ఉద్యోగుల విభజనలో అశాస్త్రీయ విధానాలు
ఇంటర్ విద్యా డెరైక్టరేట్ ఎదుట
తెలంగాణ ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలు అమలు చేస్తోందని విమర్శిస్తూ ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యం లో సోమవారం ఇంటర్మీడియెట్ విద్యా డెరైక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. స్థానికత ఆధారంగా కాకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా విభజన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన విషయం లో ఆంధ్రా ఉన్నతాధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని, స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మార్గదర్శకాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్‌జీఓ) అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఒక ప్రాంతం ఉద్యోగులు మరో ప్రాంతంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టాలన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.