పటాన్‌చెరు
మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజవర్గంలో విజేత ఎవరనే విషయంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భిన్న జాతుల సమ్మేళనంగా నియోజకవర్గానికి పేరుంది. ఇక్కడ ఎనిమిది అభ్యర్థులు వివిధ గుర్తింపు పొందిన పార్టీల నుంచి బరిలో ఉన్నారు. మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి తాజామాజీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ప్రజాఫ్రంట్ అభ్యర్థి కాట శ్రీనివాస్ మధ్య గట్టి పోటీ ఉంది. మిగతా అభ్యర్థులు సైతం విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం ఇక్కడ తీరని సమస్యగా మిగిలింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాలుష్య నియంత్రణకు ఈ ప్రాంతంలో తీసుకున్న చర్యలేవి లేవనే భావన ప్రజల్లో ఉంది. అభ్యర్థుల బలాబలాలు, సమస్యలపై ప్రత్యేక కథనం.
పటాన్‌చెరు: భిన్న జాతుల సమ్మేళనంగా, మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజవర్గంలో విజేత ఎవరనే విషయంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎనిమిది మంది అభ్యర్థులు వివిధ గుర్తింపు పొందిన పార్టీల నుంచి బరిలో ఉండగా, మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే జీ. మహిపాల్‌రెడ్డి, ప్రజాఫ్రంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కాట శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ నుంచి పి. కరుణాకర్‌రెడ్డి, సీపీఎం– బీఎల్‌ఎఫ్ తరపున రొయ్యపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్, ప్రజాఫ్రంట్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుంది. మిగతా అభ్యర్థులు సైతం విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ ప్రొఫైల్
తాజామాజీ ఎమ్మెల్యే జీ. మహిపాల్‌రెడ్డి పటాన్‌చెరు వాసి. వ్యవసాయ నేపథ్య కుంటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీగా పని చేశారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. కార్మికనేతగా గుర్తింపు పొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కక పోవడంతో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం వైఎస్సార్‌సీపీలో పని చేశారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మరో సారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు.
కాట శ్రీనివాస్‌గౌడ్(కాంగ్రెస్)
అమీన్‌పూర్ మాజీ సర్పంచ్‌గా పని చేశారు. జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం తొలిసారి. ప్రజాఫ్రంట్‌లోని కాంగ్రెస్ నేతలు సపాన్‌దేవ్, శంకర్‌యాదవ్, శశికళా యాదవ్‌రెడ్డి, టీడీపీ నేత జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, గాలి అనిల్‌కుమార్‌లు ఆయనను బలపరుస్తున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రావు ఇంకా ఇతర ప్రజాఫ్రంట్ నాయకులంతా ఐక్యంగా ఉంటూ ఆయన విజయానికి కృషి చేస్తుండటం కలిసివచ్చే అంశం. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. యువకుడిగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన గెలుపు బాధ్యతను ఆయన ప్రజాఫ్రంట్ నేతలకు అప్పగించారు. ఓటర్ల ఆశీర్వాదం,ప్రజాఫ్రంట్ నేతల సహాకారంతో విజయావకాశాలు తనకే ఉన్నాయనే ధీమాతో ఉన్నారు.
పీ.కరుణాకర్‌రెడ్డి(బీజేపీ)
మాజీ సైనిక ఉద్యోగి అయిన పి.కరుణాకర్‌రెడ్డి బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. ఏయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులతో పోల్చితే అధిక డిగ్రీలు కలిగి ఉన్నారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. మాజీ సైనికోద్యోగిగా దేశసేవ చేశానని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటు పడుతానని ప్రచారం చేస్తున్నారు. భాద్యతాయుత, జవాబుదారితనంతో కూడిన అవినీతి రహిత పాలన అందించేందుకు తనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ సమస్యలు వాటి పరిష్కారానికి తన వద్ద ఉన్న నిర్థిష్టమైన ప్రణాళికతో కూడిన హామీలతో ఆయన ముద్రించిన కరపత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. నరేంద్ర మోదీ పాలనే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు.
ఆర్.శ్రీనివాస్(బీఎల్‌ఎఫ్)
ఆర్.శ్రీనివాస్ పటాన్‌చెరు మండలం రుద్రారం నివాసి. చాలా కాలంగా సీపీఎంలో పని చేస్తున్నారు. ఈ ప్రాంతం పారిశ్రామికవాడల్లోని కార్మిక సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. నీతివంతమైన పాలన తమ పార్టీతో మాత్రమే సాధ్యమని ఆయన ప్రచారం చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఆయన కార్మిక వర్గాల సేవ చేస్తున్నారు. నియోజకవర్గంలోని కార్మిక వర్గాలు తనను గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు.
అభివృద్ధి పనులు
పటాన్‌చెరు మార్కెట్ కమిటీ ఏర్పాటు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని మార్కెట్ కోసం కేటాయింపు. జిల్లాలోనే అధిక ఆదాయంపొందుతున్న మార్కెట్ యార్డుగా అభివృద్ధి, మూడు మండలాల్లో మార్కెటింగ్ గోదాముల నిర్మాణం
నియోజకవర్గం పరిధిలోని ప్రధాన రోడ్ల అభివృద్ధి, బ్రిడ్జిల అభివృద్ధి చేశారు.
తెల్లాపూర్ నుంచి కొల్లూరు వరకు రేడియల్ రోడ్డు అభివృద్ధి
జాతీయ రహాదారికి మరమ్మతులు, ఆర్సీపురంలో రాయసముద్రం చెరువు నీరు నేషనల్ హైవేపైకి రాకుండా రోడ్డు అభివృద్ధి
జిన్నారం మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పనులు కొనసాగుతున్నాయి.
పటాన్‌చెరు,జిన్నారంలో సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాలల అభివృద్ధి
ఉమ్మడి జిన్నారం మండలంలోని అన్ని గ్రామాలకు డబుల్‌రోడ్డు నిర్మాణం
సాకి చెరువు, రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.
మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి.
ప్రధాన సమస్యలు
కాలుష్యం ఇక్కడ తీరని సమస్యగా మిగిలింది. ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ శంకుస్థాపనకే పరిమితమైంది. తెలంగాణా వచ్చిన తర్వాత కాలుష్య నియంత్రణకు ఈ ప్రాంతంలో తీసుకున్న చర్యలేవి లేవనే భావన ప్రజల్లో ఉంది.
తీవ్రమైన తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గంలో వందలాది కొత్త కాలనీలు వచ్చాయి. మంచినీటి వ్యాపారం ఇక్కడ కోట్లలో సాగుతుంది. ట్యాంకర్లతో ఇళ్లకు నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్రమ లేఔట్‌లను పెంచి పోషించిన కారణంగా ప్రజలకు కనీసం మౌలికవసతులు కొరత ఉంది. డ్రైనేజీలు లేవు, నల్లా నీరు లేదు. మిషన్ భగీరథలో కూడ కొన్ని కాలనీలను చేర్చలేకపోయారు. పార్కులు లేవు. ఆట స్థలాలు లేవు.
కార్మికులు తాము సంపాధిస్తున్న దాంట్లో సగానికంటే ఎక్కువ అద్దెలకు చెల్లిస్తున్నారు. 2004 తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్లాట్లు ఇవ్వలేదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్లాట్లు పంచినా నేటికీ పొజిషన్ చూపాలేదు. డబుల్ బెడ్రూంలు కట్టిస్తున్నామని చెబుతున్నా, అవి స్థానికులకు దొరుకుతాయనే నమ్మకం లేదు.
పటాన్‌చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదు. నియోజకవర్గ స్థాయిలో ఉండాల్సిన కార్యాలయాల ఏర్పాటును ఎవరూ పట్టించుకోవడం లేదు.
మినీ స్టేడియంలు, క్రీడామైదానాలు కావాలని కోరతున్నా పాలకులు పట్టించుకోలేదు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు సైతం షుగర్ వ్యాధి భారిన పడుతున్నారు. వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు ఆవశ్యకం.
కాలుష్య ప్రాంతం కారణంగా ఛాతి, శ్వాసకోశ సంబంధిత రోగాలతో కొందరు ప్రజలు సతమతమవుతున్నారు. ఇఎస్‌ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాల క్రితం నుంచి డిమాండ్ ఉంది. కాని నేటికీ అది అమలుకు నోచుకోలేదు. అమీన్‌పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో పీహెచ్‌సీలు కావాలని స్థానికులు కోరుతున్నారు.
పారిశ్రామికవాడల్లో భద్రత పెంచాలన్న డిమాండ్ అలానే ఉంది.
2014 ఓట్ గ్రాఫ్
మొత్తం పోలైన ఓట్లు: 1,99,725
మొత్తం ఓటర్లు: 2,93,482
ఎం.సపాన్‌దేవ్ (టీడీపీ) 55100
మెజారిటీ 18,886
జి.మహిపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్) 73986
2018 ఓట్ గ్రాఫ్
మొత్తం : 2,81,737
మహిళా ఓటర్లు: 1,36,157
పురుష ఓటర్లు: 1,45,537
ఇతరులు: 43
Comments
Please login to add a commentAdd a comment