కొత్తగా పాస్‌పోర్టు కావాలా.. అలాగైతే కనీసం నెల పదిహేను రోజులు ఓపిక పట్టాల్సిందే. గతంలో వారం పది రోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందితే, ఇప్పుడు 45 రోజుల సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నిస్తే.. కరోనా ప్రభావం అంటున్నారు ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు. ప్రస్తుతం కరోనా నుంచి అంతా తేరుకున్నా, గతంలో లాక్‌డౌన్‌లతో పాస్‌పోర్టుల జారీకి బ్రేక్ పడింది. అప్పుడు ఏర్పడిన ప్రతిష్టంభన ప్రస్తుతం పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనపై ప్రభావం చూపుతోంది.
రాష్ట్రంలో హైదరాబాద్‌లోని టోలిచౌకి, బేగంపేట్, అమీర్‌పేట్‌లతో పాటు నిజామాబాద్, కరీంనగర్‌లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు రోజుకు ఐదు వేలకు మించి పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలించడం లేదు. కొంతకాలం కిందట రోజుకు రెండున్నర వేల దరఖాస్తులనే పరిశీలించారు. ఇప్పుడు పరిశీలించే దరఖాస్తుల సంఖ్యను రెట్టింపు చేసినా అత్యవసరంగా పాస్‌పోర్టు అవసరం ఉన్నవారికి స్లాట్ బుకింగ్ చేసుకున్న నాటి నుంచి నెల వరకు దరఖాస్తుల పరిశీలనకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
గతంలో పదిరోజుల్లోనే..
గతంలో ఒక రోజు స్లాట్ బుక్ చేసుకుంటే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి మరుసటిరోజు వెళ్లి సర్టిఫికెట్‌లను చూపించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్పెషల్ బ్రాంచి అధికారులు విచారణ పూర్తి చేసి వారం, పది రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టును పోస్టు ద్వారా ఇంటికి చేరవేసేవారు. ప్రస్తుత పరిస్థితిలో మాత్రం స్లాట్ బుకింగ్‌కు నెల రోజుల వరకు వేచిచూడాల్సి వస్తోంది. నిర్ణీత తేదీన అభ్యర్థి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్‌లను చూపితే పక్షం రోజుల్లో పాస్‌పోర్టును చేతికి అందిస్తున్నారు. కరోనా తర్వాత విదేశాల్లో ఉపాధి, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రోజుకు పదివేల మంది వరకు స్లాట్ బుకింగ్ కోసం విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ప్రయత్నిస్తున్నారు. కాగా, పాస్‌పోర్టుల జారీ లక్ష్యం ఐదు వేలే ఉండటంతో స్లాట్ బుకింగ్‌కు ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న రద్దీ ప్రకారం మరో నాలుగైదు నెలల పాటు పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ అధికారులు స్పందించి అత్యవసరం ఉన్నవారికి పాస్‌పోర్టుల జారీ కోసం ప్రత్యేక కౌంటర్‌లను పెంచాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment