
సోమాజిగూడ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ కార్యకర్తలకు చేతినిండా పనిదొరికింది.. నగరంలోని పలు ప్రాంతాల్లోని అడ్డాల వద్ద కూలి కోసం ఎదురుచూసే వారికి చేతినిండా పనిదొరికింది. దాంతో వారం రోజులుగా ఆయా ప్రాంతాల్లోని అడ్డాల్లో వారి సందడి తగ్గింది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులకు అప్పగించారు. దాంతో పెయిడ్ కార్యక్తరల కోసం వెతుకులాట ప్రారంభించి అడ్డా కూలీలను అందిపుచ్చుకున్నారు.
అన్ని పార్టీలకు వారే కార్యకర్తలు
ప్రచార బాధ్యతలను ఇతర అంశాలను ఇన్‌చార్జిలకు అప్పగించినా.. ప్రధాన పాత్ర మాత్రం స్థానిక ఎమ్మెల్యేదే.? అయితే తనకు అనుకూలమైన వ్యక్తులు కార్యకర్తలను పోగుచేసే బాధ్యతలను అప్పగిస్తున్నారు. రూరల్ ప్రాంతంలో అయితే డబ్బులు ఇవ్వకపోయినా నాయకుడిపై అభిమానంతో కార్యకర్తలు ఎన్నికల ప్రచారంతో పాల్గొంటారు. నగరంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చాలామంది పేదలకు పూట గడిపేందుకు కష్టంగా ఉండటంతో డబ్బులు ఇస్తేనే ప్రచారానికి వెళ్తున్నారు.
రూ.500, మందు, బిర్యానీ ఆఫర్..
రోజుకు ఒక్కో కార్యకర్తకు రూ.500 నగదు, మందు, బిర్యానీ ఇచ్చి వారిని ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పార్టీ జెండా మోసిన వారు.. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో పార్టీకి జై కొడుతున్నారు. ఇలా నగరంలో వారం రోజులుగా అడ్డా కూలీలకు చేతినండా పని దొరికింది. పలుచోట్ల నిర్వహిస్తున్న ప్రచారాల్లో చిన్న పిల్లలు సైతం పాల్గొంటున్నారు. ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వడంతో కొంత మంది తమ పిల్లల్ని కూడా తమతో పాటు ప్రచారానికి తీసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment