Outpatient services
-
రోగం వచ్చిందా.. మూడు రోజులు ‘ఓపి’క పట్టు!
న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన జనార్దన్ చికిత్స కోసం ఉదయం ఏడు గంటలకు నిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి చేరుకున్నాడు. ఎనిమిది గంటలకు ఓపీ కార్డు తీసుకుని న్యూరో ఓపీ విభాగంలోని వైద్యుడి వద్దకు చేరుకున్నాడు. పరీక్షించిన వైద్యుడు బ్రెయిన్ సీటీ సూచించాడు. వైద్యుడు రాసిన ఆ చీటీ తీసుకుని ఆస్పత్రిలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లగా అప్పటికే అక్కడ పది మంది వెయింటింగ్‌లో ఉన్నారని, మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు రావాల్సిందిగా టెక్నీషియన్ సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రర్‌లో పేరు నమోదు చేసుకుని పంపించాడు. మెడికల్ రిపోర్ట్ వస్తే కానీ మందులు రాయలేని పరిస్థితి. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేని దుస్థితి. చేసేది లేక ఆ రోజు రాత్రంతా ఎమర్జెన్సీ ముందు ఉన్న నైట్‌షెల్టర్‌లో నిరీక్షించి.. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సిటీ స్కాన్ సెంటర్‌కు చేరుకున్నారు. తీరా స్కాన్ చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే రిపోర్ట్ ఇస్తామని చెప్పడంతో చేసేది లేక మళ్లీ అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు రిపోర్ట్ తీసుకుని ఓపీకి వెళ్తే..తీరా అక్కడ వైద్యుడు లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఒక్క జనార్దన్‌కు ఎదురైన చేదు అనుభవం మాత్రమే కాదు.. తలనొప్పి, నడుం నొప్పి, కీళ్లనొప్పులు, హృద్రోగ, కిడ్నీ, కాలేయ, ఉదరకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనేక మంది రోగులకు నిమ్స్‌లో ఇదే అనుభవం ఎదురవుతోంది. సాక్షి, సిటీబ్యూరో/నిమ్స్: ప్రతిష్టాత్మక నిమ్స్‌లో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఓపీ చిట్టీల కోసం ఉదయం ఆరుగంటలకే క్యూ కట్టినా..డాక్టర్‌కు చూపించుకుని..మందులు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం ఆరవుతోంది. ఒక్కోసారి టెస్టులు రాస్తే వైద్యానికి రెండు మూడు రోజులు పడుతోంది. 1500 పడకల సామర్థ్యం ఉన్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1400–1600 మంది వస్తుంటారు. నగదు చెల్లింపు రోగులే కాకుండా ఆర్టీసీ, ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎక్కువగా వస్తుంటారు. ఉదయం 8 గంటలకు ఓపీ ప్రారంభమై 2.55 గంటలకు ముగుస్తుంది. బాధితుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేక ఓపీ కార్డుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. తీవ్ర నిరీక్షణ తర్వాత ఓపీ కార్డు తీసుకుని కేటాయించిన వైద్యుడి గదికి చేరు కుంటే అప్పటికే అక్కడ భారీగా క్యూలైన్ ఉంటుంది. వైద్యులు పరీక్షించి రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక్కో ల్యాబ్ ఒక్కో భవనంలో ఉండటంతో వీటి గుర్తింపు రోగులకు కష్టంగా మారుతుంది. అటు ఇటు తిరిగి డయాగ్నోస్టిక్‌కు చేరుకుంటే అక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదు. రిపోర్టుల జారీలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. మెడికల్ రిపోర్టులు చూడకుండా మందులు రాసే పరిస్థితి లేకపోవడం, తీరా రిపోర్టు తీసుకుని వెళ్లే సమయానికి ఓపీలో వైద్యులు లేకపోవడంతో రెండు మూడు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించాల్సి వస్తుంది. అప్పటికే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. పైరవీ ఉంటేనే ఎమర్జెన్సీలో పడక కేటాయింపు వంద పడకల సామర్థ్యం ఉన్న అత్యవసర విభాగానికి రోజుకు సగటున 15–25 మంది వస్తుంటారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది తీరా ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత వెంటిలేటర్‌పై వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారుతోంది. ► ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులతో ఫోన్ చేయించి ఒత్తిడి తెప్పిస్తే కానీ పడక దొరకని దుస్థితి. ► ఇదిలా ఉంటే అత్యవసర విభాగాల్లో 36 ట్రాలీలు ఉండగా, వీటిలో 15 రిపేరులో ఉన్నాయి. 26 వెంటిలేటర్లు ఉండగా వీటిలో 6 సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. u ఒక వెంటిలేటర్‌కు ఒక స్టాఫ్ నర్సు అవసరం కాగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 15 మంది ఉంటే, మొదటి అంతస్తులో తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. ► అంతేకాదు కన్సల్టెంట్ డాక్టర్లు వార్డుకు వచ్చి రౌండ్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఫలితంగా అత్యవసర విభాగం నుంచి ఆయా వార్డులకు కేసులను తరలించడంలోనూ జాప్యం చోటు చేసుకుని పడకల సమస్య తలెత్తుతుంది. ► ఎమర్జెన్సీ విభాగంలో పడకల సంఖ్యతో పాటు స్టాఫ్ నర్సులు, డ్యూటీ మెడికల్ డాక్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా కొంత వరకు సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజులు అవుతోంది... నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చా. కానీ ఇక్కడ ఓపీ కార్డు తీసుకోవడం మొదలు, వైద్యుడికి చూపించుకోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, మందులు రాయించుకుని వెళ్లడం ఇలా అన్ని చోట్ల ఆలస్యమవుతోంది. సాధారణ చికిత్సకూ రెండు మూడు రోజుల సమయం పడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లం రాత్రిపూట ఎక్కడ ఉండాలో తెలియక ఆస్పత్రి ఆవరణలోనే చలికి వణుకుతూ, తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. – మల్లేష్, గజ్వేల్ ఇతర ఆస్పత్రులను డెవలప్ చేయాలి ప్రభుత్వం గతంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో తెలంగాణ నలుమూలల నుంచి రోగులు ఇక్కడికే వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వైద్య సిబ్బంది లేక ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించలేని దుస్థితి. ఉస్మానియా, గాంధీ ఇతర ఆస్పత్రులను కూడా నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం ద్వారానే రోగుల రద్దీ తగ్గుతుంది. ఖాళీలను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వచ్చిన రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే వెసులుబాటు కలుగుతుంది. – డాక్టర్ జి.శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
ఆసుపత్రుల్లో ఓపీ షురూ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బుధవారం నుంచి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మొదలయ్యాయి. వాస్తవంగా ఇప్పటికే అత్యవసర వైద్య సేవలకు తోడు ఓపీ సేవలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, వైద్యాధికారులు కరోనా భయంతో ఓపీ సేవలు ప్రారంభిస్తే జనం గుమికూడుతారని భయపడి తెరవడానికి అనేకచోట్ల నిరాకరించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇవ్వడంతో ఆసుపత్రులు కూడా ఓపీ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాయి. హైదరాబాద్ రెడ్‌జోన్ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని కార్పొరేట్, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు దాదాపు 30 శాతం మేరకు ఓపీ సేవలతో నడిపిస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత పూర్తిస్థాయిలో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెబుతున్నారు. రెండుమూడు రోజుల్లో ఓపీ సేవలు పెరుగుతాయని వివిధ జిల్లాల ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి: రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నారాయణ్‌పేట్ జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఇక సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. త్వరలో కొన్ని ఆరెంజ్ జిల్లాలు గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కంటైన్మెంట్లు మినహా మిగిలిన అన్నిచోట్లా ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాస్తవంగా లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో ప్రతీ రోజూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రల్లో 1.25 లక్షల మంది ఓపీ సేవలకు వస్తుండేవారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు 30 నుంచి 40 వేల మంది ఓపీ సేవలకు వచ్చేవారని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో ఓపీలు రాకపోవచ్చని, ఆ పరిస్థితి రావడానికి సమయం తీసుకుంటుందని అంటున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఓపీ నిర్వహించేప్పుడు రోగుల నిర్వహణ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, వచ్చే ప్రతీ రోగి మాస్క్ ధరించేలా చూడటం, శానిటైజర్లు వారికి అందుబాటులో ఉంచడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. లేకుంటే ఆసుపత్రులే కరోనా వైరస్ కేంద్రాలుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. వైద్య సిబ్బందికి సూచనలు... మరోవైపు ఆసుపత్రుల్లో రోగులను చూసే వైద్య సిబ్బంది కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, ముక్కుకారటం, ఇతర కరోనా లక్షణాలున్న రోగులు వస్తే వారి విషయంలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు వైద్యులు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్‌లు ధరించాలని, చేతికి గ్లోవ్స్ ధరించాలని సూచిస్తున్నారు. ఇక కరోనా బ్లాక్ ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి విదితమే. ఓపీ చూడటానికి వైద్యులు భయపడాల్సిన అవసరంలేదని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నారు. రోగులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆసుపత్రి ముందు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో బోర్డుపై ప్రదర్శించాలని కోరారు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని జాగ్రత్తలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని వైద్యాధికారి ఒకరు తెలిపారు. -
ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో రోగుల సంఖ్య పడిపోయింది. లాక్డౌన్ ప్రకటించడం, అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటుండం తో ఆస్పత్రులన్నీ ఖాళీగా కనిపించాయి. కొన్నిచోట్ల అత్యవసర కేసులను కూడా సర్కారు ఆస్పత్రుల్లో డాక్టర్లు తీసుకోలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద వచ్చే వారిని కూడా నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరించాయి. వరంగల్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల మహిళ గుండె వ్యాధితో అమీర్‌పేటలోని ఓ నెట్వర్క్ ప్రైవేట్ ఆస్పత్రికి రాగా, అత్యవసరమైన కేసు అయినా ఆమెను చేర్చుకోవడానికి ఆస్పత్రి వర్గాలు ముందుగా నిరాకరించాయి. వారు బతిమిలాడగా చేర్చుకున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేదలకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోంది. హైదరాబాద్‌లో పడిపోయిన ఓపీ.. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు వేలాది మంది వైద్యం కోసం వస్తుం టారు. ఒక్క గాంధీ ఆస్పత్రికే రోజుకు ఓపీ కోసం 1,500 పైగా వచ్చేవారు. ఉస్మానియా ఆస్పత్రికి 2 వేల వరకు వచ్చేవారు. నిలోఫర్ ఆస్పత్రికి వెయ్యి మందికి పైగా వస్తుంటారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులకు కనీసం 10 వేల మందికి పైగా ఓపీ కోసం వస్తుంటారని అంచనా. ఇన్‌పేషెంట్లు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి రెగ్యులర్‌గా 10 వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. జిల్లాల్లో మరో 15 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తుంటారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ కేసులను కూడా ఆస్పత్రులు నిరాకరించడంపై రోగుల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని సాకుగా తీసుకుని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లను బాదుతున్న పోలీసులు.. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో అత్యవసర పని మీద ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు కనికరించట్లేదు. ఆస్పత్రులకు వెళ్లే డాక్టర్లను కూడా అడ్డుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో సేవలందించే డాక్టర్లు, నర్సులకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు డాక్టర్లపై పోలీసులు జులుం ప్రదర్శించినట్లు వైద్య సిబ్బంది ఆరోపిస్తోంది. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా పోలీసుల నుంచి తప్పించుకుని ఆస్పత్రికి రావడం కష్టమైపోతోంది. కీలక సమయంలో వారి సేవలను వినియోగించుకోవాల్సి ఉన్నా.. ఇలా అడ్డంకులు సృష్టించడం సమంజ సం కాదని వైద్యులు మండిపడుతున్నారు. ప్రత్యేక ఐడీలు.. సర్కారు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సు లు సహా అన్ని కేడర్ల ఉద్యోగులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి సిబ్బందిని కూడా అడ్డుకోవద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
గాంధీ ఓపీ కిటకిట
గాంధీఆస్పత్రి: విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగం సోమవారం రోగులతోకిటకిలాడింది. రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు లేకపోవడంతో రోగులు, వారిసహాయకులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, బాలింతలు అవస్థలు పడ్డారు.ఓపీ, అత్యవసర విభాగాల వద్ద స్ట్రెచర్లు,వీల్ఛైర్లు కూడా అందుబాటులో లేక ప్రాణాపాయస్థితిలో తీసుకువచ్చిన రోగులను వారి కుటుంబ సభ్యులు చేతులపై మోసుకుని ఆస్పత్రిలోపలకు తీసుకువెళ్లారు. ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు, ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి నిరుపేద రోగులకు మౌలిక సదుపాయలు, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. -
80 శాతం వైద్యులు పట్టణాల్లోనే...
60% ఆస్పత్రులు, 75% మందుల షాపులూ అక్కడే * కేపీఎంజీ, ఓపీపీఐ పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం వైద్యులు జనాభాలో 28 శాతం ఉన్న పట్టణ ప్రజలకు మాత్రమే సేవలందిస్తున్నట్లు తేలింది. 60 శాతం ఆస్పత్రులు, 75 శాతం మందుల దుకాణాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని కేపీఎంజీ(ప్రముఖ ఆడిట్ సంస్థ), ఓపీపీఐ(భారత ఔషధాల తయారీదారుల సంస్థ) పరిశోధనలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతానికే ఇన్ పేషంట్ చికిత్స, 68 % మందికి అవుట్ పేషంట్ సేవలు అందుతున్నాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు వెచ్చిస్తున్న మొత్తం దేశ జీడీపీలో కేవలం 4.1 శాతమే. అతి తక్కువ ఖర్చుపెడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఒకరి నుంచి ఒకరికి సోకని జబ్బులతోనే మొత్తం మరణాల్లో 60 శాతం సంభవిస్తుండగా, దీనివల్ల 2030 నాటికి రూ. 3.11 కోట్ల కోట్లు దేశం నష్టపోనుంది. 75 శాతానికి ఆరోగ్య బీమా లేదు సగటు ఆయుర్ధాయం (2015లో 68 ఏళ్లు), ప్రతీ 1000 మందికి ఆసుపత్రి బెడ్లు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నింటితో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువని, ప్రతి 10 వేల మందికి సాధారణ వైద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడించింది. ‘రోగి కేంద్రంగా ఆరోగ్య పరిరక్షణ విధానం కోసం కృషి చేయడం, నిబద్ధత చూపడం కీలకం’ అని కేపీఎంజీ, ఓపీపీఐ నివేదిక పేర్కొంది.‘ఆరోగ్యంపై చేసే ఖర్చువల్ల దేశవ్యాప్తంగా 6.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. అలాగే 75 శాతం ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. మధ్యస్థాయి ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు తక్కువ ఖర్చుపెడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మంచి పాత్రే పోషిస్తున్నా... అవగాహన లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. తరచుగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది’ అని కేపీఎంజీకి చెందిన ఉత్కర్ష్ పల్నిత్కర్ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో విద్య, అవగాహన కల్పించడమే లక్ష్యంగా చొరవతో అందరూ కలిసి పనిచేస్తే ఆరోగ్యకర దేశ లక్ష్యాన్ని అందుకోగలమన్నారు. ఐరాస సదస్సు 2000లో నిర్వచించిన ఆరోగ్య లక్ష్యాల్ని భారత్ సాధించలేదనిఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ప్రోడ్యూసర్స్ ఆఫ్ ఇండియా చీఫ్ శైలేష్ అయ్యంగార్ చెప్పారు. -
ఔట్‌పేషెంట్ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా నియమితులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పక్కకు తొలగించి బలవంతంగా మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడంపై సీమాంధ్రలో వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న 13 జిల్లాల్లో ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసింది. ఆ జిలాలన్నింట్లోనూ ఔట్‌పేషెంట్ సేవలు నిలిపివేశారు. సాధారణ శస్త్రచికిత్సలను కూడా ఆపేశారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఎక్కడా రోగులకు సేవలు అందలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఎక్కడా కూడా ఒక్క రోగిని కూడా ఓపీలో చూడలేదు. దాంతో బుధవారం ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు తీవ్ర బాధలు పడ్డారు. ఆంధ్రా వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాలతో పాటు రిమ్స్ల్లో పరిస్థితి దారుణంగా పరిణమించింది. సుమారు 25వేల మందికి ఓపీ సేవలు అందలేదు. ఉస్మానియా ఘటనకు బాధ్యులను సస్పెండ్ చేయకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. సీమాంధ్ర వైద్యులు హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారనేందుకు ఉస్మానియా ఘటనే తార్కాణమని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తిని అడ్డుకున్నారంటే తెలంగాణ వైద్యుల దౌర్జన్యకాండ ఏ రకంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చునన్నారు.