పినపాక: మండలంలోని అర్హులందరికీ ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలన్న డిమాండుతో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు శుక్రవారం గంటపాటు ధర్నా నిర్వహించారు. ‘అర్హులకు ఏదీ ‘ఆసరా’’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నానుద్దేశించి ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. మండలంలోని అనేకమంది అర్హులకు పింఛన్లు మంజూరవలేదని, అదే సమయంలో కనీసార్హత కూడా లేని వారికి ఇచ్చారని అన్నారు. అర్హులైన అనేకమంది అధికారుల తప్పిదంతో తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు.
90 శాతం వికలాంగత్వమున్న వారికి కూడా ఫింఛన్ మంజూరు చేయలేదని, ‘ఆసరా’ అవకతవకలకు ఇదొక నిదర్శనమని చెప్పారు. గతంలో పింఛన్లు పొందిన వికలాంగులకు, వృద్ధులకు ఇప్పుడు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అధికారుల సర్వేలో నిర్లక్ష్యం కారణంగా అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ‘ఆసరా’ అర్హులలో కేవలం 40 శాతం మందికే పింఛన్లు అందుతున్నాయని, ఈ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిగిలిన వారికి కూడా పింఛన్లు ఇవ్వకపోతే వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వద్దకు పాల్వంచ ఆర్డీవో వచ్చి, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే పాయం ధర్నా విరమించారు.
ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆర్డీవోకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, కీసర సుధాకర్‌రెడ్డి, మద్దెల సమ్మయ్య, ఉడుముల రవీందర్‌రెడ్డి, తోలెం కృష్ణ, యాంపాటి తిరుపతిరెడ్డి, వనమాల రాంబాబు, ఎండి.ఝంఘీర్, వికలాంగుల పోరాట సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు జలగం కృష్ణ, నాయకుడు జాడీ నాగరాజు, సర్పంచులు ఇర్పా సారమ్మ, వాగుబోయిన చందర్‌రావు, తోలోం అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు ‘ఆసరా’ కోసం..ఎమ్మెల్యే పాయం ధర్నా
Published Sat, Dec 20 2014 3:27 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement