సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల్లో సామాజిక న్యాయం నినాదాన్ని ఊదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపులో మాత్రం దీన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే బీసీలకు అన్యాయం జరిగింది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఏడు జనరల్ కేటగిరీకి ఇచ్చారు. కేవలం రెండు సీట్లను మాత్రమే వెనుక బడిన వర్గాలకు కేటాయించింది.
ఈ రెండు సీట్లలోనూ ఒకటి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు, మరొకటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు. పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు కావడం వల్లే ఈ ఇద్దరికీ సీట్లు వచ్చాయని, బీసీలనే విషయంలో కాదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సా మాజిక న్యాయం అమలు కోసమే తెలంగాణ ఇచ్చామ ని చెబుతున్న కాంగ్రెస్... చట్టసభలకు ఎంపిక చేయడం లో తమకు తీవ్ర అన్యాయం చేసిందని వెనుకవడిన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఎప్పు డు కూడా కాంగ్రెస్ ఇంత తక్కువ స్థానాలను బీసీలకు కేటాయించలేదని పేర్కొంటున్నారు. 2012 ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థి లేని తరుణంలో పార్టీలోకి వచ్చి న బీసీ నేత సాంబారి సమ్మారావుకు ఇప్పుడు టికెట్ కేటాయించలేదు.అప్పుడు మంత్రులుగా ఉన్న పొన్నా ల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు పట్టుబటి సమ్మారావును కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి పోటీ చేయించారు.
ఇప్పుడు సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీసీ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
సిట్టింగ్‌లకు సీట్లు...
జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా సీపీకి కేటాయిస్తారని భావించిన స్టేషన్‌ఘన్‌పూర్ సె గ్మెంట్‌కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జి.విజయరామారావుకు ఈ సీటు కేటాయించారు. ఎక్కువ మంది అభ్యర్థిత్వాలు ఆశించిన వరంగల్ పశ్చిమ అసెంబ్లీ టికెట్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణకు దక్కింది.
14 మంది వరకు పోటీ పడిన ఈ సీటును మహిళా కోటాలో స్వర్ణకు ఇచ్చినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లాలోని ఈ సీటు విషయంలోనే పట్టుబట్టినట్లు తెలిసింది. ఏడాది క్రితం నుంచే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు ఇచ్చారు. అనుకున్నట్లుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుగురికీ సీట్లు ద క్కాయి. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే సూత్రం అ నేది రెడ్యానాయక్‌కు వర్తించ లేదు. గత ఎన్నికల్లోనే పో టీ చేయడంతో ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోలేదు.
తిరుగుబాటులో అసంతృప్తులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా వెలువడిన వెంటనే అసంతృప్తి వెల్లువెత్తింది. టికెట్లు దక్కని పలువురు ఆశావహులు రాజీనామా బాట పట్టారు. మరికొందరు తిరుబావుటా ఎగరేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న వారిని కాదని టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన విజ యరామారావుకు టికెట్ కేటాయించడంతో స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇంచార్జీ రాజారపు ప్రతాప్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు.
ఉప ఎన్నికల్లో పార్టీకి ఎవరూలేని సమయంలో పోటీ చేసిన తనను విస్మరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లోనే మరొకరికి ఇచ్చినా ఫర్వాలేదు గానీ.. ఆరు నెలల క్రితం టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ సీపీఐకి ఇస్తారని భావించామని... కాంగ్రెస్ వచ్చేలా చేస్తే ఇప్పుడు పార్టీకి సంబంధంలేని వారికి ఇవ్వడం ఏమిటని వాపోతున్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణకు ఇవ్వడాన్ని ఇతర ఆశావహులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తిరుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జంగా రాఘవరెడ్డి ఈ నెల బుధవారం నామినేషన్ వేయనున్నారు.
ఇదే స్థానాన్ని ఆశించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి సైతం అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా రోజులుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనకు అన్యాయం చేశారని నాయిని అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సన్నిహితులతో చర్చిస్తున్నారు.
టీ పీసీసీ చీఫ్ పొన్నాల దిష్టిబొమ్మ దహనం
హన్మకొండ చౌరస్తా : వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ టికెట్‌ను ఎర్రబెల్లి స్వర్ణకు కేటాయించడంపై బండా ప్రకాష్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హన్మకొండ లోని డీసీసీ భవన్ ఎదుట సోమవారం రాత్రి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండా ప్రకాష్‌కు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు.
బీసీలకు ధోకా..
Published Tue, Apr 8 2014 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement