
సాక్షి, సిటీబ్యూరో: ‘సందర్శకుల వాహనాలు లోనికి అనుమతించబడవు...’ నగరంలోని అనేక అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల వద్ద వాటి పేర్ల కంటే ప్రముఖంగా ఈ బోర్డులు కనిపిస్తుంటాయి. ఇది కూడా పరోక్షంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోంది. ఇప్పటికే ఉన్న వేలాది అపార్ట్‌మెంట్స్‌కు తోడు ఏటేటా కొత్తగా భారీ సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. అందులో నివసించే కుటుంబాలకు దాదాపు సమానంగా అనునిత్యం విజిటర్స్ వస్తుంటారు. అపార్ట్‌మెంట్ వాసులకు ఉన్నట్లు వీరికి పార్కింగ్ ఉండకపోవడంతో రోడ్లే ఆధారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద అపార్ట్‌మెంట్స్‌కు నిర్ణీత మొత్తం పార్కింగ్ స్థలం ఉండాలనే నిబంధనలు అమలులోకి రావాలని కొన్నేళ్లుగా వినిపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
సిటీతో పాటు శివార్లలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటిలో నివసిస్తున్న లక్షల మందిని కలవడానికి నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అయితే అనేక ప్రాంతాల్లో ఉంటున్న నివాస సముదాయాల్లోకి సందర్శకుల వాహనాలను అనుమతించట్లేదు. ఈ మేరకు యాజమాన్యం/నిర్వాహకులు భారీ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లకు ఆ బాధ్యతల్ని అప్పగిస్తున్నాయి. అదేమంటే గుర్తుతెలియని వ్యక్తులకు చెందిన వాహనాలను ప్రాంగణంలోకి అనుమతిస్తే భద్రత పరమైన ఇబ్బందులు వస్తాయని చెప్తుంటారు. ఆయా అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో సందర్శకుల వాహనాలు నిలుపుకోవడానికి అవసరమైన స్థలం లేకపోవడమూ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారుతోంది. వాటిలో నివసించే వారికి మాత్రమే టూ వీలర్, ఫోర్ వీలర్ అంటూ స్థలాన్ని లెక్కకట్టి ఇస్తున్న బిల్డర్లు, యజమానులు సందర్శకుల విషయం పట్టించుకోవట్లేదు.
‘ప్రత్యామ్నాయ’ ట్రాఫిక్ ఇబ్బందులు...
నగరంలో వాహనాల సంఖ్యతో పాటు రహదారుల వినియోగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రధాన రహదారులతో పాటే ప్రత్యామ్నాయ మార్గాలు, గల్లీలు వినియోగించుకునే వారి సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతోంది. వీరితో పాటు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఉన్నప్పుడు వాహన చోదకులు ప్రధాన రహదారుల్ని వదలాల్సిందే. మెయిన్ రోడ్స్‌లో ఉంటున్న ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి, వీలైనంత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవడానికి వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. భారీ వాహనాలు కాకున్నా ద్విచక్ర, తేలికపాటి వాహనాలు ఈ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఈ రూట్స్ అన్నీ ఎక్కువగా కాలనీల లోపల నుంచే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోని నివాస సముదాయాలకు వచ్చే సందర్శకుల తమ వాహనాలను వాటి ప్రాంగణాల్లో కాకుండా రోడ్ల పైనే ఉంచేస్తున్నారు. వీటి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాహనచోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు
తప్పట్లేదు.
కమర్షియల్ ‘స్పేస్’ ఇలా...
వాణిజ్య సముదాయాలు, కేఫ్‌లు, దుకాణాల నిరాహకులు సరైన పార్కింగ్ వసతులు కల్పించడం తప్పనిసరి. ఒకప్పుడు అన్ని రకాలైన వాణిజ్య సయుదామాలకూ 25 శాతం పార్కింగ్ స్థలం కచ్చితం. వాటిని వస్తున్న వినియోగదారుల తాకిడిని తట్టుకోవడానికి ఈ స్థలం చాలట్లేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ భావించింది. దీంతో 2006లో జీవో నెం. 86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌తో కూడిన సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మెుత్తం విస్తీర్ణంలో 60 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు 40 శాతం పార్కింగ్ స్థలం తప్పనిసరిగా ఉండాలి. వాణిజ్య సముదాయాలు తదితరాలకు కనీసం 25 శాతం ఉండాలి. అలా లేని వాటికి లైసెన్స్ రెన్యువల్ చేయవద్దని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
అవసరానికి తగ్గట్టు ‘రెసిడెన్షియల్’...
కమర్షియల్ నిర్మాణాల విషయంలో పార్కింగ్ స్థలాన్ని కచ్చితం చేస్తూ కేటాయించాల్సిన స్థలాన్నీ నిర్దేశించినట్లే నివాస సముదాయాలకూ విజిటర్స్ పార్కింగ్ కచ్చితం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నేళ్లుగా వాదిస్తున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో జరిగిన అనేక సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రాథమింకంగా చర్చించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఏ తరహా అపార్ట్‌మెంట్/గేటెడ్ కమ్యూనిటీలకు ఎంత శాతం పార్కింగ్ స్థలం ఉండాలన్నది ఖరారు చేయాలనీ యోచించారు. అయితే ఇతర యంత్రాంగాలు పట్టించుకోకపోవడంతో ఈ అంశానికి బ్రేక్ పడింది. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య నేపథ్యంలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం పెరుగుతుందని, ఈ నేపథ్యంలోనే విజిటర్స్ పార్కింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment