శివారు కేంద్రంగా ప్యానల్‌ బోర్డుల దందా | Panel Boards Scam in hyderabad City Outcuts | Sakshi
Sakshi News home page

శివారు కేంద్రంగా ప్యానల్‌ బోర్డుల దందా

Published Thu, Aug 16 2018 6:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Panel Boards Scam in hyderabad City Outcuts - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్యానల్‌ బోర్డులు విద్యుత్‌ ఇంజినీర్ల పాలిట కామధేనువులా మారాయి. శివారు ప్రాంతాల్లోని పలు బహుళ అంతస్థుల భవనాలకు సీఈఐజీ అనుమతి లేకుండానే ప్యానల్‌ బోర్డులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో ప్యానల్‌ బోర్డుకు రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమాల్లో లైన్‌మెన్‌ నుంచి డీఈ వరకు ముడుపులు పుచ్చుకుంటున్నట్లు తెలిసింది. కోర్‌సిటీతో పోలిస్తే ఇటీవల శివారు ప్రాంతాల్లో బహుళ అంతస్థుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రెండు వందల ఫీట్ల ఎత్తున్న నిర్మాణాలకు సీఈఐజీ అనుమతి తప్పని సరి. అయితే చాలా మంది నెలసరి అద్దెలు వస్తాయనే ఆశతో జీ+3 నుంచి జీ+6 సహా పెంట్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. ఇలా ఒక్కో భవనంలో ఆరేడు పోర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోర్షన్‌కు ఒక్కో విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. నిజానికి నాలుగు మీటర్లకు మించి అనుమతి లేదు. ఐదో మీటర్‌ కావాలంటే ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి.

దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సహా సీఈఐజీ అనుమతి తప్పనిసరి. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకునే సమయంలో జీహెచ్‌ఎంసీకి సమర్పించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఉంటుంది. దీంతో ఆయా భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందడం కష్టమే కాకుండా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. వినియోగదారుల్లోని ఈ బలహీనతను విద్యుత్‌ ఇంజినీర్లు ఆసరాగా చేసుకుంటున్నారు. సెక్షన్‌ పరిధిలోని రోలింగ్‌ స్టాక్‌ను మాయం చేసి ఈ అక్రమ భవనాలకు సమకూరుస్తున్నారు. ఇలా ప్యానల్‌ బోర్డులు మాత్రమే కాదు విద్యుత్‌ మీటర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఏకంగా 130కిపైగా రోలింగ్‌స్టాక్‌ మీటర్లు మాయం చేసిన ఘటనపై ఫిర్యాదులు అందడటంతో విచారించిన అధికారులు గతంలో అక్కడ లైన్‌మెన్‌ సహా ఏఈలను రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

డిస్కం ఖజానాకు గండి..
సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని హయత్‌నగర్‌ సెక్షన్‌లో కొంత మంది ఇంజినీర్లు సంస్థ ఖజానాకు గండి కొడుతున్నారు. సెక్షన్‌ పరిధిలోని ఓ వినాయక విగ్రహాల తయారీ వినియోగదారుడు 2012లో విద్యుత్‌ మీటరు తీసుకున్నాడు. నెలకు రూ.2 వేలకుపైగా బిల్లు నమోదవుతోంది. కానీ సంస్థకు మాత్రం రూ.200 చేరుతోంది. ఇలా ఐదేళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. వినియోగదారుడి నుంచి మీటర్‌లో రీడింగైన మొత్తం బిల్లు వసూలు చేస్తూ... ఆ తర్వాత ఈఆర్‌ఓ సెక్షన్‌లోని క్యాషియర్‌కు తెలియకుండా బిల్లును తగ్గిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మీటర్‌ బర్న్‌ సాకుతో ఇప్పటి వరకు ఏకంగా ఆరు మీటర్లు మార్చారంటే క్షేత్రస్థాయి ఇంజినీర్ల అక్రమాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బయటికి పొక్కకుండా డివిజన్‌ ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక మెహిదీపట్నం వినియోగదారుల సేవా కేంద్రం అక్రమాలకు నిలయంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తలైన్లు, లైన్‌షిఫ్టింగ్‌ వర్క్స్, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు విషయంలో భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. అడిగినంత ఇవ్వకపోతే వాస్తవ ఖర్చుకంటే ఎక్కువ మొత్తంలో ఎస్టిమేషన్‌ వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫోకల్‌ పోస్టులకు డిమాండ్‌ ఎందుకంటే..
ప్రభుత్వంలో ఏ విభాగంలోనూ అధికారికంగా ఫోకల్, నాన్‌ఫోకల్‌ అంటూ రెండు రకాల పోస్టులు లేవు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో ఎక్కడా లేని విధంగా ఫోకల్, నాన్‌ఫోకల్‌ పోస్టులను సృష్టించారు. కొంత కాలం ఫోకల్‌ పోస్టులో పనిచేసిన వారు.. ఆ తర్వాత నాన్‌ఫోకల్‌ పోస్టులో పనిచేయాలనే నిబంధన కూడా ఉంది. పెద్దగా పనులు, ఆదాయం లేని కోర్‌సిటీని నాన్‌ ఫోకల్‌గా, ఎక్కువ కొత్త కనెక్షన్లు, లైన్స్‌ ఇతర వర్క్స్‌తో పాటు ఆదాయం ఎక్కువగా ఉన్న శివారు ప్రాంతాలను ఫోకల్‌ పోస్టులుగా పిలుస్తుంటారు. ఫోకల్‌ల్లో పోస్టింగ్‌ కోసం ఉన్నతాధికారులకు రూ.లక్షల ముడుపులు ముట్టజెప్పుతుంటారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పోస్టింగ్‌ కోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాధించుకునేందుకు ప్యానల్‌ బోర్డులు, కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త మీటర్ల ఏర్పాటు విషయంలో లైన్‌మెన్లు చేతివాటం ప్రదర్శిస్తుంటే, కొత్తలైన్ల ఎస్టిమేషన్ల విషయంలో ఏఈలు, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు విషయంలో ఏడీఈ, డీఈలు వసూళ్లకు పాల్పడుతుండటం విశేషం. ఇలా ఎవరిస్థాయిని బట్టి వాళ్లు వాళ్ల రేట్లను ఫిక్స్‌ చేసుకుంటున్నారు. బహుళ అంతస్థులకు ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానల్‌బోర్డుల కేటాయింపు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కొత్త లైన్లు, మెటీరియల్‌ సరఫరా విషయంలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేటు కాంట్రాక్టర్లపై  కేసులు పెడుతూ, వారిని అనేక వి« దాలు వేధింపులకు గురిచే స్తుండటంతోఇటీవలబహిర్గతం చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement