బావా బాగున్నావా అని పలకరించినందుకు.. | Opponents Attack on Former sarpanch | Sakshi
Sakshi News home page

బావా బాగున్నావా అని పలకరించినందుకు..

Published Fri, Jul 17 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

Opponents Attack on Former sarpanch

మాజీసర్పంచ్‌ను స్తంభానికి కట్టేసికొట్టిన ప్రత్యర్థులు
 గ్రామంలో ఉద్రిక్తవాతావరణం
 పోలీస్ పికెట్ ఏర్పాటు

 హాలియా : బావా బాగున్నావా అంటూ పలకరించినందుకు మండలంలోని పులిమామిడి గ్రామంలో మాజీ సర్పంచ్ ఎల్లేశంను అదే గ్రామానికి చెందిన వైరివర్గం వారు విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులిమామిడి గ్రామంలో మే31న దైదగిరి అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నకిరేకంటి నగేశ్ అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేయడంతో గ్రామంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు 10 రోజుల పాటు గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు.
 
   ఈ హత్య కేసులో మాజీ సర్పంచ్ ఎల్లేశం..  నరికేకంటి నగేశ్ వైపు పెద్దమనిషిగా వ్యవహరించాడు. గురువారం రాత్రి గ్రామ  ప్రధాన సెంటర్‌లో దైదగిరి తండ్రి వెంకటయ్య..  ఎల్లేశానికి ఎదురుపడటంతో.. బావా బాగున్నావా అంటూ ఎల్లేశం.. వెంకటయ్యను మర్యాదపుర్వకంగా పలుకరించి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో వెంకటయ్య తన ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మనోన్ని చంపినవారి వైపు పెద్దమనిషిగా ఉండడంతో పాటు చేసిందంతా చేసి తమకేమీతెలియదన్నట్లు బావా బాగున్నావా అంటూ పలకరిస్తాడా అంటూ దైదగిరి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.
 
 వారు  ఎల్లేశం వద్దకు అతనిపై దాడి చేసి గ్రామ సెంటర్‌కు తీసుకువచ్చిమోకులతో కట్టేసి చితకబాదారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసుకు సమాచారం అందించారు. దీతో ఎస్‌ఐ సురేష్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి  వెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి ఉన్న ఎల్లేశం కట్లు విప్పారు. ఎల్లేశానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లేశాన్ని కట్టేసిన వారు పరారయ్యారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాట్లు చేశారు. సీఐ పార్థసారథి, ఎస్‌ఐ సురేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ఎల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement