
'ఆ నిర్ణయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది'
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ఏకపక్షంగా నియమించిందని ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాల్ని తీసుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్లో సర్వే చేయించి బలమైన నేతకే టీ.పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఈ నియామకం తనను బాధించిందని, కొందరు సీనియర్లు కొత్త పీసీసీ అధ్యక్షుడికి సహకరించరని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, సీఎల్పీ డిప్యూటీ నేతగా పార్టీ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను తొలగించి..ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.