siniphakki
-
సినీఫక్కీలో
12 తులాల బంగారం అపహరణ పూసపాటిరేగ (నెల్లిమర్ల): మండలంలోని రెల్లివలసకు చెందిన వృద్ధ దంపతుల నుంచి అగంతకులు సినీఫక్కీలో నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ, సరస్వతి దంపతులు శుభకార్యంలో పాల్గొనేందుకు నెల్లిమర్ల మండలం గరికిపేటకు ఈ నెల 9న బయలుదేరారు. విజయనగరం వరకు తమ అల్లుడుకు చెందిన కారులో వెళ్లారు. అక్కడ నుంచి భోజనం చేసేందుకు ఎస్‌కేఎంఎల్ హోటల్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు తారసపడ్డారు. మెడలో బంగారు గొలుసులు ఉంటే దొంగలు అపహరించే ప్రమాదముందని, అందుకే వాటిని తీసి సంచిలో వేసుకోండని అగంతకులు వృద్ధ దంపతులకు సలహా ఇచ్చారు. అంతలో వారి వద్దకు మరో యువకుడు వచ్చాడు. ఆయన మెడలో కూడా బంగారు గొలుసు ఉండడంతో వృద్ధులను నమ్మించడానికి అతనిచేత కూడా గొలుసు తీయించి బ్యాగులో వేయించారు. దీంతో వృద్ధ దంపతులు కూడా తమ వద్ద నున్న నాలుగున్నర తులాల బంగారం గొలుసు, మూడు తులాల పుస్తెల తాడు, తులంన్నర మూడు ఉంగరాలు, అర తులం శతమానం తీశారు. వాటిని వృద్ధురాలి చీర కొంగులో ముడికడుతున్నట్లు సాయం చేసిన అగంతకులు బంగారం స్థానంలో ఇనపముక్కలు కట్టి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. కొద్ది సేపటి తర్వాత చీరకొంగుముడి విప్పిన వృద్ధురాలు అందులో ఇనపముక్కలు ఉండడంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. దీనిపై విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
* సినీఫక్కీలో విరుచుకుపడ్డ దుండగులు * గార్డు నోరు, చేతులకు ప్లాస్టర్ అతికించిన వైనం కాకినాడ క్రైం : కాకినాడలో ముగ్గురు దుండగులు శనివారం అర్ధరాత్రి పేట్రేగిపోయారు. సినీఫక్కీలో ఏటీఎంలోకి చొరబడి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్ అంటించి, అదే ప్లాస్టర్‌తో అతడి చేతులు కట్టేసి ఏటీఎం లోపల గదిలో బంధించారు. ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం లాకరు తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. సెక్యూరిటీ గార్డు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. పెదపూడి మండలం జి. మామిడాడకు చెందిన ద్వారంపూడి భాస్కరరెడ్డి ఓరియన్ సెక్యూర్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడిని సంస్థ ప్రతి నిధులు కాకినాడ సూర్యారావుపేటలోని రామాలయం వీధిలో రాఘవేంద్రస్వామి కోవెల సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా నియమించారు. అతడు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి ఏటీఎం వద్దకు వచ్చారు. ఇద్దరు దుండగులు వారి వద్ద ఉన్న గన్లతో గార్డు భాస్కరరెడ్డిని బెదిరించారు. మరో దుండగుడు అతడి నోటికి ప్లాస్టర్ అతికించాడు. అనంతరం అతడి చేతులను కట్టి ఏటీఎంలోని రూమ్‌లోకి తీసుకువెళ్లి బంధించారు. వారి వెంట తెచ్చుకున్న గునపంతో ఏటీఎంను బద్దలుగొట్టారు. లాకరు బద్దలుకాకపోవడంతో సుమారు గంటపాటు శ్రమించారు. సెక్యూరిటీ గార్డు తప్పించుకునే వీలులేకుండా అక్కడే ఉండి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతకీ సీక్రెట్ లాకరు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి బైకుపై పరారయ్యారు. సుమారు మూడు గంటల సమయంలో బీట్ కానిస్టేబుళ్లు అటుగా వెళ్తుండడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు భాస్కర రెడ్డి కట్లు తెంచుకుని బిగ్గరగా అరిచాడు. అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయాన్ని టూ టౌన్ క్రైం పోలీసులకు తెలిపారు. క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దీనిపై టూ టౌన్ క్రైం ఎస్సై అలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీకేరాయపురం చోరీ వారిపనేనా..? ఇదిలావుండగా శనివారం రాత్రి సామర్లకోట మండలం వీకే రాయపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.రెండు లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే ఆ సంఘటన కూడా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరగడంతో కాకినాడలోని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన దుండగులే వీకే రాయపురం ఆలయంలో చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పనిగా భావిస్తున్నారు. -
వధువుకు 14 ఏళ్లు.. వరుడికి 21 ఏళ్లు
- చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసుల రాకతో నిలిచిపోయిన వివాహం - బోసిపోయిన పెళ్లి మండపం - వెనుదిరిగిన బంధువులు - బాలసదన్‌కు బాలిక తరలింపు ఖిలావరంగల్ : వధువు వయస్సు 14 ఏళ్లు.. వరుడి వయస్సు 21 ఏళ్లు.. మరికొద్ది సేపట్లో వివాహం.. బంధువుల సందడితో ఆ ఫంక్షన్‌హాల్ కళకళలాడుతోంది. అంతలోనే సినీఫక్కీలో అక్కడికి చేరుకున్న 1098 చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులు ఈ పెళ్లిని ఆపండి అంటూ హెచ్చరించారు. దీంతో కొద్ది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన నగరంలోని శివనగర్‌లోని చైత్రరథగార్డ్న్స్లో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ సమీపంలోని ఎస్ఆర్ కాలనీకి చెందిన గంజి సతీష్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సతీష్ అనారోగ్యం బారినపడడంతో తండ్రి కళ్లెదుటే కూతురి పెళ్లి చేయూలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో వారి సమీప బంధువులైన కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన ఆడెపు మోహన్, ఈశ్వరి దంపతుల కుమారుడు చరణ్ (21)తో పెళ్లి చేయూలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం శివనగర్‌లోని చైత్రరథ గార్డ్న్స్లో లాస్య, చరణ్‌కు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో మిల్స్‌కాలనీ కాలనీ ఎస్సై బి, వెంకట్రావు, చైల్డ్‌లైన్ 1098 వలంటీర్లు, జిల్లా సోషల్ ఆక్టీవ్ కమిటీ కౌన్సిలర్ రావుల విజయరాంచంద్రన్ ఫంక్షన్‌హాల్‌కు చేరుకుని ఆ వివాహాన్ని నిలుపుదల చేశారు. అనంతరం వారు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ బాలికను చైల్డ్‌లైన్ 1098 ప్రతినిధులు శ్రావణి, సిద్ధార్థకు అప్పగించారు. అంతేగాక తమ కూతురికి 18 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేయమని, ఎప్పుడు పిలిచినా కూతురిని చూపిస్తామని చెబుతూ స్టాంపు పేపర్లపై బాలిక తల్లిదండ్రులతో అంగీకార పత్రాన్ని రాసిచ్చారు. తర్వాత వారిని సీబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డి ముందు ప్రవేశపెట్టారు. బాల్య వివాహంపై ఆమె ఆవగాహన కల్పించి బాలికను బాలసదన్‌కు ఆప్పగించారు. నిరాశతో వెనుదిరిగిన బంధువులు చైత్రరథ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో సంతోషంగా వచ్చిన బంధువులు నిరాశతో వెనుదిరిగారు. కడు పేదరికంలో ఉన్న బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. పెళ్లికి చేసిన వంటలు కూడా తినేవారే కరువయ్యారని బోరుమని విలపించారు. -
సినీఫక్కీలో చోరీ
* బంగారం దొరికిందని నమ్మబలికి.. * మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ * హాలియాలో ఘటన హాలియా: గుర్తుతెలియని వ్యక్తులు మహిళకు మాయమాటలు చెప్పి సినీఫక్కీలో బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఈ ఘటన హాలియాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనుముల గ్రామానికి చెందిన పావనగండ్ల సత్యవతి కొద్దిరోజులుగా నడుమునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు ఉదయం ఆటోలో హాలియాకు వచ్చింది. మిర్యాలగూడ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఫలానా ఆస్పత్రి ఎక్కడా అంటూ సత్యవతిని అడిగింది. తనకు కూడా తెలియదని సత్యవతి బదులిచ్చింది. దీంతో సదరు గుర్తుతెలియని మహిళ మాటలు కలిపి సత్యవతితో కలిసి ముందుకు సాగింది. ఇంతలో మరో ఇద్దరు, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎదురొచ్చి మాది రూ.3 లక్షల విలువ గల బంగారు కడ్డీ పోయిందని, అది మీకు దొరికిందా అని అడిగారు. దీంతో సత్యవతి, సదరు గుర్తుతెలియని మహిళ దొరకలేదని సమాధానం చెప్పడంతో వారు వెళ్లిపోయారు. బంగారు కడ్డీ దొరికిందని.. బంగారం పోయిందని అడిగిన వారు నాలుగు అడుగులు ముందుకేసిన తరువాత సదరు గుర్తుతెలియని మహిళ ఆ బంగారు కడ్డీ నాకే దొరికిందని సత్యవతితో చెప్పింది. ఎవ్వరికి చెప్పనంటే ఇందులో సగం నీకు ఇస్తానని సత్యవతితో పేర్కొంది. ఇక్కడ ఎవరైనా చూస్తారని, కాస్త ముందుకెళ్లి చెరిసగం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో ఇద్దరూ కలిసి ఎస్సీ కాలనీవైపు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో గుర్తుతెలియని వ్యక్తి వద్దకు వెళ్లి బేరసారాలు మొదలు పెట్టారు. బంగారు కడ్డీ తుంచడం వీలుకాదని.. నీ మెడ మీద ఉన్న బంగారు పుస్తెలతాడు ఇస్తే ఈ బంగారు కడ్డీ ఇస్తామని చెప్పారు. అందుకు సత్యవతి ససేమిరా అనడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. నమ్మకం లేకపోతే మా సెల్ నంబర్ తీసుకో అంటూ హుంకరించాడు. దీంతో చేసేది లేక సత్యవతి బంగారు పుస్తెలతాడు ఇచ్చి, ఆ కడ్డీని తీసుకుంది. సెంటర్‌కు వచ్చి ఈ విషయాన్ని ఫోన్లో భర్తకు తెలపడంతో మోసపోయావంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ సురేష్‌కుమార్‌తో కలిసి ఎస్సీ కాలనీకి వచ్చి చూసే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. తీరా పోలీసులు ఆ బంగారు కడ్డీని పరీక్షించగా నకిలీదని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.