Ponnala Lakshmiah
-
కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు పొన్నాల. కాంగ్రెస్ బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఈ సందర్భంలో పొన్నాల ఆ లేఖలో ఆరోపించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత పార్టీలోనే పరాయి వాళ్లమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో పార్టీని అమ్మకానికి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో సీట్లను ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు. జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారనే అంచనాల మధ్య పొన్నాల పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్లో చేరిక? మరోవైపు ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్లో చేరతారని, బీఆర్ఎస్ ఆయనకు జనగామ టికెట్ ఆఫర్ చేయనుందనే తెలుస్తోంది. సాయంత్రం కల్లా ఈ అంశంపై ఓ స్పష్టత రానుంది. నలభై ఏళ్ల బంధం.. 1980 నుంచి పొన్నాల కాంగ్రెస్‌తో కొనసాగుతున్నారు. 1992లో పొరుగు దేశాల ప్రధానులను, విదేశీ ప్రతినిధులు పాల్గొన్న తిరుపతి కాంగ్రెస్ ప్లీనరీ సెషన్ విజయవంతం కావడంలో పొన్నాలదే కీలక పాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. అయితే.. ఆ తర్వాతే కాంగ్రెస్‌లో పరిస్థితులపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ పొన్నాల లక్ష్మయ్యకు చివరి నిమిషంలో టిక్కెట్టు దక్కడం గమనార్హం. గత ఎన్నికల సమయంలో.. జనగామ అసెంబ్లీ టిక్కెట్టును పొత్తులో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు కేటాయించాలని కాంగ్రెస్ భావించింది. ఈ విషయమై పొన్నాల లక్ష్మయ్య కోదండరాంతో చర్చించారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరికి టిక్కెట్టు దక్కించు కున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య ఓటమి పాలయ్యారు. -
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంప పెట్టు కావాలన్నారు కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి దుబ్బాకలో ఎలాంటి అబివృద్ధి చేయలేదు. భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్తాయికి తీసుకువెల్లింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చేతగాని మాటలు చేప్పి కేసీఆర్ అదికారంలోకి వచ్చాడు. 30 శాతం మంది కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదు. రైతులకు రుణమాఫీ జరగలేదు. కేసీఆర్ పాలనలో రైతులకు పంటనష్టం డబ్బులు రాలేదు. నియంత్రిత సాగు చేయించి మొక్కజొన్న, పత్తి రైతులకు అన్యాయం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలను కలవడు వారి బాగోగులు చూడడు. దేశంలో పెద్ద అవినీతి పరుడు కేసీఆర్. మిషన్ భగీరథ.. సాగునీటి ప్రాజెక్టుల అవినీతిలో జైలు పాలు కాకతప్పదు’ అన్నారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) -
‘బెదిరింపులు ఎక్కువకాలం పనిచేయవ్’
సాక్షి, హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధైర్యపడరని తెలిపారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయనప్పటికీ సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమైందని వివరించారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవిపై మాట్లడటానికి పొన్నాల నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘హుజూరు నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడరు. ఉపఎన్నికల్లో అధికారపార్టీకి వెసులబాటు ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సర్వసాధారణమే. కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటోంది. మహారాష్ట్ర ,హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా గతంతో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల అస్త్రంగా వాడుకొని ప్రచారం చేసిన బీజేపీ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు రాలేదు. సెంటిమెంట్, బెదిరింపులు శాశ్వతంగా పనిచేయవు. ప్రజలు మార్పు కోరుకుంటారు’ అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. -
పొన్నాల సోదరి మనవడి మృతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సోదరి నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మనవడు ధృపత్(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషను పరిధిలోని విప్రో సర్కిల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ధృపత్ డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘టీఆర్ఎస్, బీజేపీవి లాలూచీ రాజకీయాలు’
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో టీఆర్ఎస్, బీజేపీలు లాలూచీ పడి రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు పరస్పర అవగాహనతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్కు రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చి.. దీనిపై జరిగే చర్చలో ఈ అంశాలను లేవనెత్తవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణకు అమలు కావాల్సిన విభజన చట్టంలోని హామీలపైనా కేంద్రాన్ని నిలదీయవచ్చన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ పరామర్శించని కేసీఆర్.. ఫ్రంట్ అంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు కోల్‌కతా వెళ్లినందుకు సిగ్గుపడాలన్నారు. -
అవగాహనలేని కోమటిరెడ్డి బ్రదర్స్: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జానారెడ్డి అవుతారని అవగాహన లేకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. శాసనసభ్యులుగా ఎన్నికైన వారే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కాంగ్రెస్ విధానమని, ఒకరిద్దరు వ్యక్తుల ఇష్టం కాదని తెలిపారు. కోమటిరెడ్డి విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేతలంతా సమిష్టిగా పోరాడితే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చుననే భావన సామాన్య ప్రజల్లో ఉందన్నారు. ఏ లక్ష్యాలు, ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించుకున్నామో, వాటిని సీఎం కేసీఆర్ నీరుగార్చారని విమర్శించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ఉద్యమకారులను, హక్కుల కోసం ప్రశ్నించే వారిని తీవ్రవాదులను చూసినట్లు ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఉద్యమ నేతల ఇళ్లపై దాడులు, అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్ కుటుంబ జాగీరు అన్నట్టుగా పాలిస్తున్నారని విమర్శించారు. నా రాష్ట్రం, నా ఇష్టం, నన్నెవరూ ప్రశ్నించడానికి వీలులేదు అనే నియంతృత్వ, నిరంకుశ ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలు చేసిన కేసీఆర్‌ను ఇప్పటిదాకా 33 సార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయన్నారు. తన భూమికి సంబంధించిన అంశాన్ని పట్టుకుని రాజకీయంగా దెబ్బకొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఈ విషయంలోనూ మరోసారి మొట్టికాయ పడకుండా చూసుకోవాలని హెచ్చరించారు. -
'ఆ నిర్ణయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది'
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ఏకపక్షంగా నియమించిందని ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాల్ని తీసుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సర్వే చేయించి బలమైన నేతకే టీ.పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఈ నియామకం తనను బాధించిందని, కొందరు సీనియర్లు కొత్త పీసీసీ అధ్యక్షుడికి సహకరించరని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, సీఎల్పీ డిప్యూటీ నేతగా పార్టీ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను తొలగించి..ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. -
'నీళ్లు, నిధులను ఆంధ్రావాళ్లకు దోచి పెట్టారు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పొన్నాల నీళ్లు, నిధులను ఆంధ్రావాళ్లకు దోచి పెట్టారని ఆరోపించారు. మంత్రిగా పొన్నాల ఆంధ్రాకే న్యాయం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని రాజయ్య అన్నారు. రూ.19వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశారన్నారు. నిరుపేదలకు భూములను పంచుతున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి...తెలంగాణలో అదనంగా ఎకరం కూడా సాగులోకి తేలేదని రాజయ్య అన్నారు. హెల్త్ యూనివర్శిటీకి వరంగల్‌లో ఎక్కువ భూములున్నాయన్నారు. ఇక కేసీఆర్ తనపై చేసిన మాటలను వ్యక్తిగతంగా చూడవద్దని రాజయ్య అన్నారు. కేసీఆర్ తనకు తండ్రిలాంటివారని ఆయన పేర్కొన్నారు. -
ఓటమికి నేను బాధ్యుడినా?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నా కొందరు పనిగట్టుకుని తనను బాధ్యుడిగా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ఎదుట వాపోయినట్టు తెలిసింది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు పగ్గాలు చేపట్టిన తాను ఓటమికి ఎలా బాధ్యుడిని అవుతానని అందులో ప్రశ్నించినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓట మికి కారణాలు, ముఖ్యనేతల పనితీరు, సమన్వయలోపం, రాబోయే రోజుల్లో పార్టీ బ లోపేతానికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ పొన్నాల 8 పేజీల నివేదికను ఆంటోనీ కమిటీకి అందజేసినట్టు తెలిసింది. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణకు వ్యతిరేకంగా పదేపదే మాట్లాడుతూ ఈ ప్రాంతప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తప్పించకుండా ఉపేక్షించడం, తెలంగాణ ముఖ్యనేతల మధ్య సమన్వయలోపం, దేశవ్యాప్తంగా యూపీఏ పట్ల వ్యతిరేకత వంటి కారణాలు ఓటమికి దారితీశాయన్న పొన్నాల వాదనను ఆంటోనీసహా సభ్యులంతా ఆసక్తిగా వినడంతోపాటు.. పీసీసీ, డీసీసీల ప్రక్షాళన, సభ్యత్వనమోదుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. -
పొన్నాలకు సవాల్
ప్రతిష్టాత్మకంగా జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక - 24 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ - అయినా.. పీఠం దక్కుతుందన్న ఆశలు లేవు - తాజాగా క్యాంపునకు దూరమైన ముగ్గురు సభ్యులు - పట్టు పెంచుకుంటున్న టీఆర్ఎస్ - కాంగ్రెస్‌కు చైర్పర్సన్ పదవి దక్కకుంటే టీ పీసీసీ చీఫ్‌కు ఇబ్బందులే సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక పెద్ద పరీక్షగా మారింది. టీఆర్ఎస్కు మొదటి నుంచీ పట్టుంది. టీఆర్ఎస్ హవాలోనూ స్థానిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్రులు ఒక స్థానం గెలుచుకున్నారు. ఇలా ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్‌కే జెడ్పీ పీఠం దక్కుతుందని ఫలితాలు వచ్చిన వారం వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో పరి స్థితి మారింది. జెడ్పీ చైర్పర్సన్ పదవి లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించారుు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పొన్నాల టార్గెట్‌గా కాంగ్రెస్‌లో విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనూ ఆయనపై విమర్శలు పెరిగాయి. పొన్నాల సొంత నియోజకవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం సైతం టీఆర్ఎస్లో చేరారు. పొన్నాల లక్ష్మయ్య తీరుతోనే పార్టీకి ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇతర జిల్లాల నేతల నుంచి ప్రతిరోజూ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో జెడ్పీ ఎన్నిక పొన్నాలకు పరీక్షగా మారనుంది. కాంగ్రెస్‌కు జెడ్పీ పీఠం దక్కితే పొన్నాలకు విమర్శల నుంచి కొంత ఊరట కలగనుంది. దక్కనిపక్షంలో పొన్నాలపై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. క్యాంపు.. రోజుకో మలుపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ క్యాంపు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాంపు ప్రారంభించిన మొదట్లో 21 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు, బీజేపీ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ సభ్యుడు కలిపి 25 మంది క్యాంపులో ఉన్నారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తమవైపు ఉన్నారని.. చైర్మన్ పీఠం తమేదనని ప్రకటిస్తూ వచ్చారు. కాంగ్రెస్ క్యాంపు ఊటీలో ఉన్న సమయంలో గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కీలక నేతలు ఒప్పించడంతో ఆగిపోయారు. కాంగ్రెస్ క్యాంపునకు మొదటి నుంచీ దూరంగా ఉంటున్న పాలకుర్తి సెగ్మెం ట్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు తమకు మద్దతు ఇస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జారీ చేసిన నోటీసుపై వీరు ముగ్గురు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వీరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ క్యాంపులోని ముగ్గురు సభ్యులు బయటకు వచ్చారు. వైస్‌చైర్మన్ పదవి ఆశించినా కాంగ్రెస్‌లో హామీ లేకపోవడంతో నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడి తోపాటు శాయంపేట, చిట్యాల జెడ్పీటీసీ సభ్యులు క్యాంపు నుంచి బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో ఉన్న సంబంధాల కారణంగానే భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు జెడ్పీటీసీలు కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో జెడ్పీ చైర్మన్ కచ్చితంగా తమకే దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన 18 మందితోపాటు నలుగురు టీడీపీ, పాలకుర్తి పరిధిలోని ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులతో మొత్తం 25 మంది ఉన్నారని వీరు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చిన ముగ్గురు సభ్యులు కలిపి తమ బలం 28కి పెరిగిందని.. జెడ్పీ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు ఇంకా ఏడు రోజుల గడువుంది. ఈలోపు రాజకీయ పరిణామాలు మరింత మారే పరిస్థితి కనిపిస్తోంది. -
అధికార పక్షానికి సహకరిస్తాం: పొన్నాల
ఓటమికి తనదే బాధ్యత అని అంగీకారం సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో అధికార పక్షానికి సహకరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇందుకోసం రాజీలేని కృషి చేస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటమికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ అధిష్టానానికి నివేదిక పంపుతామని చెప్పారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్.. తెలంగాణలోనూ కనిపించిందని అభిప్రాయపడ్డారు. కేవలం మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఏనాడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. దీనిపై బాధపడాల్సిన అవసరం లేదని, అయితే ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై సహజంగా ఉండే వ్యతిరేకతలను కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్.. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ అనుకూలంగా మార్చుకున్నాయని విశ్లేషించారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి పాటుపడతామని పేర్కొన్నారు. -
'శంకరమ్మపై టీఆర్ఎస్ది కృత్రిమ ప్రేమ'
హైదరాబాద్ : ఒప్పందం ప్రకారమే సీపీఐకి సీట్లు కేటాయించామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం సూచనల మేరకే మల్రెడ్డి రంగారెడ్డికి షరతులతో బీఫారమ్ ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కలిపించామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి వస్తామని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హేయమైన చరిత్ర కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని పొన్నాల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవారికే టికెట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అమర వీరులకు టికెట్లు ఇవ్వాలని అంశం తన దృష్టికి రాలేదని పొన్నాల తెలిపారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నచోట శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్కు శంకరమ్మపై ఉన్న కృత్రిమ ప్రేమకు ఇది నిదర్శనమని పొన్నాల వ్యాఖ్యానించారు. -
పొన్నాల ఇంట్లో మహిళా నేత దీక్ష
కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అవకాశం తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జీహెచ్ఎంసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఐత రజనీదేవి ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె మొదట గాంధీ భవన్లో ఆందోళన చేపట్టారు. సాయంత్రం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద ధర్నాకు దిగారు. తనకు బీ-ఫారం ఇచ్చేవరకు కదిలేది లేదంటూ అర్ధరాత్రి వరకూ ఆమె పొన్నాల నివాసంలోనే ఉన్నారు. మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మద్దతు దారులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాంత్ అనే కార్యకర్త రజనీదేవికి మద్దతుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నేత దానం నాగేందర్ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించారు. ఉదయంలోగా తేల్చండి: మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి భంగపడిన మల్రెడ్డి రంగారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అధిష్టానంపై మరోసారి ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జానారెడ్డిని వెంటబెట్టుకొని పొన్నాలను కలిశారు. తనకు ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వాలని, తాను గెలుస్తానని పొన్నాలకు తెలిపారు. అయితే, తనతో చేతిలో ఏమీ లేదని ఈ సందర్భంగా పొన్నాల పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ఉదయంలోగా తనకు టికెట్ ఇస్తే సరని, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. -
బీసీలకు ధోకా..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల్లో సామాజిక న్యాయం నినాదాన్ని ఊదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపులో మాత్రం దీన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే బీసీలకు అన్యాయం జరిగింది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఏడు జనరల్ కేటగిరీకి ఇచ్చారు. కేవలం రెండు సీట్లను మాత్రమే వెనుక బడిన వర్గాలకు కేటాయించింది. ఈ రెండు సీట్లలోనూ ఒకటి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు, మరొకటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు. పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు కావడం వల్లే ఈ ఇద్దరికీ సీట్లు వచ్చాయని, బీసీలనే విషయంలో కాదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సా మాజిక న్యాయం అమలు కోసమే తెలంగాణ ఇచ్చామ ని చెబుతున్న కాంగ్రెస్... చట్టసభలకు ఎంపిక చేయడం లో తమకు తీవ్ర అన్యాయం చేసిందని వెనుకవడిన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పు డు కూడా కాంగ్రెస్ ఇంత తక్కువ స్థానాలను బీసీలకు కేటాయించలేదని పేర్కొంటున్నారు. 2012 ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థి లేని తరుణంలో పార్టీలోకి వచ్చి న బీసీ నేత సాంబారి సమ్మారావుకు ఇప్పుడు టికెట్ కేటాయించలేదు.అప్పుడు మంత్రులుగా ఉన్న పొన్నా ల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు పట్టుబటి సమ్మారావును కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి పోటీ చేయించారు. ఇప్పుడు సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీసీ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సిట్టింగ్‌లకు సీట్లు... జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా సీపీకి కేటాయిస్తారని భావించిన స్టేషన్‌ఘన్‌పూర్ సె గ్మెంట్కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జి.విజయరామారావుకు ఈ సీటు కేటాయించారు. ఎక్కువ మంది అభ్యర్థిత్వాలు ఆశించిన వరంగల్ పశ్చిమ అసెంబ్లీ టికెట్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణకు దక్కింది. 14 మంది వరకు పోటీ పడిన ఈ సీటును మహిళా కోటాలో స్వర్ణకు ఇచ్చినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లాలోని ఈ సీటు విషయంలోనే పట్టుబట్టినట్లు తెలిసింది. ఏడాది క్రితం నుంచే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు ఇచ్చారు. అనుకున్నట్లుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుగురికీ సీట్లు ద క్కాయి. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే సూత్రం అ నేది రెడ్యానాయక్‌కు వర్తించ లేదు. గత ఎన్నికల్లోనే పో టీ చేయడంతో ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోలేదు. తిరుగుబాటులో అసంతృప్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా వెలువడిన వెంటనే అసంతృప్తి వెల్లువెత్తింది. టికెట్లు దక్కని పలువురు ఆశావహులు రాజీనామా బాట పట్టారు. మరికొందరు తిరుబావుటా ఎగరేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న వారిని కాదని టీఆర్ఎస్ నుంచి వచ్చిన విజ యరామారావుకు టికెట్ కేటాయించడంతో స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇంచార్జీ రాజారపు ప్రతాప్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీకి ఎవరూలేని సమయంలో పోటీ చేసిన తనను విస్మరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లోనే మరొకరికి ఇచ్చినా ఫర్వాలేదు గానీ.. ఆరు నెలల క్రితం టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ సీపీఐకి ఇస్తారని భావించామని... కాంగ్రెస్ వచ్చేలా చేస్తే ఇప్పుడు పార్టీకి సంబంధంలేని వారికి ఇవ్వడం ఏమిటని వాపోతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణకు ఇవ్వడాన్ని ఇతర ఆశావహులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తిరుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జంగా రాఘవరెడ్డి ఈ నెల బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఇదే స్థానాన్ని ఆశించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి సైతం అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా రోజులుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనకు అన్యాయం చేశారని నాయిని అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల దిష్టిబొమ్మ దహనం హన్మకొండ చౌరస్తా : వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ టికెట్‌ను ఎర్రబెల్లి స్వర్ణకు కేటాయించడంపై బండా ప్రకాష్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హన్మకొండ లోని డీసీసీ భవన్ ఎదుట సోమవారం రాత్రి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండా ప్రకాష్‌కు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. -
మళ్లీ వారే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నో మలుపులు.. మార్పులు.. తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారమే ఇదిగో జాబితా అంటూ ఊరించి జారుకున్న కాంగ్రెస్ అధిష్టానం మొత్తానికి సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఎన్ని మలుపులు తిరిగినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచిం ది. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతిని, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. నిజానికి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారమే తుది మెరుగు లు దిద్దింది. ఈ జాబితానే ఢిల్లీలోని విశ్వసనీయ వక్తుల ద్వారా చేజిక్కించుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం సంచికలో ‘కాంగ్రెస్ టీం ఖరారు’ అనే శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘సాక్షి’ ముందే వెల్లడించిన పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జాబితాలో అందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, నర్సాపూర్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, పటాన్చెరు నుంచి నందీశ్వర్‌గౌడ్, గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, దుబ్బాక నుంచి చెరుకు ముత్యంరెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, నారాయణఖేడ్ నుంచి కిష్టారెడ్డి, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వీరికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీ ఫారం అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన వారిలో ఇప్పటికే చాలామంది నామినేషన్లు సమర్పించారు. -
'టీఆర్ఎస్తో పొత్తు చాలా దూరం పోయింది'
-
'టీఆర్ఎస్తో పొత్తు చాలా దూరం పోయింది'
హైదరాబాద్ : టీఆర్ఎస్తో పొత్తు చాలా దూరం పోయిందని మాజీమంత్రి జానారెడ్డి అన్నారు. సీపీఐతో పొత్తు కుదిరిందని.... టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన తెలిపారు. ఆశ కోసం కాదని... ఆశయం కోసమే సీపీఐతో పొత్తు పెట్టుకున్నట్లు జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మాజీమంత్రులు జానారెడ్డి, దానం నాగేందర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. సమావేశం అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ ఇచ్చిన మాట కోసం కఠోర నిర్ణయం తీసుకుని....ఓ పక్క పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చారన్నారు. ఓటు వేసి తెలంగాణను బలపరిచి....కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లక్ష్యాలు చేరాలంటే కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని జానారెడ్డి అన్నారు. తెలంగాణలో 13న రాహుల్ గాంధీ, 16న సోనియా గాంధీ బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు. కాగా తన కుమారుడు పోటీ చేస్తాడా లేదా అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. -
పొత్తులపై కొత్తగా చెప్పేది లేదు: పొన్నాల
న్యూఢిల్లీ: పొత్తులకు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పొత్తులపై కొత్తగా చెప్పేది లేదన్నారు. సీపీఐతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక చివరి దశకు వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రచారాన్ని మొదలుపెట్టామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అందరికీ ఆరోగ్య హక్కు కల్పించామన్నారు. ఎంఐఎంతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తామన్నారు. సీపీఐతో చర్చల కోసం హైదరాబాద్ బయలుదేరిన పొన్నాల లక్ష్మయ్య రేపు మళ్లీ ఢిల్లీకి రానున్నారు. సీపీఐకి ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోం -
‘పొన్నాల’ నియామకంపై నిరసన
