నేలబారు సేవలే.. | staff shortages in distict hospitals | Sakshi
Sakshi News home page

నేలబారు సేవలే..

Published Fri, Jul 1 2016 1:34 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

నేలబారు సేవలే.. - Sakshi

నేలబారు సేవలే..

వైద్యం.. మృగ్యం
కానరాని డాక్టర్లు పీడిస్తున్న సిబ్బంది కొరత
పలుచోట్ల అటెండర్లే ఆల్‌రౌండర్లు
పట్టని పారిశుద్ధ్యం పీహెచ్‌సీల పనితీరు ఇదీ..
‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతం

 నిరుపేదల వైద్యానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. రోగం నయమవుతుందన్న ఆశతో పేదలు ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుంటారు. నయమయ్యేది దేవుడెరుగు... కానీ సకాలంలో వైద్యం అందక రోగం తిరగబెడుతోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. సిబ్బంది కొరత, డాక్టర్లు లేక వైద్యం అందడం లేదు. వైద్యులు లేక ఆపరేషన్ థియేటర్లకు తాళాలు పడ్డాయి. చాలాచోట్ల ఫార్మాసిస్టులు, అటెండర్లే వైద్యం అందిస్తున్నారు. కనీస వసతులు కరువయ్యాయి.  చిరిగిన బెడ్లు వెక్కిరిస్తున్నాయి. విద్యుత్, మంచినీటి సమస్యలు వేధిస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్య ఇబ్బంది పెడుతోంది. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. మొత్తానికి జిల్లాలో పీహెచ్‌సీల నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందన్న విషయం గురువారం నాటి ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమైంది. 

చిన్నశంకరంపేట పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఓ స్టాఫ్ నర్స్ డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఉన్న సిబ్బందిసైతం సమయ పాలన పాటించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. డిప్యూటేషన్‌పై నియమితులైన వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. సిబ్బంది కొరత సైతం తీవ్రంగా వేధిస్తుంది.

పాపన్నపేటలో ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, మేల్ సూపర్‌వైజర్, మరో ఇద్దరు ఫిమేల్ సూపర్‌వైజర్లు, ముగ్గురు సెకండ్ ఏఎన్‌ఎంలతోపాటు మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నీటి సమస్య తీవ్రంగా ఉంది.

మెదక్ మండలం సర్ధనలో వైద్యుడు డిప్యూటేషన్‌పై నియమితులయ్యారు. ఆయన వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే వస్తారు. ఆస్పత్రి ఆవరణలో గల బోరుమోటార్‌ను బాగుచేయించకపోవడంతో నీటి తిప్పలు తప్పడం లేదు.

సదాశివపేట మండలం ఆత్మకూర్‌లో ఇద్దరు వైద్యులకు గాను ఎండేళ్ల నుంచి ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క డాక్టర్ కూడా ఎప్పుడు వస్తారో తెలియదు. వీరికి స్టాఫ్ నర్సు, నర్సులే వైద్యం అందిస్తుంటారు.

టేక్మాల్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు పాడైపోవడంతో డ్రమ్ములో నీటి నిల్వ చేసుకుని వినియోగిస్తున్నారు.

నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

వెల్దుర్తిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు. డాక్టర్‌తోపాటు రెండు స్టాప్ నర్సు, మూడు ఏఎన్‌ఎం,ఫార్మాసిస్టు, మేల్‌సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచాలున్నా పరుపులు సరిగ్గా లేవు. సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు.

కొల్చారం మండలంలో కొల్చారం, రంగంపేట పీహెచ్‌సీల పనితీరు అధ్వానంగా ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. సాయంత్రం వేళ ఓపీ నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి.

కౌడిపల్లిలో 24 గంటల పీహెచ్‌సీ ఉంది. ఇక్కడ ముగ్గురు డాక్టర్లకు గాను ఒక్కరే ఉన్నారు. ఏడు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యం కోసం వచ్చే గర్భిణులు అనేక అవస్థలు పడుతున్నారు.

హత్నూర మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో సర్జన్లు లేక ఆపరేషన్ థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి.

