మన సంస్కృతి మహోన్నతం
కామారెడ్డి : ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆ సంస్కృతి పరంపరను కొనసాగించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమాన్ని స్వామీజీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి పరిపూర్ణానంద స్వామి ప్రవచనామృతాన్ని అందించారు. భారతీయుల చింతన, భావన విలక్షణమైనవన్నారు.
విలక్షణమైన భావన వెనుక ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక మహత్తరమైన సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. సంస్కారాన్ని, సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకోకపోతే వెర్రిలా కనబడుతుందన్నారు. అర్థం చేసుకోలేనివానికి ఏదైనా తప్పుగానే కనబడుతుందన్నారు. దీనిని అర్థం చేసుకోలేనివారే దేవునిపేరు మీద పెద్ద వ్యాపారం జరుగుతోందని విమర్శిస్తుంటారన్నారు. ఆచరించే ధర్మం వెనుకనున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాలు నిర్వహించే విషయంలో భుజానికెత్తుకునేవారికి అవగాహన ఉండాలని, లేకపోతే విమర్శలపాలవుతారని పేర్కొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారం, చరిత్రను చాటేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాస్తికులు సైతం అర్థం చేసుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు రాధాకృష్ణశర్మ, గంగవరం ఆంజనేయశర్మ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్, ప్రతినిధులు ఉదయ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్, రమేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.