నాడి పట్టే వారేరీ?
♦ జ్వరాల సీజన్ ప్రారంభమైనా... కనిపించని వైద్యులు
♦ పీహెచ్‌సీల పరిధిలో రాత్రిళ్లు ఏదైనా జరిగితే అంతే సంగతులు
♦ పట్టణాల్లో నివాసం.. పల్లెలకు నామమాత్రం
⇒ పెద్దముడియం మండలంలోని పెద్దపసువుల గ్రామంలో అతిసారం ప్రబలింది. గ్రామస్తులంతా మంచం పట్టారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నా వైద్యుడు లేకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. బుధవారం పది మంది వరకు జమ్మలమడుగులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలివెళ్లి చికిత్స పొందుతున్నారు.
⇒ బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 8 పీహెచ్‌సీలు ఉన్నాయి. 20 మంది డాక్టర్లు పని చేయాల్సి ఉండగా, నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా 16 మందిలో 8 మంది కడప, మైదుకూరు తదితర ప్రాంతాల నుంచి రోజూ వచ్చి పోతున్నారు.
⇒ పులివెందుల నియోజకవర్గంలో 11 పీహెచ్‌సీలకు గానూ తొండూరు, కొరగుంటపల్లి, నల్లపరెడ్డిపల్లి, చక్రాయపేట ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు లేరు. ఇన్‌చార్జిలను నియమించినా వచ్చేది అంతంత మాత్రమే. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
⇒ పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా గ్రామీణజనం ఆసుపత్రుల వైపు పరుగు తీయాల్సిన పరిస్థితి.. అదే జ్వరాల సీజన్ అయితే అక్కడే ఉండాల్సి రావచ్చు.. అయితే రానురాను ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకంపోతోంది.. వైద్యులు సమయానికి రాకపోవడం, హెడ్‌క్వార్టర్లలో ఉండకపోవడమే సమస్యకు మూలకారణం.
సాక్షి, కడప : పని చేసే చోటే ఉంటూ రోగి నాడి పట్టి వైద్యం చేసే డాక్టర్లు జిల్లాలో రోజురోజుకు తగ్గిపోతున్నారు. పట్టణాల్లో నివాసం.. చుట్టపు చూపుగా ఆస్పత్రులకు రావడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకులు పట్టించుకోని తీరుతో పలువురు వైద్యులు ‘ఆడిందే ఆట, పాడిందే పాట’గా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు వైద్యుల పని తీరును పర్యవేక్షించాల్సిన కొందరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు సైతం హెడ్ క్వార్టర్లలో ఉండకపోవడంతో ఎక్కడికక్కడ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. జ్వరాల సీజన్ ప్రారంభమైనా చాలా మంది డాక్టర్లు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హెడ్ క్వార్టర్లలో ఉండాలని ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ జారీ చేసినా ఎవరికీ పట్టడం లేదు. జ్వరాలతో గ్రామీణ జనం మంచం పడుతున్నా తమకేమీ పట్టనట్లు పట్టణాల్లో ఉంటున్నారు.
అతి కొద్దిమంది వైద్యులు మినహా..
జిల్లాలో సుమారు 75కి పైగా పీహెచసీలు ఉండగా, అందులో 24 గంటలు పని చేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. అన్నింటిలోనూ ఒక పక్క సిబ్బంది సమస్య వేధిస్తుండగా, మరో పక్క డాక్టర్ల కొరత ఇబ్బంది పెడుతోంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో సుమారు 133 మంది డాక్టర్లు పని చేస్తుండగా, హెడ్ క్వార్టర్లలో ఉన్న డాక్టర్ల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. ఏ డివిజన్‌ను పరిశీలించినా ఒకరో, ఇద్దరో మినహా ఎక్కువ మంది కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. అంతా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నా పట్టణాల్లో నివాసముంటూ సమయపాలన కూడా పాటిం చడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. కేవలం జిల్లాలో 25 నుంచి 30 మంది వైద్యులు మాత్రమే ఏదో హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓలదీ అదే పరిస్థితి: ప్రస్తుతం వర్షా కాల సీజన్‌తోపాటు జ్వరాల సీజన్ కూడా ఆరంభమైంది. జూన్ నుంచి దాదాపు సెప్టెంబరు, అక్టోబ రు వరకు అనేక రకాల జబ్బులు వెంటాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ అందుబాటులో ఉండి పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ స్థాయి అధికారులు కూడా హెడ్ క్వార్టర్లలో ఉండకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. కిందిస్థాయి అధికారులను మందలించే పరిస్థితిలో ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా హెడ్ క్వార్టర్లలో లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెడ్‌క్వార్టర్లలో ఉన్నతాధికారులు ఉంటే కిందిస్థాయిలో సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
ప్రభుత్వం జీఓ జారీ చేసినా....
రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రత్యేకంగా జీఓ నంబర్: 602ను జారీ చేసింది. పీహెచ్‌సీలకు కేటాయించిన డాక్టర్లు ఎక్కడికక్కడ కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని నిబంధనలు తీసుకొస్తూ జారీ చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఎక్కడో ఉండి మరెక్కడో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకంగా జీఓ జారీ చేసిన నేపథ్యంలో హెడ్ క్వార్టర్లలో ఉండని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇతరులు భయపడే అవకాశముంటుంది. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో పలువురు ఇష్టానుసారంగా విధు లు నిర్వర్తిస్తూ పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
హెడ్ క్వార్టర్లలో కచ్చితంగా ఉండాల్సిందే!
జిల్లాలోని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా కేటాయించిన హెడ్ క్వార్టర్లలో ఉండాల్సిందేనని డీఎంహెచ్‌ఓ సత్యనారాయణరాజు తెలిపారు. హెడ్ క్వార్టర్లలోనే ఉండాలని 2015లోనే ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. వర్షాకాలం నేపథ్యం లో రోగులకు ఏదైనా జరిగితే బాధ్యత వారిదేనన్నారు.