శివ్వంపేట పీహెచ్‌సీలో ఒకే వైద్యుడు ఉండడంతో సర్జన్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్ మూత పడింది.

జహీరాబాద్ మండలం మొగుడంపల్లిలో రాత్రి పూట వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

కోహీర్ మండలం దిగ్వాల్‌లో ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు పీహెచ్‌సీ ఆవరణలో స్వైరవిహారం చేస్తున్నాయి.

ఝరాసంగంలో రెగ్యులర్ వైద్యుడు లేకపోవడంతో కాంట్రాక్టు వైద్యుడే సేవలందిస్తున్నారు. ఒకే వైద్యుడి ఉండడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిన్నారంలో సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై బొల్లారం, పటాన్‌చెరుల్లోని ఆసుపత్రులకు పంపారు. కానుకుంట పీహెచ్‌సీ పరిస్థితి అధ్వానంగా మారింది.  ఏడాది కాలంగా ఆసుపత్రికి రెగ్యులర్ వైద్యులు లేరు.

రామచంద్రాపురంలో సరిపడా మందులున్నా సిబ్బంది, గదుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా గదులు లేక మహిళా సిబ్బంది నరకయాతన పడుతున్నారు.

గజ్వేల్ మండలం అహ్మదీపూర్, శ్రీగిరిపల్లి పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

జగదేవ్‌పూర్ మండలం తిగుల్, జగదేవ్‌పూర్‌లో సరిపడా సిబ్బంది లేక సరైన వైద్యం అందడం లేదు. వైద్యులు స్థానికంగా ఉండకపోవడంతో ఎప్పుడు వస్తారో తెలియదు. వైద్యుల కోసం రోగులు నిరీక్షించక తప్పడం లేదు.

కొండపాక, కుకునూరుపల్లి గ్రామాలతోపాటు ములుగు, సింగన్నగూడ సిబ్బంది కొరత ఉంది.

వర్గల్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బోరుబావిలో నీరు అడుగంటడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పారిశుద్ధ్య లోపాన్ని ఎత్తి చూపుతుంది. వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఫార్మాసిస్ట్ వైద్యం అందిస్తున్నారు.

దుబ్బాక ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లకు గాను ముగ్గురే ఉన్నారు. జనం సీజనల్ వ్యాధుల బారిన పడితే ఉన్న వైద్యుల పైనే భారం పడుతుంది. తొగుటలో వైద్యులు సకాలంలో రావడం లేదు. నెలలో రెండు, మూడు రోజులు వస్తున్నట్టు సమాచారం. రోగి చేయి పట్టాలన్నా ఫార్మాసిస్టే దిక్కు.

మిరుదొడ్డిలో సిబ్బంది ఎప్పుడంటే అప్పుడే పీహెచ్‌సీకి వస్తుంటారు.సమయ పాలన లేదు. పరిసరాలు అపరిశుభ్రంగానే ఉన్నాయి.

దౌల్తాబాద్, రాయపోలు, ఇందుప్రియాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

చేగుంటలో సాయంత్రం 4 వరకే వైద్య సేవలందుతున్నాయి. ఆ తరువాత అయితే ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

నంగునూరు రాజగోపాల్‌పేటలో ైవె ద్యులు కొరత ఉంది. చిన్నకోడూరు, ఇబ్రహీంపూర్‌లో, పుల్లూరు, చింతమడక, నారాయణరావుపేటో వైద్యుల సమస్య లేకపోయినా సిబ్బంది పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది.

కంగ్టి, పెద్దశంకరంపేట, కల్హేర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తేలిక పాటి జబ్బులకు నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కల్హేర్ ఆసుపత్రిలో నిత్యం దాదాపు 300కు పైగా రోగులకు స్టాఫ్ నర్సులే పరీక్షలు నిర్వహిస్తారు.

ఖేడ్ మండలం తుర్కపల్లిలో వైద్యులు లేక డెలివరీలు కావడం లేదు. కంగ్టి మెడికల్ ఆఫీసర్ మూడేళ్ళుగా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఫలితంగా ఇక్కడి వారు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement