అనవసర రాద్ధాంతం వద్దు
- ‘ఆసరా’పై ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన
- అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తామని స్పష్టీకరణ
- 29.11 లక్షల దరఖాస్తుల్లో 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించాం
- ఇంకా పరిశీలన జరుగుతోంది
- మూడు గదుల ఇళ్లున్న వారికీ ‘ఆసరా’
- అంగన్‌వాడీ, ఔట్ సోర్సింగ్, చిరుద్యోగుల కుటుంబాలకు కూడా..
- నిబంధనల మార్పునకు అంగీకారం
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలందరికీ ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి అయోమయం సృష్టించవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేదని.. ధర్మబద్ధంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆసరా పథకంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు.
గతంలో పింఛన్ లబ్ధిదారులు 29.11లక్షల మంది ఉం డగా.. ఇప్పటి వరకు 24.21 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ లెక్కలు అంతిమం కాదని, జిల్లాల్లో దరఖాస్తులపై ఇంకా పరిశీలన జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభ్యులు మరో వారం రోజులు ఓపిక పట్టాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయి, పూర్తి సమాచారం రాగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేస్తామని సీఎం ప్రకటించారు.
మార్గదర్శకాల్లో మార్పులు
పింఛన్లకు ఆదాయాన్నే అర్హతగా తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షన్నర, పట్టణాల్లో రూ.2లక్షలలోపు ఆదాయమున్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంగన్‌వాడీలు, ఆయాలు, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి తల్లిదండ్రులకు, మూడు గదుల ఇళ్లు ఉన్నవారికి కూడా ‘ఆసరా’ అమలయ్యేలా నిబంధనలు మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తక్షణమే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. పింఛన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. పింఛన్ల కోసం క్యూల్లో నిలబడి చనిపోతున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేయవద్దం టూ.. ఎండలో నిలుచుంటే చచ్చిపోతారా? అని ప్రశ్నించారు. హెచ్చులు చెప్పొచ్చుగానీ వికారం కాకూడదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు.
క్యూలో నిలబడి చనిపోతున్నారు: డీకే
పింఛన్ దరఖాస్తుల క్యూలో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఆసరా’ పథకం అమలుపై ఆమె చర్చను ప్రారంభిస్తూ.. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ ‘ఆసరా’ పింఛన్లకు దిక్కులేదని పేర్కొన్నారు. పింఛన్ల జాబితాలో తమ పేరు లేదనే ఆవేదనతో వృద్ధులు గుండె పగిలి చనిపోతున్నారన్నారు. పింఛన్ల పంపిణీపై మానవతా కోణంలో ఆలోచించాలని అరుణ ప్రభుత్వాన్ని కోరారు.
అనంతపురం తరహాలో ఇవ్వాలి..
ఏపీలోని అనంతపురం జిల్లాలో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి సైతం పింఛన్లు ఇస్తున్నారని, తెలంగాణ సైతం అనంతపురం తరహాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా అలాంటి నిబంధనను వర్తింపజేయాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా పింఛన్లను రూ. 200కు పెంచి అమలు చేశారని, వికలాంగులకు కూడా రూ. 500 ఇప్పించారని గుర్తు చేశారు. పింఛన్ల పథకాన్ని ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకానికి అనుసంధానం చేయాలని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ సూచించారు.