కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రభుత్వమే నడపాలని, ఉత్పత్తి ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష మాజీ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు మిల్లు సమస్య జటిలమవుతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టిం చుకోకపోవడాన్ని నిరసిస్తూ ఎస్పీఎం కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మిల్లు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. గుండా మల్లేశ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
పని దొరకక, తద్వారా వేతనాలు రాక 1600 మంది కాంట్రాక్టు కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం మౌనం వహించద ని ఆరోపించారు. మరోవైపు యాజ మాన్యం ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేసి, మిల్లును మూతబడే దశకు తీసుకువస్తోందని, అయినా ముఖ్యమంత్రి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని, పట్టణం మొత్తంలో వ్యాపారాలు పడిపోయాయన్నారు.
కార్మికుల పక్షాన ఢిల్లీ దాకా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈర్ల విశ్వేశ్వర్‌రావు, ముర ళి, షబ్బీర్ అహ్మద్ (చోటా), ముంజం శ్రీనివాస్, వెంకటేశ్, అంబాల ఓదేలు, వేణు, వొల్లాల సుభాష్, రాజ్‌గోపాల్, భూమయ్య, హఫిజ్‌ఖాన్, అన్నం రాజయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్పై అబ్దుల్‌మజీద్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మిల్లును పునరుద్ధరించండి
ఆదిలాబాద్ అర్బన్ : సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసి దాదాపు నాలుగు నెలలు గడుస్తుందని, వెంటనే పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరిశ్రమలో సుమారు పర్మినెంట్ కార్మికులు 1500 మంది, కాంట్రాక్టు కార్మికులు 600 మంది, స్టాఫ్ 600 మంది పని చేస్తున్నారన్నారు.
గత నాలుగు నెలలుగా పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేయడంతో కాంట్రాక్టు కార్మికులు వీధిన పడ్డారన్నారు. డిసెంబర్ నుంచి పర్మినెంట్ కార్మికులకు సైతం వేతనాలు నిలిపివేశారని, దీంతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక పేపర్ పరిశ్రమ మూతపడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, పోశెట్టి, స్వామి, మయూరిఖాన్ ఉన్నారు.
పేపర్‌మిల్లును ప్రభుత్వమే నడపాలి
Published Sun, Dec 21 2014 3:25 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement