
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కావడంతో శాసనసభలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎల్పీ విలీన ప్రక్రియకు స్పీకర్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. 120 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఏఐఎంఐఎం అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలో పదో వంతు సభ్యుల బలం లేకున్నా.. రెండో అతిపెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే పక్షంలో.. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు.
గులాబీ గూటికి మరో ఇద్దరు?
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, మరో శాసనసభ్యుడు ఎవరనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం సాగుతున్నా.. ఆయన చేరికపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విముఖతతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అనంతరం తనను కలిసిన మెదక్ జిల్లా శాసనసభ్యులకు జయప్రకాశ్‌రెడ్డి చేరిక అంశంపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. జయప్రకాశ్‌రెడ్డి చేరికపై తనకు, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆసక్తి లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కేబినెట్‌లోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం భారీగా పెరుగుతుండగా.. చేరిక ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. వరుసగా రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. మంత్రివర్గంలో 11 మందికి చోటు కల్పించారు. రాష్ట్ర కేబినెట్‌లో 16 మందికి అవకాశం ఉండగా.. మలి విడత విస్తరణలో మరికొంత మందికి చోటు దక్కనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని సమాచారం.
వెనుక బెంచీలకే కాంగ్రెస్ పరిమితం
కాంగ్రెస్ శాసనసభా పక్షం గుర్తింపు కోల్పోవడంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు వెనుక బెంచీలకు పరిమితం కానున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సరసన అసెంబ్లీలో చోటు దక్కనుంది. అసెంబ్లీ చర్చల్లో సభ్యుల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కు దక్కే సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీకి కూడా అసెంబ్లీలో కేవలం ఒక్కో సభ్యుడు మాత్రమే ఉన్నారు.
మరోవైపు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో మరింత బలం పెంచుకుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 చోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలుపొందిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలం 91కి పెరిగింది. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం 103కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment