ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులే ఉండటంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజాకూటమి – టీఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని కూటమి పార్టీలు∙పట్టుదలగా ఉన్నాయి. ఇరు పార్టీల అభ్యర్థుల తరఫున అధినేతలు ప్రచార పర్వంలో దూకారు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో ప్రధాన పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని తాండూరు, పరిగి సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఆ పార్టీ నేతలు.. కూటమి ప్రముఖులతో పర్యటనలు ఖరారు చేశారు.
సాక్షి, వికారాబాద్: మహాకూటమి తరఫున జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించారు. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే రంగంలోకి దించారు. దీంతో ఆ పార్టీ నాయకులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్‌ఎస్ తరఫున ఇప్పటికే కేసీఆర్ పర్యటించడంతో.. ఇదే స్థాయిలో ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. బుధవారం ఉదయం 11.30కు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బహిరంగసభ ఏర్పాటుచేశారు. కోస్గి– కొడంగల్ రోడ్డులో పట్టణ శివారులో ఈ సభ నిర్వహించనున్నారు. దీనికి జనం భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 29న సాయంత్రం 4.15 నిమిషాలకు పరిగిలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ముమ్మరంగా నేతల పర్యటనలు...
పరిగిలో బుధవారం విజయశాంతి పర్యటించనున్నారు. తాండూరు సెగ్మెంట్‌లో ఈ నెల 28న బుధవారం ప్రజాకూటమి తరఫున విజయశాంతి, కోదండరాం, గద్దర్‌లు ప్రచారం చేయనున్నారు. 29న టీఆర్‌ఎస్ తరఫున ఎంఐఎం అధినేత, ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ప్రచార కార్యక్రమం ఖరారైంది. వచ్చే నెల 2న తాండూరులో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారని టీఆర్‌ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 4, 5 తేదీల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.
కొడంగల్ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పర్యటించే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చేనెల 2న తాండూరులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి.కొడంగల్ సెగ్మెంట్‌లో వచ్చే నెల 3 లేదా 4 తేదీల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తారని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఖరారు కాలేదు.
భారీ జనసమీకరణ..
కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కోస్గికి బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రానున్న నేపథ్యంలో భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల తర్వాత ఇందిరాగాంధీ మనవడు రాహుల్‌గాంధీ గ్రామీణ ప్రాంతమైన కొడంగల్‌కు వస్తున్న సందర్భంగా జెండాలు, ఎజెండాలు, పార్టీలకు అతీతంగా స్వాగతం పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment