ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి (78) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం 4.30గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు.
1990–92 మధ్య కాలంలో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర చిన్ననీటి పారుదల, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ ఇండిపెండెంట్ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరు పొందిన ఆయన గ్రామగ్రామాన అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులు, కుటుంబీకులు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగారు.
తన జీవిత చరమాంకం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు. తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 4వ ఏప్రిల్ 1944లో జన్మించిన ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి ఉన్నారు.
రాజకీయాల్లో చెరగని ముద్ర
పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాంచంద్రారెడ్డి జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. 1978లో తొలిసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఆయన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చిల్కూరి వామన్‌రెడ్డిపై విజయం సాధించి తన సత్తా చాటారు.
1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన స్వతంత్ర అభ్యర్థి వామన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 1985లో మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి లక్ష్మణ్‌రావుపై విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన టీడీపీ అఽభ్యర్థి చంద్రకాంత్‌రెడ్డిపై గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రాంచంద్రారెడ్డి 2004లో మరోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు.
2009, 2012 ఎన్నికల్లో జోగు రామన్న చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన పార్టీ పటిష్టతకు పనిచేస్తూ వచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, నాలుగుసార్లు గెలుపొందారు. రాష్ట్ర ఇండిపెండెంట్ మంత్రిగానూ సేవలందించారు.
ఇళ్ల స్థలాలిచ్చిన ఘనత ఆయనదే..
నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు శ్రమించిన రాంచంద్రారెడ్డి పేదల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. పట్టణంలోని రాంనగర్, కేఆర్‌కే కాలనీ, చిల్కూరి లక్ష్మీనగర్, బంగారుగూడ, బట్టిసావర్‌గాం పరిధిలోని సర్వే నంబర్ 170లో వేలాదిమంది నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించి పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ఆయనకే సొంతం.
జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్యకళాశాల ఏర్పాటు, తాంసి మండలం వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్ట్ నిర్మాణం కూడా ఆయన కృషి ఫలితమే. ఎమ్మెల్యేగా ప్రతి గ్రామంలోనూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి పేదలకు సొంతగూడు కల్పించారు.
తుదిశ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే..
కాంగ్రెస్‌లో చేరిన నుంచి తుదిశ్వాస విడిచేవరకూ రాంచంద్రారెడ్డి ఇదే పార్టీలో కొనసాగారు. గత ఏప్రిల్ 26న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహించిన నిరుద్యోగ గర్జన సభలో రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. శ్రీరామ నవమి రోజున జన్మించడంతో ఆయన పుట్టినరోజు వేడుకలను అదే పండగ రోజు నిర్వహించేవారు.
తులాభారం నిర్వహించి పేదలకు అన్నదానం చేసేవారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11గంటలకు తన స్వగ్రామమైన ఖోడద్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment