80 శాతం వైద్యులు పట్టణాల్లోనే...
60% ఆస్పత్రులు, 75% మందుల షాపులూ అక్కడే
* కేపీఎంజీ, ఓపీపీఐ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం వైద్యులు జనాభాలో 28 శాతం ఉన్న పట్టణ ప్రజలకు మాత్రమే సేవలందిస్తున్నట్లు తేలింది. 60 శాతం ఆస్పత్రులు, 75 శాతం మందుల దుకాణాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని కేపీఎంజీ(ప్రముఖ ఆడిట్ సంస్థ), ఓపీపీఐ(భారత ఔషధాల తయారీదారుల సంస్థ) పరిశోధనలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతానికే ఇన్ పేషంట్ చికిత్స, 68 % మందికి అవుట్ పేషంట్ సేవలు అందుతున్నాయని పేర్కొంది.
నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు వెచ్చిస్తున్న మొత్తం దేశ జీడీపీలో కేవలం 4.1 శాతమే. అతి తక్కువ ఖర్చుపెడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఒకరి నుంచి ఒకరికి సోకని జబ్బులతోనే మొత్తం మరణాల్లో 60 శాతం సంభవిస్తుండగా, దీనివల్ల 2030 నాటికి రూ. 3.11 కోట్ల కోట్లు దేశం నష్టపోనుంది.
75 శాతానికి ఆరోగ్య బీమా లేదు
సగటు ఆయుర్ధాయం (2015లో 68 ఏళ్లు), ప్రతీ 1000 మందికి ఆసుపత్రి బెడ్‌లు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నింటితో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువని, ప్రతి 10 వేల మందికి సాధారణ వైద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడించింది. ‘రోగి కేంద్రంగా ఆరోగ్య పరిరక్షణ విధానం కోసం కృషి చేయడం, నిబద్ధత చూపడం కీలకం’ అని కేపీఎంజీ, ఓపీపీఐ నివేదిక పేర్కొంది.‘ఆరోగ్యంపై చేసే ఖర్చువల్ల దేశవ్యాప్తంగా 6.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. అలాగే 75 శాతం ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు.
మధ్యస్థాయి ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు తక్కువ ఖర్చుపెడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మంచి పాత్రే పోషిస్తున్నా... అవగాహన లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. తరచుగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది’ అని కేపీఎంజీకి చెందిన ఉత్కర్ష్ పల్నిత్కర్ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో విద్య, అవగాహన కల్పించడమే లక్ష్యంగా చొరవతో అందరూ కలిసి పనిచేస్తే ఆరోగ్యకర దేశ లక్ష్యాన్ని అందుకోగలమన్నారు. ఐరాస సదస్సు 2000లో నిర్వచించిన ఆరోగ్య లక్ష్యాల్ని భారత్ సాధించలేదనిఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ప్రోడ్యూసర్స్ ఆఫ్ ఇండియా చీఫ్ శైలేష్ అయ్యంగార్ చెప్పారు.