ముస్లిం సోదరులను చంపితే దిక్కేలేదు..
సొంత పోలీసులతో కేసీఆర్ విచారణ: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో ఒకేసారి ఐదుగురు ముస్లిం సోదరులను చంపితే దిక్కులేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం హన్మకొండలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
జాతీయ రహదారిపై పట్టపగలు వికారుద్దీన్ సహా ఐదుగురిని కాల్చి చంపారని.. ఈ సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని తాము సీఎంను కోరినా పట్టించుకోలేదన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులతోనే.. దీనిపై విచారణ జరిపించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు.
కడియం కులం ఏమిటో విచారణ జరపాలి : సర్వే
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కులం ఏమిటో సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. దేశంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారికి శిక్షలు పడ్డాయని.. విచారణ జరిపి దోషిగా తేలితే చట్టప్రకారం శ్రీహరికి శిక్షపడాలని వ్యాఖ్యానించారు.