భోజనాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సుధాకర్, విద్యార్థుల తండ్రులు
హుస్నాబాద్‌రూరల్ మెదక్ : పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని పుస్తెలు తాడు తాకట్టుపెట్టి హుస్నాబాద్ ఎస్‌ఆర్ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి రూ. 30వేల ఫీజు కట్టిన.. మా పిల్లలకు నూకల బువ్వ, నీళ్ల చారు, పురుగులు పడ్డ దొడ్డు బియ్యం కూడు పెడతారా..? అని అంకుషాపూర్‌కు చెందిన రేణుక పాఠశాల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
ఎండకాలంలో టీచరమ్మలు మా తండాకు వచ్చి మంచి చదువులు చెప్తం.. హాస్టల్‌లో ఉంచుతాం అని మాయ మాటలు చెప్తే పిల్లగాడిని హాస్టల్లో చేర్చిన.. ఇప్పుడు రాత్రి పూట పురుగులు పడ్డ బువ్వ తినకపోతే సార్లు కట్టెలతో కొడుతున్నరని మా కొడుకు ఏడువబట్టేనని పాఠశాల రేణుక కన్నీరు పెట్టుకుంది.
హుస్నాబాద్ పట్టణంలోని ఎస్‌ఆర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30వేల ఫీజు వసూలు చేసింది. గిరిజన పిల్లల వద్ద ఫీజులు తీసుకున్న యాజమాన్యం విద్యార్థులకు చదువులు చెప్పకపోగా, పురుగులు పడిన నూకల బువ్వ, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
విద్యార్థులకు వడ్డించే భోజనం, పురుగులు పట్టిన బియ్యం బయట వేసి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మా ఫీజులు తిరిగిచ్చి మా పిల్లలను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుస్నాబాద్, కోహెడ ఎస్సైలు సుధాకర్, సతీష్‌లు అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకున్నారు.
పాఠశాల యాజమాన్యం సమక్షంలోనే విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వడం భావ్యం కాదని మందలించారు. పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పాఠశాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకారులు కేసులు కాకుండా మా ఫీజులు మాకు ఇచ్చి మా పిల్లలను అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంగ్లిష్ చదువుల పేరుతో పిల్లలను చేర్చుకున్నట్లు గిరిజనులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నూకల బువ్వ తినకపోతే కొడుతరు
పురుగులు పడ్డ నూకల బువ్వ తినకపోతే సార్లు కర్రతో కొడుతరు. నీళ్ల చారు పెడుతరు. హాస్టలు విషయాలు ఇంటికాడ చెప్పితే కొడుతమని బెదిరిస్తున్నారు. మా ఫ్రెండ్‌ను కర్రతో కొడుతే చేతులకు వాతలు వచ్చినై. మాకు బోరు నీళ్లు ఇస్తరు.. సార్లు క్యాన్ నీళ్లు తాగుతరు.
– శరత్‌కుమార్, 4వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment