హాలియా/దేవరకొండ: గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిని నిగ్గుతేల్చేందుకు జిల్లాలో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం హాలియా, దేవరకొండలలోని హౌసింగ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హాలియా మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా హౌసింగ్ పీడీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాల్లో 2004 నుంచి 2014 వరకు మంజూరైన ఇళ్లను, వాటి నిర్మాణాలను పరిశీలిస్తామన్నారు. ఇళ్లను నిర్మించకుండా బిల్లులు కాజేసిన వారిపైన, బినామీ వ్యక్తులపై బిల్లులు కాజేసిన వారిపైన, అందుకు సహకరించిన అధికారులపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వివరించారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో హౌసింగ్ అధికారులు చేసిన ఎంబీ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 11 నుంచి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్‌ఐలు రాజనర్సింహ, తిరపతిరావు తదితరులు ఉన్నారు.
దేవరకొండలో..
సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం దేవరకొండ కార్యాలయంలో కూడా రికార్డులు పరిశీలించింది. బృందం సభ్యులు కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారం, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
Published Sat, Aug 9 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement