
అధికార పక్షానికి సహకరిస్తాం: పొన్నాల
ఓటమికి తనదే బాధ్యత అని అంగీకారం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో అధికార పక్షానికి సహకరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇందుకోసం రాజీలేని కృషి చేస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటమికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ అధిష్టానానికి నివేదిక పంపుతామని చెప్పారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్.. తెలంగాణలోనూ కనిపించిందని అభిప్రాయపడ్డారు. కేవలం మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఏనాడూ చూడలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. దీనిపై బాధపడాల్సిన అవసరం లేదని, అయితే ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై సహజంగా ఉండే వ్యతిరేకతలను కొన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్.. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ అనుకూలంగా మార్చుకున్నాయని విశ్లేషించారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి పాటుపడతామని పేర్కొన్నారు.