‘మండలి’లో మొండిచేయి? | party candiates | Sakshi
Sakshi News home page

‘మండలి’లో మొండిచేయి?

Published Fri, Feb 20 2015 2:53 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

party candiates

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల  స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు
               
 శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల  స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ప్రముఖ న్యాయవాది రాంచందర్‌రావు పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీపీఆర్‌టీయూ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ఉపాధ్యాయ సంఘం నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిందిగా సీఎం స్థాయి లో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
 
  మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పూలరవీందర్, కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి వెంకట్‌రెడ్డి ఇటీవల సీఎంను కలిసినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పీఆర్‌టీయూ బలమైన యూనియన్‌గా ఉన్నందున తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరు దాదాపు ఖాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీనుంచి ఇదే స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన హైదరాబాద్ వాసి పీఎల్ శ్రీని వాస్ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉండటంతో జిల్లా నేతలకు అవకాశం దక్కడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
 
 2007 ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పోటీచేశారు. తదనంతర పరిణామాల్లో శ్రీనివాసరెడ్డి బీజేపీగూటికి చేరారు. 2009 ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని బరిలోకి దించకుండా, సిట్టింగ్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికింది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మూడో పర్యాయం పోటీ చేయడంపై స్పష్టత కొరవడింది. మరోవైపు తమను సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే మండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ద్వైవార్షిక ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
 
 పోటీకి దూరంగా కాంగ్రెస్?
 పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు కాంగ్రెస్ మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి ఎవరనే అంశంపై జిల్లా నేతల్లో స్పష్టత కొరవడింది. పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగానే బరిలోకి దిగేందుకు కొందరు ఔత్సాహికులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, రిటైర్డు ఉద్యోగులు నామినేషన్ వేసేందుకు సన్నిహితులతో సంప్రదింపులు సాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement