ప్రాణం మీదకు తెచ్చిన సినిమా
- ఎద్దును ఢీకొట్టి పల్టీలు కొట్టిన స్కార్పియో
- ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు
- పరిస్థితి విషమం, ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
- పరకాల మండలం నడికూడ వద్ద దుర్ఘటన
పరకాల : సినిమాకు పోదామనే సరదా... ప్రాణం మీదకు తెచ్చింది. అతివేగంతో రోడ్డుపక్కన ఉన్న ఎద్దును ఢీకొట్టడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్ర గాయూలపాలయ్యూరు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పరకాల మండలంలోని నడికూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై దీపక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌కు చెందిన సం పంగి వెంకటేష్, పోగుల మధు, పల్లపు తిరుపతి, కంది వెంకటేష్ (డ్రైవర్), బొంత కుమార్(18), మరొకరు కలిసి రాత్రి సినిమా చూసేందుకు స్కార్పియోలో పరకాలకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఉన్న నడికూడ గ్రామ స్టేజీ సమీపంలోని హనుమాన్ ఆలయం ముందు ఉన్న రోడ్డు పక్కన రైతు తోర్ణం శంకర్‌రావు ఎద్దులను కట్టేశారు. వర్షం జల్లులు వస్తుండడంతో ఒక ఎద్దును దొడ్డిలో కట్టేయడానికి తీసుకుపోయారు. అదేదారి వెంట వస్తున్న స్కార్పియో అతివేగంగా వచ్చి ఎద్దును ఢీకొట్టిం ది. అక్కడ నుంచి ఆర్‌అండ్‌బీ రాయిని ఢీకొట్టి.. మూడు పల్టీలు కొట్టి.. చెట్టును ఢీకొట్టి ఆగింది. స్కార్పియో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న బొంత కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎద్దు సైతం ఎక్కడే మృత్యువాత పడింది. కారులో ఉన్న సంపంగి వెంకటేష్ నడుం, కాళ్లు విరిగిపోగా, పల్లపు తిరుపతి తలకు, చేతులకు, పోగుల మధుకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ కంది వెంకటేష్, మరొకరు ప్రమాదం నుంచి బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.
పరారైన వారిలో ఒక్కరు బావిలో పడ్డట్లు వదంతుల రావడంతో గ్రామస్తులు, పోలీసులు కొద్దిదూరంలో ఉన్న బావి వద్దకు వెళ్లి చూశారు. అక్కడ లేక పోవడంతో వెనక్కి వచ్చారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో పరకాలలోని సివిల్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బొంత కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపర్చారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు దీపక్, రవీందర్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేక పోవడం, ఎదురుగా వాహనాలు రాక పోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.