'శంకరమ్మపై టీఆర్ఎస్ది కృత్రిమ ప్రేమ'
హైదరాబాద్ : ఒప్పందం ప్రకారమే సీపీఐకి సీట్లు కేటాయించామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం సూచనల మేరకే మల్రెడ్డి రంగారెడ్డికి షరతులతో బీఫారమ్ ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కలిపించామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి వస్తామని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
హేయమైన చరిత్ర కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని పొన్నాల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవారికే టికెట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అమర వీరులకు టికెట్లు ఇవ్వాలని అంశం తన దృష్టికి రాలేదని పొన్నాల తెలిపారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నచోట శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్కు శంకరమ్మపై ఉన్న కృత్రిమ ప్రేమకు ఇది నిదర్శనమని పొన్నాల వ్యాఖ్యానించారు.