{పైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలుగా ఫీజులు
ముక్కుపిండి వసూలు చేస్తున్న యాజమాన్యాలు
అడ్మిషన్ల కోసం విస్తృత ప్రచారం
వసతులు లేకున్నా.. ఆర్భాటం
కనీస విద్యార్హతలేని వారితో బోధన
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో తల్లిదండ్రులు
జూన్ నెల అనగానే పిల్లల తల్లిదండ్రుల గుండెలు జారి పోతున్నాయి. జూన్‌లో స్కూళ్లు పునఃప్రారంభం కానుండడంతో ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీ అప్పుడే మొదలైంది. ఆకర్షణీయమైన కరపత్రాలు ముద్రించి.. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఫీజులు కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఏటా వేలాది రూపాయల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమవుతుంటారు. ఫీజులేగాక బుక్స్, డ్రెస్సులు, బెల్ట్, టై ఇతర ఖర్చులు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలను కట్టడి చేసే వారు లేకపోవడంతో వారు అడిగిన ఫీజు చెల్లించడం తప్ప మరో మార్గం లేదంటూ తల్లిదండ్రులు నిస్సహయతను వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ టౌన్ : ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియకు ప్రైవేట్ పాఠశాలలు తెర లేపాయి. మరో 15 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ప్రైవేట్ స్కూళ్ల సిబ్బంది రంగు రంగుల కరపత్రాలు పట్టుకొని రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇంటింటికి తిరుగుతున్నారు. చాలా పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోయినా కరపత్రాల ద్వారా నమ్మిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు సౌకర్యాలు లేకపోగా, మరికొన్నింటికి అసలు ప్రభుత్వ గుర్తింపు లేదు. అదీగాక పాఠశాల పేర్ల చివరన కాన్వెంట్, టెక్నో, ఈ-టెక్నో, టాలెంట్, పబ్లిక్ వంటి పేర్లను తగిలిస్తూ పిల్లల తల్లిదండ్రులను మాయ చేస్తున్నారు. పాఠశాల పేర్ల చివరన తోకలను తొలగించాలని ప్రభుత్వ రెండేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
భారీగా ఫీజులు
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. కానీ జిల్లాలో ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే వేలాది ఫీజులు గుంజుతున్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్, డిజిటల్ క్లాస్, కరాటే, డాన్స్, డ్రాయింగ్ కోచింగ్‌లు నిర్వహిస్తామంటూ అదనంగా మరింత వసూలు చేస్తున్నాయి. వీటికితోడు యూనిఫారాలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్స్, టై, బెల్టు పేరిట మరికొంత గుంజుతున్నాయి. వీటిని కూడా పాఠశాలలోనే విక్రయిస్తున్నాయి. వారి వద్దే కొనాలనే నిబంధన కూడా విధిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు.
సౌకర్యాలు సున్నా..
చిన్న చిన్న తరగతులకే వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు పాఠశాలల్లో మాత్రం సౌకర్యాలు అరకొరే. డిజిటల్ క్లాసులు, పిల్లల విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యక్రమాలు, ఎక్స్‌ట్రా కేర్, డాన్స్, గేమ్స్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టడం మినహా వారు చెప్పినవన్నీ పాటించే పాఠశాలలు చాలా తక్కువే.
నిబంధనలకు నీళ్లు..
ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. కానీ చాలా స్కూళ్లల్లో దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చిన్న వయస్సులోనే మానసికంగా కుంగిపోయి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు.
అర్హత లేనివారితో బోధన..
చాలా పాఠశాలల యాజమాన్యాలు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే విద్యా బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో మాత్రం ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తాకొట్టిస్తున్నాయి. కేరళ యాజమాన్యం, కేరళ సిబ్బంది అంటూ బూటకపు ప్రచారాలు చేస్తున్నాయి. పదోతరగతి ఫలితాలను ఇష్టానుసారంగా ప్రచారం చేయొద్దంటూ ప్రభుత్వం జీపీఏ పద్ధతి ప్రవేశ పెట్టినా వాటిని ఆసరా చేసుకుని మరింత విచ్చలవిడిగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం...
ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను ఏర్పాటు చేయకూడదు. మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కల్పించాలి. అడ్మిషన్ వేళ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. శిక్షణ పొందిన వారితోనే విద్యా బోధన చేపట్టాలి. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, రూ.60 వేలలోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి కచ్చితంగా అమలు చేయాలి.
ఫీ‘జులుం’
Published Wed, May 27 2015 11:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement