జిల్లాకు పెద్దపీట
* కేసీఆర్ కేబినెట్‌లో జూపల్లి, లక్ష్మారెడ్డికి చోటు
* నిరంజన్‌రెడ్డికి ప్రణాళిక సంఘం పదవి
* పార్లమెంటరీ కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్ నియామకం
* ఆశల పల్లకిలో మరికొందరు...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కరువు జిల్లా పాలమూరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల వర్షం కురిపించారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి చోటు దక్కనుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు నూతనంగా సృష్టించిన పార్లమెంటరీ కార్యదర్శి హోదా దక్కింది. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేరు ఖరారు చేశారు.
కేబినెట్ హోదా కలిగిన పదవులు ఒకే విడత లో జిల్లాకు చెందిన నేతలకు దక్కడంతో రాబో యే రోజుల్లో మరిన్ని పదవులు ఖాయమని ఔత్సాహికులు లెక్కలు వేసుకుంటున్నారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల) పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు అటు సీఎం కార్యాలయం, ఇటు రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు సమాచారం.
ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌ డ్ మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తూ వచ్చారు. వనపర్తి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన నిరంజన్‌రెడ్డి కూడా కీలక పదవిని ఆశిస్తూ వచ్చారు. తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లా నుంచి పదవులు ఆశిస్తున్న నేతలు అందరినీ సంతృప్తి పరిచేలా సీఎం కేసీఆర్ పదవులు పంపిణీ చేశారు.
మంత్రివర్గ విస్తరణకు ముందే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు పార్లమెంటరీ కార్యదర్శి హోదా కట్టబెట్టారు. మంత్రి హోదాకు సమానమైన పదవిని కట్టబెట్టడం ద్వారా శ్రీనివాస్‌గౌడ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి సన్నిహితులు చెబుతూ వచ్చారు. అయితే కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. సామాజికవర్గాల లెక్కలు పక్కన పెట్టి మరీ జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం.
ఆశల పల్లకిలో మరికొందరు
మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడడంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న మరికొందరు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, దేవర మల్లప్పకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గద్వాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్‌రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులపై ఆశతో ఉన్నారు.