పనులు చూస్తే..లో లెవల్ | Flood canal works not completed since 17 years | Sakshi
Sakshi News home page

పనులు చూస్తే..లో లెవల్

Published Mon, Sep 29 2014 1:42 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

Flood canal works not completed since 17 years

 హాలియా/తిప్పర్తి : జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించిన ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ (వరద కాల్వ)..నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాల్వ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడం..కొన్నిచోట్ల పూడిపోయి..కంపచెట్లు అల్లుకోవడం..బలహీనంగా కరకట్టల నిర్మాణం.. ఇలా అనేక కారణాలతో కాల్వకు నీటిని విడుదల చేసినప్పుడు సాఫీగా వెళ్లక ఒత్తిడితో గండ్లు పడుతున్నాయి. అష్టాకష్టాలకోర్చి వేసిన పంటలు నీటమునుగుతున్నాయి.

 జిల్లాలో  నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 1997లో వరద కాల్వ పనులను చేపట్టారు. కానీ కాల్వ నిర్మాణ పనులు నత్తకు నడకనేర్పిన చందంగా సాగుతుండటంతో నేటికీ పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా కాల్వలోకి నీటిని పంప్‌చేస్తారు. రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన కాల్వ నిర్మాణ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది.

కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి హయాంలో ఏడేళ్లలో రూ.30 కోట్లను ఖర్చు చేసి 27 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. ఆ తరువాత అధికారంలోకి వ చ్చిన  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  పెరిగిన ధరల ప్రకారం వరద కాల్వ, పంప్‌హౌస్  నిర్మాణ వ్యయాన్ని రూ.212కోట్లగా నిర్ణయించి ఈపీసీ విధాన ంలో తిరిగి టెండర్లు పిలిచారు. ఇందులో పంపుహౌస్ నిర్మాణం కోసం 108 కోట్లు, కాల్వల నిర్మాణానికి రూ.104 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2009లోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం కావడం.. భూసేకరణకు రైతులు ససేమిరా అనడంతో కాల్వ నిర్మాణం ఆసల్యమైంది.

 అసంపూర్తి కాల్వలు..
 పెద్దవూర మండలం పుల్యానాయక్‌తండా నుంచి వేములపల్లి మండలం మొల్కపట్నం వరకు 85.30 కిలోమీటర్ల తీయాల్సి ఉంది. అలాగే మొత్తం 42 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తీయాల్సి ఉండగా కేవలం 29 డిస్ట్రిబ్యూటరీలను మాత్రమే తీసి వదిలేశారు. ఇక పిల్ల కాల్వల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో కేవలం 66 కిలోమీటర్లు వరకే నీరు వస్తోంది. తిప్పర్తి మండలం మాడ్గులపల్లి సమీపంలో రైల్వేలైన్ వద్ద 70.947 కిలోమీటర్ల వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం... ఇదే గ్రామ శివారులో 72.820 కిలోమీటర్ వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై బ్రిడ్జి నిర్మాణం..అదే విధంగా 72.55 కిలోమీటర్ నుంచి73.6 కిలోమీటర్ వరకు మొత్తం 1 కిలోమీటరు పొడవు కాల్వ పని ఇంచుకూడ మొదలు కాలేదు. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు.

 దీనికితోడు 65వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు 13 డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదు. ఇక..పంప్‌హౌస్  నిర్మాణంలో జాప్యం కారణంగా సాగర్ జలాశయంలో నీరున్నప్పటికి వరదకాల్వ కింద రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఏటా వేలాది టీఎంసీల నీరు వృథాగా దిగువ కృష్ణానదిలో కలిసిపోతున్నప్పటికీ పాలకులు కాల్వ నిర్మాణం పూర్తి చేయకపోవడం శోచనీయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement