
27 ఏళ్ల యువకుడు.. 77 ఏళ్ల వృద్ధుడు
మెట్‌పల్లి: అతడి వయసు 27 ఏళ్లు.. కానీ పాస్‌పోర్టు ప్రకారం చూస్తే 77 సంవత్సరాలు.. ఇదెలా సాధ్యమంటారా..? అంతా పాస్‌పోర్టు కార్యాలయం వారి మాయ!... తప్పును సరిచేయమంటూ ఏడేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునేవారే లేకుండా పోయారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన బొమ్మెన శ్రీనివాస్‌కు 2007 మార్చి9న పాస్‌పోర్టు జారీ అయ్యింది. అయితే, అందులో అతని పుట్టిన తేదీని 1937 మే 3గా పేర్కొన్నారు.
వాస్తవానికి శ్రీనివాస్ సమర్పించిన ఆరో తరగతి టీసీ ప్రకారం అతని పుట్టిన తేదీ 1987 మే 3. కానీ, అధికారులు తప్పు చేయడంతో అతని వయస్సు 77 ఏడు ఏళ్లుగా నమోదైంది. ఈ తప్పును సరిచేయాలని అతను ఏడేళ్లుగా తిరుగుతున్నా.. అదిగో, ఇదిగో అంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. గల్ఫ్ దేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో పలువురు ఏజెంట్లను తన పాస్‌పోర్టును ఇవ్వగా, అందులో ఉన్న వయస్సును చూపి కంపెనీలు వీసా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును సరిదిద్దాలని శ్రీనివాస్ కోరుతున్నారు.