రంగారెడ్డి : సొమ్మొకరిది... సోకొకరిది అంటే ఇదే కాబోలు. తాము వినియోగించుకున్న వాహనానికి అద్దె చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ మంత్రి పేషీ హుకుం జారీ చేయడం చూస్తే ఈ సామెత అతికినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ నెల వరకు (మార్చి) వాహనం అద్దె బిల్లు కట్టాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి పేషీ నుంచి లేఖ అందింది. ప్రతినెలా రూ.54 వేల చొప్పున పది నెలలకుగాను రూ.5.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కాగా.. కనీసం ఏ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారనే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి అద్దె ప్రాతిపదికన తీసుకునే కారుకు ప్రతినెలా కిరాయి చెల్లిస్తారు. అలా వీలుకాని పక్షంలో మూడునెలల కోసారి బిల్లులు ఇస్తారు.
ఈ వాహనానికి 10 నెలల బిల్లులు ఒకేసారి చెల్లించాలని లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా యంత్రాంగం మాత్రం లేఖ వచ్చిందే తడవుగా బిల్లులు చెల్లించేందుకు ఫైలు సిద్ధం చేస్తోంది. గతంలో వివిధ మంత్రుల పేషీలు, ఉన్నతాధికారులు కార్లు వినియోగించుకున్నా.. ఒకట్రెండు వారాలు మాత్రమే. ఇలా నెలల తరబడి ఉపయోగించిన వాహనానికి మాత్రం ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో బిల్లు చెల్లించాలనడం ఇదే తొలిసారి అని ఓ రెవెన్యూ అధికారి చెప్పారు. కాగా.. జిల్లా యంత్రాంగం అద్దె వాహనాలను అడ్డగోలుగా వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.