ్డుకోవద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
Published Wed, Mar 25 2020 2:53 AM | Last Updated on Wed, Mar 25 2020 2:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment