సొంతింటి కల మోదీతోనే సాధ్యం | Parapunananda Swami At Patancheri Road Show | Sakshi
Sakshi News home page

సొంతింటి కల మోదీతోనే సాధ్యం

Published Wed, Nov 28 2018 11:56 AM | Last Updated on Wed, Nov 28 2018 12:41 PM

Parapunananda Swami At Patancheri Road Show - Sakshi

గణేశ్‌ గడ్డ వద్ద రోడ్‌షోలో మాట్లాడుతున్న పరిపూర్ణానందస్వామి. చిత్రంలో బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి తదితరులు

పటాన్‌చెరు టౌన్‌: దేశ ప్రధాని నరేంద్రమోదీ మన రాష్ట్రానికి లక్షా 60 వేల ఇళ్లను మంజూరు చేయనున్నారని బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. పటాన్‌చెరులో తమ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని గెలిపిస్తే పారిశ్రామికవాడలో పేదలందరి సొంతింటి కల నెరవేర్చుతారని తెలిపారు. మంగళవారం ఆయన పటాన్‌చెరులో రోడ్‌ షోలో పాల్గొన్నారు. తొలుత గణేష్‌గడ్డలోని వినాయకుడి గుడిలో పూజలు చేశారు. అక్కడ ఆయనకు పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి పి.కరుణాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తరువాత రోడ్‌షో లింగంపల్లి వరకు చేరింది. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పందికొక్కుల్లా అవినీతితో డబ్బును మేశారని ఆరోపించారు. అవినీతి రహిత పాలనకు బీజేపీని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పటాన్‌చెరులో విద్యావేత్త, మాజీ సైనికుడు పి.కరుణాకర్‌రెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా పోటీలో పెట్టిందన్నారు.  ఈ ప్రాంతం ప్రజల కష్టాలు తీర్చగలిగే కరుణాకర్‌రెడ్డిని ఎన్నుకోవాలన్నారు. పటాన్‌చెరులో బైపాస్‌ రోడ్డు లేదని, పేదలెవరికీ పక్కా ఇళ్లు లేవని, విపరీతమైన కాలుష్యం ఉందని, పార్కులు లేవని అన్నారు. తమ అభ్యర్థి అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తారని చెప్పారు. కేంద్రం సాయంతో పక్కా ఇళ్లు పేదలందరికీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరుణాకర్‌రెడ్డి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ప్రజా సేవకు అంకితమవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదెల్లి రవీందర్, గిద్దెరాజు, నరేందర్‌రెడ్డి, నాగరాజు, బైండ్ల కుమార్, రాంబాబు గౌడ్‌ పాల్గొన్నారు. రోడ్‌ షో కారణంగా జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. రోడ్‌షోలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌ వెనుకాల బీజేపీ అభిమానులు ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా సాగారు. జాతీయ రహదారి మీదుగా నిర్వహించిన రోడ్‌షో స్థానికులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా బీజేపీ నేత కరుణాకర్‌రెడ్డి మంగళవారం పటాన్‌చెరు, బొల్లారం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పటాన్‌చెరు వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. కిష్టారెడ్డిపేట బీరంగూడ రోడ్డును బాగు చేస్తామన్నారు. ప్రణాళికబద్దంగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు.


 సదాశివపేటలో..
సదాశివపేట పట్టణంలోని పంచాచార్య బసవ సేవాసదన్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్యం కావాలంటే బీజేపీ అభ్యర్థి దేశ్‌పాండెను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండె, అందోల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్, దేశ్‌పాండె, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెమలికొండ వేణుమాధవ్, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు శ్రీశైలంయాదవ్, మహిళా నాయకురాలు అనురాధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్‌రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పరిపూర్ణానందకు జ్ఞాపికను అందిస్తున్న బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement