
ఓటమికి నేను బాధ్యుడినా?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నా కొందరు పనిగట్టుకుని తనను బాధ్యుడిగా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ఎదుట వాపోయినట్టు తెలిసింది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు పగ్గాలు చేపట్టిన తాను ఓటమికి ఎలా బాధ్యుడిని అవుతానని అందులో ప్రశ్నించినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓట మికి కారణాలు, ముఖ్యనేతల పనితీరు, సమన్వయలోపం, రాబోయే రోజుల్లో పార్టీ బ లోపేతానికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ పొన్నాల 8 పేజీల నివేదికను ఆంటోనీ కమిటీకి అందజేసినట్టు తెలిసింది.
పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణకు వ్యతిరేకంగా పదేపదే మాట్లాడుతూ ఈ ప్రాంతప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తప్పించకుండా ఉపేక్షించడం, తెలంగాణ ముఖ్యనేతల మధ్య సమన్వయలోపం, దేశవ్యాప్తంగా యూపీఏ పట్ల వ్యతిరేకత వంటి కారణాలు ఓటమికి దారితీశాయన్న పొన్నాల వాదనను ఆంటోనీసహా సభ్యులంతా ఆసక్తిగా వినడంతోపాటు.. పీసీసీ, డీసీసీల ప్రక్షాళన, సభ్యత్వనమోదుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.