పొన్నాలకు సవాల్ | challenge to ponnala lakshmiah | Sakshi
Sakshi News home page

పొన్నాలకు సవాల్

Published Sun, Jun 29 2014 3:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పొన్నాలకు సవాల్ - Sakshi

పొన్నాలకు సవాల్

 ప్రతిష్టాత్మకంగా జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక
- 24 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్
- అయినా.. పీఠం దక్కుతుందన్న ఆశలు లేవు
- తాజాగా క్యాంపునకు దూరమైన ముగ్గురు సభ్యులు
- పట్టు పెంచుకుంటున్న టీఆర్‌ఎస్
- కాంగ్రెస్‌కు చైర్‌పర్సన్ పదవి దక్కకుంటే టీ పీసీసీ చీఫ్‌కు ఇబ్బందులే
 సాక్షి ప్రతినిధి, వరంగల్ :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక పెద్ద పరీక్షగా మారింది. టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచీ పట్టుంది. టీఆర్‌ఎస్ హవాలోనూ స్థానిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 24, టీఆర్‌ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్రులు ఒక స్థానం గెలుచుకున్నారు.

ఇలా ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్‌కే జెడ్పీ పీఠం దక్కుతుందని ఫలితాలు వచ్చిన వారం వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో పరి స్థితి మారింది. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలు ప్రారంభించారుు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పొన్నాల టార్గెట్‌గా కాంగ్రెస్‌లో విమర్శలు పెరుగుతున్నాయి.

కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలోనూ ఆయనపై విమర్శలు పెరిగాయి. పొన్నాల సొంత నియోజకవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. పొన్నాల లక్ష్మయ్య తీరుతోనే పార్టీకి ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇతర జిల్లాల నేతల నుంచి ప్రతిరోజూ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో జెడ్పీ ఎన్నిక పొన్నాలకు పరీక్షగా మారనుంది. కాంగ్రెస్‌కు జెడ్పీ పీఠం దక్కితే పొన్నాలకు విమర్శల నుంచి కొంత ఊరట కలగనుంది. దక్కనిపక్షంలో పొన్నాలపై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది.
 
క్యాంపు.. రోజుకో మలుపు
జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ క్యాంపు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.  క్యాంపు ప్రారంభించిన మొదట్లో 21 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు, బీజేపీ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ సభ్యుడు కలిపి 25 మంది క్యాంపులో ఉన్నారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తమవైపు ఉన్నారని.. చైర్మన్ పీఠం తమేదనని ప్రకటిస్తూ వచ్చారు. కాంగ్రెస్ క్యాంపు ఊటీలో ఉన్న సమయంలో గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.

కీలక నేతలు ఒప్పించడంతో ఆగిపోయారు. కాంగ్రెస్ క్యాంపునకు మొదటి నుంచీ దూరంగా ఉంటున్న పాలకుర్తి సెగ్మెం ట్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు తమకు మద్దతు ఇస్తారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జారీ చేసిన నోటీసుపై వీరు ముగ్గురు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వీరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ క్యాంపులోని ముగ్గురు సభ్యులు బయటకు వచ్చారు.

వైస్‌చైర్మన్ పదవి ఆశించినా కాంగ్రెస్‌లో హామీ లేకపోవడంతో నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడి తోపాటు శాయంపేట, చిట్యాల జెడ్పీటీసీ సభ్యులు క్యాంపు నుంచి బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో ఉన్న సంబంధాల కారణంగానే భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు జెడ్పీటీసీలు కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో జెడ్పీ చైర్మన్ కచ్చితంగా తమకే దక్కుతుందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

సొంత పార్టీకి చెందిన 18 మందితోపాటు నలుగురు టీడీపీ, పాలకుర్తి పరిధిలోని ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీ  సభ్యులతో  మొత్తం 25 మంది ఉన్నారని వీరు అంటున్నారు.  తాజాగా కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటికి వచ్చిన ముగ్గురు సభ్యులు కలిపి తమ బలం 28కి పెరిగిందని.. జెడ్పీ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు ఇంకా ఏడు రోజుల గడువుంది. ఈలోపు రాజకీయ పరిణామాలు మరింత మారే పరిస్థితి కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement