
మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు
షాద్‌నగర్ రూరల్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమ విజయాన్ని ఆపలేరని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పీర్జాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ఛత్రపతి యువజన సంఘం సభ్యులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యాన, మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. టీఆర్‌ఎస్ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసం పాకులాడుతోందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్‌రావు, కొందూటి నరేందర్, ఎంఎస్ నట్‌రాజ్, బాబురావు, ముస్తాఫా, హఫీజ్, మల్లయ్య, చెన్నయ్య, ఆంజనేయులు, శీలం శ్రీకాంత్, హన్మంతు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment