.సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం నుంచి ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ వాసుల్లో అధికశాతం ఊళ్లు 200 కిలోమీటర్లలోపే కాబట్టి వీరంతా నేరుగా బస్టాండ్లకే వచ్చి ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎక్కుతున్నారు. దూరంగా ఉన్న ప్రాంతాలకు రాజధాని, సూపర్ లగ్జరీ, వజ్ర, గరుడ బస్సుల్లో రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఆంధ్ర బస్సులే ముందు నిండుతున్నాయి
ఈసారి తెలంగాణ 5,252 ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఇందులో 1,500లకుపైగా బస్సులను ఆంధ్ర ప్రాంతానికే నడుపుతోంది. ప్రముఖ టికెట్ అగ్రిగేటర్ సంస్థల్లో ప్రైవేటు సంస్థలతో పాటు టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థల బస్సులను కూడా బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ అగ్రిగేటర్ ద్వారా ఆన్‌లైన్‌లో టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థల టికెట్లు వెనువెంటనే అమ్ముడవుతున్నాయి. కానీ ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఇక్కడ తెలివిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి బయలుదేరే బస్సుల జాబితాలో కొన్ని డీలక్స్ బస్సులను కూడా చేర్చినట్లు సమాచారం. దీంతో ప్రారంభ ధర టీఎస్‌ఆర్టీసీ కన్నా తక్కువ చూపిస్తుండటంతో ప్రయాణికులు ఏపీ బస్సులనే ముందుగా బుక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణకు చెందిన కొన్ని బస్సుల్లో దాదాపు రూ.8 వరకు చార్జీలు తక్కువగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రైవేటు క్యాబ్‌ల హల్‌చల్..
పండుగ సందర్భంగా తెలంగాణ జిల్లాలకు టీఎస్‌ఆర్టీసీ దాదాపుగా 3,500 బస్సులు వేసింది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. బస్టాండ్లలోకి ప్రైవేటు వాహనాలు రాకుండా.. వచ్చిన బస్సులకు రద్దీ చిక్కులు లేకుండా ఎప్పటికప్పుడు పంపేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. అయితే వీరి కన్నుగప్పి ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తున్నారు. జూబ్లీ, ఉప్పల్, ఎంజీబీఎస్ సమీప గల్లీల్లో వాహనాలు నిలిపి వారే స్వయంగా కారు ఉందని చెప్పి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. రద్దీని ఆసరాగా చేసుకుని బస్సు చార్జీలకు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నారు. జిల్లాల బస్టాండ్లలోనూ ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లు తమ దందా కొనసాగిస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయానికి చిల్లు
Published Sat, Jan 12 2019 4:41 AM | Last Updated on Sat, Jan 12 2019 4:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment