Halliya
-
బావా బాగున్నావా అని పలకరించినందుకు..
మాజీసర్పంచ్ను స్తంభానికి కట్టేసికొట్టిన ప్రత్యర్థులు గ్రామంలో ఉద్రిక్తవాతావరణం పోలీస్ పికెట్ ఏర్పాటు హాలియా : బావా బాగున్నావా అంటూ పలకరించినందుకు మండలంలోని పులిమామిడి గ్రామంలో మాజీ సర్పంచ్ ఎల్లేశంను అదే గ్రామానికి చెందిన వైరివర్గం వారు విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులిమామిడి గ్రామంలో మే31న దైదగిరి అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నకిరేకంటి నగేశ్ అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేయడంతో గ్రామంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు 10 రోజుల పాటు గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు. ఈ హత్య కేసులో మాజీ సర్పంచ్ ఎల్లేశం.. నరికేకంటి నగేశ్ వైపు పెద్దమనిషిగా వ్యవహరించాడు. గురువారం రాత్రి గ్రామ ప్రధాన సెంటర్లో దైదగిరి తండ్రి వెంకటయ్య.. ఎల్లేశానికి ఎదురుపడటంతో.. బావా బాగున్నావా అంటూ ఎల్లేశం.. వెంకటయ్యను మర్యాదపుర్వకంగా పలుకరించి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో వెంకటయ్య తన ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మనోన్ని చంపినవారి వైపు పెద్దమనిషిగా ఉండడంతో పాటు చేసిందంతా చేసి తమకేమీతెలియదన్నట్లు బావా బాగున్నావా అంటూ పలకరిస్తాడా అంటూ దైదగిరి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారు ఎల్లేశం వద్దకు అతనిపై దాడి చేసి గ్రామ సెంటర్‌కు తీసుకువచ్చిమోకులతో కట్టేసి చితకబాదారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసుకు సమాచారం అందించారు. దీతో ఎస్ఐ సురేష్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి ఉన్న ఎల్లేశం కట్లు విప్పారు. ఎల్లేశానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లేశాన్ని కట్టేసిన వారు పరారయ్యారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాట్లు చేశారు. సీఐ పార్థసారథి, ఎస్ఐ సురేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. -
ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి
హాలియా :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడి అన్నారు. బుధవారం హాలియాలోని సుందరయ్య భవన్లో జరిగిన సీపీఎం 5వ డివిజన్ మహాసభలో మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బీజేపీ నాయకులు ప్రస్తుతం చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. దేశంలో కోట్లాదిమంది పొట్టకొట్టే విధంగా ఉపాధి హామీ చట్టానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తోంన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం కరువు, కరెంట్ కోతలు, గిట్టుబాటు ధరలు వంటి సమస్యలతో సతమతమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద మొదటి జోనుకు వరిసాగుకు నీటి విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరందాసు గోపి, నాయకులు డబ్బికార్ మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదులు, కత్తి శ్రీనివాసరెడ్డి, దైద శ్రీను, దుబ్బ రాంచంద్రయ్య, వనమాల కామేశ్వర్, సోమయ్య, ప్రతాఫ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘హాలియా’కు హైవే టెన్షన్
హాలియా :హాలియా వాసులకు హైవే టెన్షన్ పట్టుకుంది. జిల్లాలోని నార్కట్‌పల్లి నుం చి నాగార్జునసాగర్ వరకు సాగుతున్న జాతీయ రహదారి 565 విస్తరణ పనులు ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రహదారి విస్తరణలో తమ దుకాణాలను ఎక్కడ కూల్చివేస్తారోనని వ్యాపారుల్లో భయం పట్టుకుంది. బైపాస్ ద్వారా రహదారిని మళ్లిం చాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. చురుగ్గా పనులు నార్కట్‌పల్లి నుంచి నాగార్జునసాగర్ మధ్య 86 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.200 కోట్లతో చేపట్టిన రోడ్డు విసర్తణ పనులను జీవీఆర్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే సర్వే పనులు పూర్తి కాగా, జిల్లా కేంద్రం నుంచి దాదాపు పది కిలోమీటర్ల మేర రహదారి పనులు పూర్తి కావస్తున్నాయి. కాగా, ఈ పనులను కాంట్ట్రాక్టు దక్కించుకున్న సదరు కంపెనీ ఏడాదిన్న కాలంలో పూర్తి చేయాల్సి ఉంది. ఏడాదిగా తగ్గిన అభివృద్ధి వేగం హైవే విస్తరణ ప్రకటనతో హాలియా ఏడాదిగా అభివృద్ధి వేగం తగ్గిపోయింది. గత ఎన్నికలకు ముందు జిల్లాలోని కోదాడ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాజడ్జర్ల వరకు నాలుగులైన్ల రహదారి పరిశీలనలో ఉందని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు ఎన్‌హెచ్ 565 రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో హాలియా వాసు ల్లో ఆందోళన ప్రారంభమైనది. 565 రహదారికి రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్లు, కోదాడ నుంచి జడ్చర్ల వరకు 75ఫీట్లు పోతుందని పుకార్లు షికార్లు చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. చర్చోపర్చలు రహదారిని విస్తరణలో ఎన్ని ఫీట్ల రోడ్డు పోతుందనే విషయంపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఫోర్వే నిర్మాణానికి ఒకవేళ 75 ఫీట్ల మేర రోడ్డు పోతే హాలియాలో ఒక దుకాణ సముదాయం కూడా మిగిలే పరిస్థితి లేదు. దీంతో తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు మదనపడుతున్నారు. మండల కేంద్రంలో 50 ఫీట్లు, శివారు నుంచి 75ఫీట్ల రోడ్డును నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తగ్గిన ‘రియల్’ జోరు ఏడాది కాలంగా మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపార జోరు తగ్గింది. నార్కట్‌పల్లి నాగార్జున సాగర్ రోడ్డు విస్తరణ జరుగుతుండటం, కోదాడ నుంచి జడ్జర్ల వరకు ఫోర్వే లైన్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందన్న విషయం తెలియడంతో రోడ్డు వెంట ఉన్న దుకాణాలను కోనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు రెండేళ్లుగా పంట దిగుబడి ఆశాజజనకంగా లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. -
సినీఫక్కీలో చోరీ
* బంగారం దొరికిందని నమ్మబలికి.. * మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ * హాలియాలో ఘటన హాలియా: గుర్తుతెలియని వ్యక్తులు మహిళకు మాయమాటలు చెప్పి సినీఫక్కీలో బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఈ ఘటన హాలియాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనుముల గ్రామానికి చెందిన పావనగండ్ల సత్యవతి కొద్దిరోజులుగా నడుమునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు ఉదయం ఆటోలో హాలియాకు వచ్చింది. మిర్యాలగూడ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఫలానా ఆస్పత్రి ఎక్కడా అంటూ సత్యవతిని అడిగింది. తనకు కూడా తెలియదని సత్యవతి బదులిచ్చింది. దీంతో సదరు గుర్తుతెలియని మహిళ మాటలు కలిపి సత్యవతితో కలిసి ముందుకు సాగింది. ఇంతలో మరో ఇద్దరు, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎదురొచ్చి మాది రూ.3 లక్షల విలువ గల బంగారు కడ్డీ పోయిందని, అది మీకు దొరికిందా అని అడిగారు. దీంతో సత్యవతి, సదరు గుర్తుతెలియని మహిళ దొరకలేదని సమాధానం చెప్పడంతో వారు వెళ్లిపోయారు. బంగారు కడ్డీ దొరికిందని.. బంగారం పోయిందని అడిగిన వారు నాలుగు అడుగులు ముందుకేసిన తరువాత సదరు గుర్తుతెలియని మహిళ ఆ బంగారు కడ్డీ నాకే దొరికిందని సత్యవతితో చెప్పింది. ఎవ్వరికి చెప్పనంటే ఇందులో సగం నీకు ఇస్తానని సత్యవతితో పేర్కొంది. ఇక్కడ ఎవరైనా చూస్తారని, కాస్త ముందుకెళ్లి చెరిసగం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో ఇద్దరూ కలిసి ఎస్సీ కాలనీవైపు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో గుర్తుతెలియని వ్యక్తి వద్దకు వెళ్లి బేరసారాలు మొదలు పెట్టారు. బంగారు కడ్డీ తుంచడం వీలుకాదని.. నీ మెడ మీద ఉన్న బంగారు పుస్తెలతాడు ఇస్తే ఈ బంగారు కడ్డీ ఇస్తామని చెప్పారు. అందుకు సత్యవతి ససేమిరా అనడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. నమ్మకం లేకపోతే మా సెల్ నంబర్ తీసుకో అంటూ హుంకరించాడు. దీంతో చేసేది లేక సత్యవతి బంగారు పుస్తెలతాడు ఇచ్చి, ఆ కడ్డీని తీసుకుంది. సెంటర్‌కు వచ్చి ఈ విషయాన్ని ఫోన్లో భర్తకు తెలపడంతో మోసపోయావంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ సురేష్‌కుమార్‌తో కలిసి ఎస్సీ కాలనీకి వచ్చి చూసే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. తీరా పోలీసులు ఆ బంగారు కడ్డీని పరీక్షించగా నకిలీదని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
గ్రేట్‌వే స్కూల్లో పోలీసుల విచారణ
హాలియా మండలంలోని తిరుమలగిరిలో ఉన్న గ్రేట్‌వే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో సోమవారం హాలియా సీఐ శివశంకర్‌గౌడ్, ఎస్ఐ సురేష్‌కుమార్ విచారణ నిర్వహించారు. ఈ నెల 8న పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఎల్లాపురం తండాకు చెందిన రమావత్ చందుకు తలకు దెబ్బతగలడంతో మృతి చెందాడు. ఈ విషయమై వారు విచారణ నిర్వహించారు. ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులను పిలిచి విచారించారు. విద్యార్థిని ఎవరైనా కొట్టారా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగారు. ఎవ్వరూ కొట్టలేదని వారు సమాధానం చెప్పడంతో వారి వాగ్మూలాన్ని వీడియోలో రికార్డు చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు కలెక్టర్ టి. చిరంజీవులు ఆదేశాల మేరకు గ్రేట్‌వే స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ డీఈఓ విశ్వనాథరావు ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ వై. ఝాన్సీలక్ష్మి సోమవారం విలేకరులకు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సెలవుదినంనాడు పాఠశాల నిర్వహించడంతో పాటు విద్యార్థి మృతికి కారణమయ్యారని పేర్కొంటూ పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
ప్రేమజంట పరార్
హాలియా : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలిసి అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేయడం, దానికి వారు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో హాలియాలోని ఎస్సీ కాలనీలో తీ వ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన మారపాక నరేష్(20), పడిగిమర్రి సునిత(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమవ్యవహరం పెద్దలకు తెలియడంతో గతంలోనే మందలించారు. దీంతో ఇద్దరు సోమవారం ఇళ్ల నుంచి పారిపోయారు. సునిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిం చారు. దీంతో వారు నరేష్ పెంపుడు తండ్రి వెంకటయ్యను పిలిపించి ఆచూకీ కోసం విచారించారు.వారి ఆచూకీ తెలుసుకుని తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తుల దాడి వెంకటయ్య మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు వచ్చి దాడిచేశారు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు వెంకటయ్యను చితకబాదారు. బాధితుడి అరుపులు విని చట్టుపక్కల వారు రావడంతో గుర్తుతెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన వెంకటయ్యను తొలుత సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. యువతి బంధువు ఇంటిపై.. మారపాక వెంటయ్యపై దాడిచేయించింది నకిరేకంటి సైదులే అని ఆరోపిస్తూ కాలనీవాసులు సుమారు 200 మం ది అతడి ఇంటిపై దాడిచేశారు. దీంతో సైదులు భయాందోళన చెంది ఇంటి వెనుక నుంచి పరారయ్యాడు. కాంగ్రెస్ నాయకుడు కుందూరు వెంకట్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో కాలనీవాసులు సైదులును అప్పగించాలని కోరినా వెంకట్‌రెడ్డి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు అతడి ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని పోలీ సులు వచ్చి కాలనీవాసులను చెదరగొట్టి సైదులును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాలనీని సందర్శించిన ఏఎస్పీ ఇరువర్గాల ఘర్షణ విషయం తెలుసుకుని ఏఎస్పీ రమారాజేశ్వరి హాలియా ఎస్సీ కాలనీని సందర్శించారు. ఘర్షణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాలనీలో పది మంది ఎస్ఐలు, సీఐతో పాటు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆమె వెంట మిర్యాలగూడ డీఎస్పీ కుంచ మోహన్, సీఐ శివశంకర్‌గౌడ్, ఎస్ఐలు సురేష్‌కుమార్, రాజశేఖర్‌గౌడ్ ఉన్నారు. కేసు నమోదు సునీతను అపహరించాడనే అభియోగంతో నరేష్‌పై కిడ్నాప్ కేసు,పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన సుమారు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పనులు చూస్తే..లో లెవల్
హాలియా/తిప్పర్తి : జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించిన ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ (వరద కాల్వ)..నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాల్వ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడం..కొన్నిచోట్ల పూడిపోయి..కంపచెట్లు అల్లుకోవడం..బలహీనంగా కరకట్టల నిర్మాణం.. ఇలా అనేక కారణాలతో కాల్వకు నీటిని విడుదల చేసినప్పుడు సాఫీగా వెళ్లక ఒత్తిడితో గండ్లు పడుతున్నాయి. అష్టాకష్టాలకోర్చి వేసిన పంటలు నీటమునుగుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 1997లో వరద కాల్వ పనులను చేపట్టారు. కానీ కాల్వ నిర్మాణ పనులు నత్తకు నడకనేర్పిన చందంగా సాగుతుండటంతో నేటికీ పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా కాల్వలోకి నీటిని పంప్‌చేస్తారు. రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన కాల్వ నిర్మాణ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి హయాంలో ఏడేళ్లలో రూ.30 కోట్లను ఖర్చు చేసి 27 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. ఆ తరువాత అధికారంలోకి వ చ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పెరిగిన ధరల ప్రకారం వరద కాల్వ, పంప్‌హౌస్ నిర్మాణ వ్యయాన్ని రూ.212కోట్లగా నిర్ణయించి ఈపీసీ విధాన ంలో తిరిగి టెండర్లు పిలిచారు. ఇందులో పంపుహౌస్ నిర్మాణం కోసం 108 కోట్లు, కాల్వల నిర్మాణానికి రూ.104 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2009లోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం కావడం.. భూసేకరణకు రైతులు ససేమిరా అనడంతో కాల్వ నిర్మాణం ఆసల్యమైంది. అసంపూర్తి కాల్వలు.. పెద్దవూర మండలం పుల్యానాయక్‌తండా నుంచి వేములపల్లి మండలం మొల్కపట్నం వరకు 85.30 కిలోమీటర్ల తీయాల్సి ఉంది. అలాగే మొత్తం 42 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తీయాల్సి ఉండగా కేవలం 29 డిస్ట్రిబ్యూటరీలను మాత్రమే తీసి వదిలేశారు. ఇక పిల్ల కాల్వల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో కేవలం 66 కిలోమీటర్లు వరకే నీరు వస్తోంది. తిప్పర్తి మండలం మాడ్గులపల్లి సమీపంలో రైల్వేలైన్ వద్ద 70.947 కిలోమీటర్ల వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం... ఇదే గ్రామ శివారులో 72.820 కిలోమీటర్ వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై బ్రిడ్జి నిర్మాణం..అదే విధంగా 72.55 కిలోమీటర్ నుంచి73.6 కిలోమీటర్ వరకు మొత్తం 1 కిలోమీటరు పొడవు కాల్వ పని ఇంచుకూడ మొదలు కాలేదు. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు 65వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు 13 డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదు. ఇక..పంప్‌హౌస్ నిర్మాణంలో జాప్యం కారణంగా సాగర్ జలాశయంలో నీరున్నప్పటికి వరదకాల్వ కింద రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఏటా వేలాది టీఎంసీల నీరు వృథాగా దిగువ కృష్ణానదిలో కలిసిపోతున్నప్పటికీ పాలకులు కాల్వ నిర్మాణం పూర్తి చేయకపోవడం శోచనీయం. -
చివరికి నీరేది..!
హాలియా :‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని ఉన్నట్లు’ ఉంది నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూముల రైతుల దుస్థితి. సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా చివరిభూములకు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయకట్టులో నాట్లు తుదిదశకు చేరుకుం టున్న తరుణంలో ఎడమకాల్వపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలోకి ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా నీరు చేరింది. దీంతో అదేరోజు నుంచి శనివారం దాకా ఎడమకాల్వకు నీటివిడుదలను నిలిపివేశారు. టర్బైన్ల మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో రెండురోజులుగా నీటివిడుదలను కుదించారు. సగటున 10 వేల క్యూసెక్కుల దాకా విడుదలయ్యే నీరు 2వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో కాల్వల చివరకు నీరెక్కడం లేదు. దీంతో రైతులు నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎడమకాల్వ పరిధిలో నల్లగొండ జిల్లాలో స్థిరీకరించిన ఆయకట్టు 2.99 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి దాకా 2.35 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఎత్తిపోతల పరిధిలోని 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 40 వేల ఎకరాల్లో నాటు వేశారు. ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచాలి జల విద్యుత్ కేంద్రంలోనికి నీరు చేరిందంటూ ఎన్ఎస్పి అధికారులు మూడు రోజులుగా ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించారు. ఇప్పుడు చివరి కాల్వలకు నీరెక్కలేని పరిస్థితి నాట్లుఎలా వేయాలో అర్థం కావడం లేదు. వెంటనే నీటివిడుదలను పెంచాలి. - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి నాటు ఆగింది ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించడం వల్ల వరినాటు ఆగిపోయింది. కాల్వ చివరి భూముల రైతుల్లో ఇప్పుడే వరినాట్లు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎడమ కాల్వకు నీటివిడుదల తగ్గించడం రైతులకు ఇబ్బందే. విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేయాలి. - అల్లి పెద్దిరాజు, రైతు, బోయగూడెం -
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
హాలియా/దేవరకొండ: గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిని నిగ్గుతేల్చేందుకు జిల్లాలో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం హాలియా, దేవరకొండలలోని హౌసింగ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హాలియా మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా హౌసింగ్ పీడీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాల్లో 2004 నుంచి 2014 వరకు మంజూరైన ఇళ్లను, వాటి నిర్మాణాలను పరిశీలిస్తామన్నారు. ఇళ్లను నిర్మించకుండా బిల్లులు కాజేసిన వారిపైన, బినామీ వ్యక్తులపై బిల్లులు కాజేసిన వారిపైన, అందుకు సహకరించిన అధికారులపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వివరించారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో హౌసింగ్ అధికారులు చేసిన ఎంబీ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 11 నుంచి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్ఐలు రాజనర్సింహ, తిరపతిరావు తదితరులు ఉన్నారు. దేవరకొండలో.. సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం దేవరకొండ కార్యాలయంలో కూడా రికార్డులు పరిశీలించింది. బృందం సభ్యులు కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారం, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.