యువకుడి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియామకాన్ని నిరసిస్తూ సంజయ్‌గాంధీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రాఘవగౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జేబులో జాతీయ జెండాను పెట్టుకొని సోమవారం ఉదయం ఆయన గాంధీభవన్‌లోకి ప్రవేశించాడు. భవనం పైకి ఎక్కిన అతను... అవినీతిపరుడైన పొన్నాలను తొలగించాలంటూ నినాదాలు చేశాడు. లేకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. పోలీసులు అతన్ని కిందకి దింపి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తాత్కాలిక బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలు ఎట్టకేలకు సిట్టింగు ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం బీ-పారాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అందాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగులకే మరోసారి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించటం... ఆ వెంటనే బీ ఫారాలు ఎమ్మెల్యేలకు అందజేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆదిపత్య పోరు ఉంది. వైరి వర్గాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో టికెట్‌ను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కీలక భూమిక పోషిస్తారు.ఈ నేపథ్యంలో తన అనుచరులకు, అనుయాయులకే స్థానిక సంస్థల బీ-ఫారం ఇప్పించుకోవడానికి ఎమ్మెల్యే ఆశావాహా నేతలు పోటీ పడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకున్నారు. వర్గ విభేదాలు తీవ్రంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగి రెండు వైరి వర్గాల వారిని రాజీ చర్చలకు పిలిచి చెరికొన్ని బీ-ఫారాలు పంచుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలకు కొంత ఊరటనిచ్చింది. ఖర్చు బాధ్యత ఎమ్మెల్యేలకే? స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యేలే భరించాలని కాంగ్రెస్ అధి నాయకత్వ సూచించినట్టు తెలిసింది. ఎక్కువ సీట్లు గెలిపించుకున్న వారికే తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, లేకుంటే ఆశలు వదులు కోవాలని కరాఖండీగా చెప్పి బీ- ఫారాలు చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో ఎంపీటీసీకి కనీసం రూ 4 లక్షలు, జెడ్పీటీసీకి రూ 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రూ. 3 కోట్లు నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. -
మీదే బాధ్యత ‘స్థానిక’ ఎన్నికల్లో
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ పోరులో విజయం సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. సీనియర్లను సమన్వయపరుచుకుంటూ ప్రచారపర్వాన్ని కొనసాగించాలన్నారు.మండల/ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్థానిక, సాధారణ ఎన్నికల వరకు పార్టీని సమన్వయపరుచుకునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో మూడు కమిటీలు వేయాలని పొన్నాల సూచించారు. ప్రచార కమిటీ, మేనిఫెస్టో, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, వీటిని రాష్ట్రస్థాయి కమిటీతో అనుసంధానం చేసుకోవాలన్నారు. జిల్లా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశంపై జిల్లాస్థాయి సిఫార్సులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. దానంపై ఫైర్! గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులను దానం ప్రకటించడంపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశా? దానం నాగేందరా? అని ప్రశ్నించారు. గతంలోనూ ఇలా జిల్లా పరిధిలోని అంశాలపై కలగజేసుకున్నారని, ఇది సరికాదని అన్నారు. సర్వే, ఇతర ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన పొన్నాల, ఉత్తమ్.. దానం తీరును తప్పుబట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. జెడ్పీ అభ్యర్థిగా యాదవరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని ప్రకటించేందుకు టీపీసీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. సొంత మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగాలని యోచిస్తున్నానని, జెడ్పీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని యాదవరెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు.. గెలుపే లక్ష్యంగా పనిచేయండని, అందరం సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా, జిల్లా పరిషత్‌పై కన్నేసిన కొంతమంది నేతలు ఇతర మండలాల నుంచి పోటీకి దిగుతున్నారని, దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, భిక్షపతి యాదవ్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైనందున ఈ సమావేశానికి మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్ హాజరుకాలేదు. -
జైరాం రమేష్‌తో పొన్నాల సమావేశం
హైదరాబాద్ : కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో జైరాం రమేష్‌ను ఆయన సోమవారం కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విలీనంపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే వరంగల్‌లో ఈనెల 5వ తేదీన జరిగే తెలంగాణ విజయోత్సవ బహిరంగ సభకు జైరాం రమేష్ హాజరు కానున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో విలీనంపై మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నాలుగు గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. అనంతరం పార్టీ విలీనమా, పొత్తు ఉంటుందా అనే దానిపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.