* బంగారం దొరికిందని నమ్మబలికి..
* మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ
* హాలియాలో ఘటన
హాలియా: గుర్తుతెలియని వ్యక్తులు మహిళకు మాయమాటలు చెప్పి సినీఫక్కీలో బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఈ ఘటన హాలియాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనుముల గ్రామానికి చెందిన పావనగండ్ల సత్యవతి కొద్దిరోజులుగా నడుమునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు ఉదయం ఆటోలో హాలియాకు వచ్చింది. మిర్యాలగూడ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఫలానా ఆస్పత్రి ఎక్కడా అంటూ సత్యవతిని అడిగింది.
తనకు కూడా తెలియదని సత్యవతి బదులిచ్చింది. దీంతో సదరు గుర్తుతెలియని మహిళ మాటలు కలిపి సత్యవతితో కలిసి ముందుకు సాగింది. ఇంతలో మరో ఇద్దరు, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎదురొచ్చి మాది రూ.3 లక్షల విలువ గల బంగారు కడ్డీ పోయిందని, అది మీకు దొరికిందా అని అడిగారు. దీంతో సత్యవతి, సదరు గుర్తుతెలియని మహిళ దొరకలేదని సమాధానం చెప్పడంతో వారు వెళ్లిపోయారు.
బంగారు కడ్డీ దొరికిందని..
బంగారం పోయిందని అడిగిన వారు నాలుగు అడుగులు ముందుకేసిన తరువాత సదరు గుర్తుతెలియని మహిళ ఆ బంగారు కడ్డీ నాకే దొరికిందని సత్యవతితో చెప్పింది. ఎవ్వరికి చెప్పనంటే ఇందులో సగం నీకు ఇస్తానని సత్యవతితో పేర్కొంది. ఇక్కడ ఎవరైనా చూస్తారని, కాస్త ముందుకెళ్లి చెరిసగం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో ఇద్దరూ కలిసి ఎస్సీ కాలనీవైపు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో గుర్తుతెలియని వ్యక్తి వద్దకు వెళ్లి బేరసారాలు మొదలు పెట్టారు.
బంగారు కడ్డీ తుంచడం వీలుకాదని.. నీ మెడ మీద ఉన్న బంగారు పుస్తెలతాడు ఇస్తే ఈ బంగారు కడ్డీ ఇస్తామని చెప్పారు. అందుకు సత్యవతి ససేమిరా అనడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. నమ్మకం లేకపోతే మా సెల్ నంబర్ తీసుకో అంటూ హుంకరించాడు. దీంతో చేసేది లేక సత్యవతి బంగారు పుస్తెలతాడు ఇచ్చి, ఆ కడ్డీని తీసుకుంది. సెంటర్‌కు వచ్చి ఈ విషయాన్ని ఫోన్‌లో భర్తకు తెలపడంతో మోసపోయావంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సురేష్‌కుమార్‌తో కలిసి ఎస్సీ కాలనీకి వచ్చి చూసే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. తీరా పోలీసులు ఆ బంగారు కడ్డీని పరీక్షించగా నకిలీదని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
సినీఫక్కీలో చోరీ
Published Sat, Nov 22 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement