వధువుకు 14 ఏళ్లు.. వరుడికి 21 ఏళ్లు | 14-year-old Bride .. The groom, 21 years old | Sakshi
Sakshi News home page

వధువుకు 14 ఏళ్లు.. వరుడికి 21 ఏళ్లు

Published Mon, Dec 8 2014 3:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

14-year-old Bride .. The groom, 21 years old

- చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసుల రాకతో నిలిచిపోయిన వివాహం
- బోసిపోయిన పెళ్లి మండపం
- వెనుదిరిగిన బంధువులు
- బాలసదన్‌కు బాలిక తరలింపు

ఖిలావరంగల్ : వధువు వయస్సు 14 ఏళ్లు.. వరుడి వయస్సు 21 ఏళ్లు.. మరికొద్ది సేపట్లో వివాహం.. బంధువుల సందడితో ఆ ఫంక్షన్‌హాల్ కళకళలాడుతోంది. అంతలోనే సినీఫక్కీలో అక్కడికి చేరుకున్న 1098 చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులు ఈ పెళ్లిని ఆపండి అంటూ హెచ్చరించారు. దీంతో కొద్ది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన నగరంలోని శివనగర్‌లోని చైత్రరథగార్డ్‌న్స్‌లో ఆదివారం ఉదయం జరిగింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ సమీపంలోని ఎస్‌ఆర్ కాలనీకి చెందిన గంజి సతీష్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సతీష్ అనారోగ్యం బారినపడడంతో తండ్రి కళ్లెదుటే కూతురి పెళ్లి చేయూలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో వారి సమీప బంధువులైన కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన ఆడెపు మోహన్, ఈశ్వరి దంపతుల కుమారుడు చరణ్ (21)తో పెళ్లి చేయూలని నిర్ణయించుకున్నారు.

ఆదివారం  ఉదయం శివనగర్‌లోని చైత్రరథ గార్డ్‌న్స్‌లో లాస్య, చరణ్‌కు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో మిల్స్‌కాలనీ కాలనీ ఎస్సై బి, వెంకట్రావు, చైల్డ్‌లైన్ 1098 వలంటీర్లు, జిల్లా సోషల్ ఆక్టీవ్ కమిటీ కౌన్సిలర్ రావుల విజయరాంచంద్రన్ ఫంక్షన్‌హాల్‌కు చేరుకుని ఆ వివాహాన్ని నిలుపుదల చేశారు. అనంతరం వారు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

అనంతరం ఆ బాలికను చైల్డ్‌లైన్ 1098 ప్రతినిధులు శ్రావణి, సిద్ధార్థకు అప్పగించారు. అంతేగాక తమ కూతురికి 18 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేయమని, ఎప్పుడు పిలిచినా కూతురిని చూపిస్తామని చెబుతూ స్టాంపు పేపర్లపై బాలిక తల్లిదండ్రులతో అంగీకార పత్రాన్ని రాసిచ్చారు. తర్వాత వారిని సీబ్ల్యూసీ చైర్‌పర్సన్ అనితారెడ్డి ముందు ప్రవేశపెట్టారు. బాల్య వివాహంపై ఆమె ఆవగాహన కల్పించి బాలికను బాలసదన్‌కు ఆప్పగించారు.
 
నిరాశతో వెనుదిరిగిన బంధువులు
చైత్రరథ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో సంతోషంగా వచ్చిన బంధువులు నిరాశతో వెనుదిరిగారు. కడు పేదరికంలో ఉన్న బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. పెళ్లికి చేసిన  వంటలు కూడా తినేవారే కరువయ్యారని బోరుమని విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement