పాపం..స్వీపర్లు | Part Time In Govt Schools Sweepers Salary Problems Khammam | Sakshi
Sakshi News home page

పాపం..స్వీపర్లు

Published Mon, Sep 10 2018 7:04 AM | Last Updated on Mon, Sep 10 2018 7:04 AM

Part Time In Govt Schools Sweepers Salary Problems Khammam - Sakshi

సింగారెడ్డిపాలెం పాఠశాలలో ఊడుస్తున్న స్వీపర్‌ ఇమామ్‌ఖాదర్‌

నేలకొండపల్లి(ఖమ్మం): భవిష్యత్‌లో తమను పర్మనెంట్‌ చేస్తారనే ఆశతో ప్రభుత్వ పాఠశాలల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న పార్ట్‌టైం స్వీపర్లకు నెలల తరబడి వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1982నుంచి ఉమ్మడి జిల్లాలో నామమాత్రపు పారితోషికం మీద స్వీపర్ల వ్యవస్థ కొనసాగుతోంది. అప్పట్లో కేవలం నెలకు రూ.12 వేతనం ఇచ్చేవారు. దశలవారీగా పోరాడడంతో వీరికి కొంతకాలం రూ.1623కు పెంచి, ప్రస్తుతం నెలకు రూ.4000 వేతనమిస్తున్నారు. మొత్తం 270మందికి గాను సర్వీసులోనే చనిపోయిన వారు, వివిధ కారణాలతో ఆగినవారు పోను..ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 130మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లి తరగతి గదులను ఊడ్చి, ఆవరణలో చెత్తను తొలగించి అంతా శుభ్రం చేస్తారు. దశాబ్దాలుగా ఈ పనిని, సెలవుల్లో మినహా వీరు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

పాఠశాలలో అందుబాటులో ఉండి..తాగునీటిని తీసుకొచ్చి ఉంచడంతోపాటు ఇతర పనులు చేస్తున్నారు. ఏదోఒకరోజు తమను పర్మనెంట్‌ చేస్తారని, జీతాలు పెంచుతారనే భరోసాతో పనిచేస్తున్న వీరికి రోజువారీ కూలికి వెళ్లినంత కూడా గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 8 నెలలుగా వేతనాల చెల్లింపు కూడా నిలిచిపోవడంతో ఇంకా కష్టాలు చుట్టుముట్టాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తమను పర్మనెంట్‌ చేస్తారేమోనని చూస్తున్న వీరికి నిరాశే ఎదురవుతోంది. ఉదయాన్నే చెమటను చిందిస్తూ ఊడుస్తున్నామని, ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నామని, ఎన్నాళ్లు ఇలా జీతాలు పెంచకుండా గోస పెడతారని స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము కూడా పోరుబాట పడతామని, సమస్యల పరిష్కారానికి ఆందోళన లు చేస్తామని పలువురు అంటున్నారు.  

ఇక పోరాడుతాం.. 
స్వీపర్ల సమçస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేయించుకుంటోంది,. వేతనాలు పెంచి, పర్మనెంట్‌ చేయాలనేది మా డిమాండ్‌. ఇందుకోసం ఇక ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తాం. కార్యాచరణను రూపొందిస్తాం.  – షేక్‌ ఇమామ్‌ ఖాదర్,  స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు 

జీతాలు వస్తలేవు.. 
మాకు అతి తక్కువ జీతాలే. అవి కూడా సరిగ్గా ఇయ్యట్లే. దీంతో అప్పులు చేసి బతుకుతున్నాం. పెద్దసార్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్‌ చేయాలని వేడుకుంటున్నాం.  – కణతాల సావిత్రమ్మ, కొరట్లగూడెం, స్వీపర్‌ 

ఇంత ఘోరమా.. 
ప్రతి ఏటా..జీతం పెరుగుతుందని ఆశగా చూస్తున్నా. ఏమీ పెంచట్లే. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా..ఘోరంగా మరిచిపోతున్నారు. వచ్చే జీతం సరిపడక అప్పులు తెచ్చి ఇంటిని నెట్టుకొస్తున్నాం. మాపై దయ చూపాలి. – ఇస్లావత్‌ బాల్యా, చిన్నతండా, పాఠశాల స్వీపర్‌ నేలకొండపల్లి ప్రభుత్వ పాఠశాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement