![‘ఉస్మానియా’ కూల్చివేత తగదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81438455972_625x300.jpg.webp?itok=ll1sAuui)
‘ఉస్మానియా’ కూల్చివేత తగదు
- ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం
- తెలంగాణ పీసీసీ నేతల స్పష్టీకరణ
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి పాతభవనం చుట్టూ ఉన్న డోమ్ గేట్, పేయింగ్ రూమ్స్, దోబీఘాట్, నర్సింగ్‌హాస్టల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత భవనంలోని చాంబర్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురాంతో సమావేశమయ్యారు.
అనంతరం మల్లు భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తామనడం సరికాదన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ ఉస్మానియాకు ఎంతో గట్టితనం ఉందన్నారు. దీనికి మరమ్మతులు చేయిస్తే మరో వందేళ్లు రోగులకు సేవలందించవచ్చని అన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ ఎప్పుడూ నిజాం పాలనను పొగిడే ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను ఎందుకు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానన్న కేసీఆర్ ఉస్మానియాను కూల్చివేస్తాననడం సరికాదన్నారు.
రాజకీయం చేయొద్దు టీజీవీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమేష్
ఉస్మానియా ఆసుపత్రిని నిజాం ప్రభువు వందేళ్ల దూరదృష్టితో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిర్మించిన విషయాన్ని ఎవరూ విస్మరించరాదని తెలంగాణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.రమేష్ అన్నారు. శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పుడు వందేళ్ల ఈ భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించాలనుకోవడం తప్పుకాదన్నారు.
చార్మినార్ కట్టడంగానో, చౌమహల్లా ప్యాలెస్‌గానో నిర్మించింది కాదన్నారు. దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దని కోరారు. నిజాం ప్రభుత్వ ఇంటిని కూల్చివేసి కింగ్‌కోఠి ఆసుపత్రిని నిర్మించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయార న్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అనేక చారిత్రక కట్టడాలు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇదే తరహాలో 3డి డిజైనింగ్ చేసి నిజాం నిర్మించిన భవనానికి గుర్తుగా ఇదేశైలిలో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దానిని పరిపాలన భవనంగా చేసి దీని వెనుక ఉన్న స్థలంలో ట్విన్ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఒకవేళ అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.