హాలియా :‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని ఉన్నట్లు’ ఉంది నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూముల రైతుల దుస్థితి. సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా చివరిభూములకు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయకట్టులో నాట్లు తుదిదశకు చేరుకుం టున్న తరుణంలో ఎడమకాల్వపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలోకి ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా నీరు చేరింది. దీంతో అదేరోజు నుంచి శనివారం దాకా ఎడమకాల్వకు నీటివిడుదలను నిలిపివేశారు. టర్బైన్ల మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో రెండురోజులుగా నీటివిడుదలను కుదించారు. సగటున 10 వేల క్యూసెక్కుల దాకా విడుదలయ్యే నీరు 2వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో కాల్వల చివరకు నీరెక్కడం లేదు. దీంతో రైతులు నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎడమకాల్వ పరిధిలో నల్లగొండ జిల్లాలో స్థిరీకరించిన ఆయకట్టు 2.99 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి దాకా 2.35 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఎత్తిపోతల పరిధిలోని 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 40 వేల ఎకరాల్లో నాటు వేశారు.
ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచాలి
జల విద్యుత్ కేంద్రంలోనికి నీరు చేరిందంటూ ఎన్‌ఎస్‌పి అధికారులు మూడు రోజులుగా ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించారు. ఇప్పుడు చివరి కాల్వలకు నీరెక్కలేని పరిస్థితి నాట్లుఎలా వేయాలో అర్థం కావడం లేదు. వెంటనే నీటివిడుదలను పెంచాలి. - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి
నాటు ఆగింది
ఎడమ కాల్వకు నీటి విడుదల తగ్గించడం వల్ల వరినాటు ఆగిపోయింది. కాల్వ చివరి భూముల రైతుల్లో ఇప్పుడే వరినాట్లు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎడమ కాల్వకు నీటివిడుదల తగ్గించడం రైతులకు ఇబ్బందే. విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేయాలి. - అల్లి పెద్దిరాజు, రైతు, బోయగూడెం
చివరికి నీరేది..!
Published Tue, Sep 23 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement