'టీఆర్ఎస్తో పొత్తు చాలా దూరం పోయింది'
హైదరాబాద్ : టీఆర్ఎస్తో పొత్తు చాలా దూరం పోయిందని మాజీమంత్రి జానారెడ్డి అన్నారు. సీపీఐతో పొత్తు కుదిరిందని.... టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన తెలిపారు. ఆశ కోసం కాదని... ఆశయం కోసమే సీపీఐతో పొత్తు పెట్టుకున్నట్లు జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మాజీమంత్రులు జానారెడ్డి, దానం నాగేందర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు.
సమావేశం అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ ఇచ్చిన మాట కోసం కఠోర నిర్ణయం తీసుకుని....ఓ పక్క పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చారన్నారు. ఓటు వేసి తెలంగాణను బలపరిచి....కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లక్ష్యాలు చేరాలంటే కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని జానారెడ్డి అన్నారు. తెలంగాణలో 13న రాహుల్ గాంధీ, 16న సోనియా గాంధీ బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు. కాగా తన కుమారుడు పోటీ చేస్తాడా లేదా అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.