pinapaka mla
-
ప్రగతికి బాటలు వేస్తా
♦ పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే ♦ ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం ♦ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి ♦ పాలనా సౌలభ్యం కోసమే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ♦ మౌలిక సౌకర్యాలతో పాటు అన్నిరంగాల అభివృద్ధిపై ద్రుష్టి మణుగూరు : ‘అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తా. మణుగూరు పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తా. అత్యంత వెనుకబడిన గుండాల మండలాన్ని రోడ్ల నిర్మాణంతో ప్రగతి పథం పట్టిస్తా. పాలనా సౌలభ్యం కోసమే నియోజకవర్గంలో ఆళ్లపల్లి, కరకగూడెంలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించాం. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉంటాను. మండలాల వారీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాను. ’ అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లలో అభివృద్ధిపై... మొదటి శాసనసభ సమావేశాల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావించాను. సీఎంతో అనేకసార్లు మాట్లాడి రూ.7,250 కోట్ల థర్మల్ ప్లాంటు సాధించా. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 307 చెరువులను రూ.82 కోట్లతో అభివృద్ధి చేశా. మరో నెల రోజుల్లో బూర్గం పాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ఎడమ కాలువ పనులు పూర్తి కానున్నాయి. మణుగూరుకు 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.3కోట్ల సీడీపీ నిధులతో సీసీరోడ్లు,డ్రెయిన్లు, బోర్లు వేయించా. బూర్గంపాడు-ఏటూరునాగారం రహదారిని జాతీయ రహదారిగా మార్పించా. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వైద్య, ఆరోగ్య మంత్రితో మాట్లాడి ఆళ్లపల్లి, పినపాక, బూర్గంపాడు పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు మంజూరు చేయించా. మణుగూరు మండలం పేరంటాలచెరువుకు రూ.కోటి మంజూరు చేయించా. టెండర్లు పిలి చారు. వర్షాకాలం తరువాత పనులు ప్రారం భమవుతాయి. మిషన్‌భగీరథ ద్వారా 2017 డిసెంబర్‌కు నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు నల్లా నీరు వస్తుంది. మొండికుంట, ఆళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేయించా. పినపాక మండలం మల్లారం, అశ్వాపురం, బూర్గం పాడు, గుండాల మండలం మర్కోడుల్లో రూ.5.5 కోట్లతో వ్యవసాయ గిడ్డంగులు మంజూరు చేయించా. రూ.2 కోట్లతో అంగన్వాడీ భవనాలు కట్టించా. రూ.8.50 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు వేయించా. రూ.2.23 కోట్లతో మణుగూరులో మినీ ట్యాంక్‌బండ్ మంజూరు చేయించా. నీటిపారుదల, వ్యవసాయంపై..? నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. వచ్చే విడత మిషన్ కాకతీయలో అన్ని చెరువులు పూర్తి చేయిస్తా. పినపాక మండలంలో 28 గిరిజన గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.90కోట్ల అంచనాతో పులుసుబొంత ప్రాజెక్టు నిర్మించేందుకు కృషి చేస్తున్నా. దీనిపై శాసనసభలో, సీఎంతోనూ మాట్లాడా. అటవీ, రెవెన్యూ, శాటిలైట్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది నిధులు మంజూరు అవుతాయి. పినపాక మండలం గొడుగుబండ వద్ద 900ఎకరాలకు సాగునీరు అందించే రూ.9కోట్ల వట్టివాగు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరిపై పినపాక మండలం భూపతిరావుపేట, చింతలబయ్యారం, మణుగూరు మండలం అన్నారం లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు పంపా. వీటితో ఆరువేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సమితిసింగారం పరిధిలో 2వేల ఎకరాలకు నీరందించే రేగులగండికి రూ.1.10 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడీఏ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం మణుగూరుకు మార్చడంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలు అయ్యేలా చేశా. విద్య, వైద్యంపై...? నియోజకవర్గానికి ఒక ఎస్సీ, మరొక ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించా. ఇందులో 5 నుంచి ఇంటర్ వరకు బోధిస్తారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, పాలి టెక్నిక్ కళాశాలలకు ప్రతిపాదనలు పంపా. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు సాధించా. సీహెచ్‌సీ వైద్యులు క్షేత్రస్థాయి శిబిరాలు పెట్టకుండా అంబులెన్స్‌లు ఆగిపోయాయి. మొండికుంట, బూర్గంపాడు, మణుగూరుల్లో కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదనలు పంపా. రోడ్డు కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిపై...? బూర్గంపాడు-ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేశా. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరువాగు, ఏడుమెలికలవాగులపై వంతెనలు, శాశ్వత రోడ్ల కోసం కృషి చేస్తున్నా. గుండాల-సాయనపల్లి-దామెరతోగు, చెట్టుపల్లి-కొమరారం రోడ్లు పీఆర్ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించాం. దీనికి మంత్రి తుమ్మల ఇచ్చిన సహకారం మరువలేనిది. గొల్లగూడెం-చొప్పాల వంతెనకు రూ.4.5 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ బ్రిడ్జి కమ్ చెక్‌డ్యాం నిర్మిస్తాం. మారుమూల ప్రాంతాలు..? మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నా. కొత్తగా గుండాల నుంచి ఆళ్లపల్లి, పినపాక నుంచి కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలని భౌగోళిక వివరాలతో సీఎంను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు. మణుగూరు పట్టణ అభివృద్ధిపై..? మణుగూరులో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి తుమ్మల సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నా. ఇప్పటికే నాయుడుకుంట మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.2.23కోట్లు మంజూరు చేయించా. మరో రూ.3.30కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చా. చినరావిగూడెం-పర్ణశాల మధ్య గోదావరిపై వంతెన కోసం రూ.150కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. -
అర్హులకు ‘ఆసరా’ కోసం..ఎమ్మెల్యే పాయం ధర్నా
పినపాక: మండలంలోని అర్హులందరికీ ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలన్న డిమాండుతో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు శుక్రవారం గంటపాటు ధర్నా నిర్వహించారు. ‘అర్హులకు ఏదీ ‘ఆసరా’’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నానుద్దేశించి ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. మండలంలోని అనేకమంది అర్హులకు పింఛన్లు మంజూరవలేదని, అదే సమయంలో కనీసార్హత కూడా లేని వారికి ఇచ్చారని అన్నారు. అర్హులైన అనేకమంది అధికారుల తప్పిదంతో తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. 90 శాతం వికలాంగత్వమున్న వారికి కూడా ఫింఛన్ మంజూరు చేయలేదని, ‘ఆసరా’ అవకతవకలకు ఇదొక నిదర్శనమని చెప్పారు. గతంలో పింఛన్లు పొందిన వికలాంగులకు, వృద్ధులకు ఇప్పుడు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అధికారుల సర్వేలో నిర్లక్ష్యం కారణంగా అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ‘ఆసరా’ అర్హులలో కేవలం 40 శాతం మందికే పింఛన్లు అందుతున్నాయని, ఈ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిగిలిన వారికి కూడా పింఛన్లు ఇవ్వకపోతే వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వద్దకు పాల్వంచ ఆర్డీవో వచ్చి, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే పాయం ధర్నా విరమించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆర్డీవోకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, కీసర సుధాకర్‌రెడ్డి, మద్దెల సమ్మయ్య, ఉడుముల రవీందర్‌రెడ్డి, తోలెం కృష్ణ, యాంపాటి తిరుపతిరెడ్డి, వనమాల రాంబాబు, ఎండి.ఝంఘీర్, వికలాంగుల పోరాట సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు జలగం కృష్ణ, నాయకుడు జాడీ నాగరాజు, సర్పంచులు ఇర్పా సారమ్మ, వాగుబోయిన చందర్రావు, తోలోం అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారే ప్రసక్తేలేదు
మణుగూరు : తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాయం వెంకటేశ్వర్లును టీఆర్ఎస్లోకి రావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను అనూహ్య రీతిలో విజయ దుందిబి మోగించానని, అప్పటి నుంచి నేటి వరకు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కొన్ని పత్రికలు సైతం కావాలని దుష్ర్ఫచారం చేయడం ప్రారంభించాయన్నారు. లేని పోని అభూత కల్పనలతో తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఏ ఉద్దేశంతో గెలిపించారో వారి ఆశయ సాధనకు పని చేస్తానే తప్ప పూటకో పార్టీ మారుతూ వారి విశ్వాసాన్ని కోల్పోనని అన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేని వారు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజలు తను ఆదరించిన తీరును చూసి వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన అభిమానులంటూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏమోస్తుందని అన్నారు. నిజమైన అభిమానులైతే నేరుగా తనతో మాట్లాడాలే కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టి తన మనస్సును ఏ విధంగా మారుస్తారని అన్నారు. కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైఎస్ ఆశయ సాధన కోసం జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. ఇదే మాట తాను గతంలోను పత్రికా ముఖంగా చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటికైనా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. -
ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..
మీకు తోడుంటా. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో మీ కాలనీలను అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయించి గోదావరి నుంచి తాగునీరు సక్రమంగా అందేలా చూస్తా. అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించేలా చూస్తా. అధికారులతో మాట్లాడి పింఛన్లు అందేలా కృషి చేస్తా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. త్వరలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశుధ్య పనులపై పంచాయతీ అధికారులతో మాట్లాడుతా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దుతా. - పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే అక్కడికి వెళ్లాలంటే దుర్గంధం.. రోడ్లమీదే మురుగు నీరు.. వీధుల వెంట ముక్కుమూసుకొని నడక సాగించాలి.. రాత్రైందంటే దోమల స్వైరవిహారం..అక్కడ ఉండే వారు నిత్యం రోగాలతో అల్లాడుతున్న వైనం..ఇంతేనా.., తాగునీరు, పక్కాఇళ్లు, పింఛన్లు, ఉపాధి...ఇలా ఎన్నో సమస్యలు ఆ కాలనీలను వేధిస్తున్నాయి. నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని వెంకటపతినగర్, అరుంధతీ నగర్, బీసీ కాలనీ, బుడిగజంగాల కాలనీలను పినపాక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తోడుంటానని హామీ ఇచ్చారు. పాయం వెంకటేశ్వర్లు : అమ్మా బాగున్నారా? మీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మీ సమస్యలేంటో చెప్పండమ్మా? చిరిగిరి సబ్బుమ్మ : వెంకటపతినగర్‌లో ఎంతో కాలంగా ఉంటున్నానయ్యా. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదయ్యా. పాయం: పోషయ్య బాగున్నారా? మీ వాడలో ఉన్న సమస్యలేంటి? పోషయ్య : బాగానే ఉన్నాము సారు..మా వాడలో అంతర్గతరోడ్లు లేక ఇబ్బంది పడతున్నాం. తాగునీరు లేదు సారు. నల్లాలు వారానికి ఓసారి కూడా రావట్లేదయ్యా. పాయం: ఏమ్మా బాగున్నావా? మీ కాలనీలో ఏమైనా ఇబ్బందులున్నాయా? పచ్చిపులుసు అన్నపూర్ణ : మా వాడలో సరైన రోడ్లు లేవయ్యా. ఇండ్ల మధ్యనే మురికి నీరు ఉంటోంది. దోమలు విపరీతంగా ఉన్నాయయ్యా. పిల్లపెద్దలకు రోగాలొస్తన్నాయ్. లెట్రిన్గదుల్లేక ఆడోళ్లం ఇబ్బంది పడతాన్నం. మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధిలేక ఖాళీగా ఉంటుండ్రు. వారికి ఉపాధి చూపించడయ్యా. పాయం: ఏం తాతా బాగున్నావా? పింఛన్ వస్తుందా? గంగయ్య: రావడం లేదయ్యా. ఆఫీసుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేద య్యా. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా. పాయం: ఏమి బాబూ? నీ సమస్య ఏమిటీ? దాసరి పెంటయ్య: మాకు పక్కా ఇళ్లు లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నామండి. సైడ్‌కాల్వలు సక్రమంగా లేవు. పక్కా ఇళ్లు ఇప్పించండి. పాయం : దుకాణం ఎట్ల నడుస్తుందమ్మా? మీ ప్రాంత సమస్యలు చెప్పండమ్మా? దుకాణం కోసం అవసరమైతే ఐటీడీఏ లోన్ తీసుకోమ్మా.. కారం సీత: దుకాణం బాగనే నడస్తందయ్యా. మాకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పూర్తి రాలేదయ్యా. మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వడం లేదు. సంతోషమయ్యా అవసరమైనప్పుడు ఐటీడీఏ లోన్ తీసుకుంటనయ్యా. పాయం: బాగున్నారామ్మా మన బీసీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా? వీరమ్మ: గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఇప్పటి వరకు ఎవరూ రోడ్డు వేయలేదు సారు. సైడు కాల్వలు లేక రోడ్డుమీద మురికి నీరు నిల్వ ఉంటోంది సారు. సైడ్‌కాల్వలు, రోడ్లు వేయించండి సారు. పాయం: మీ ప్రాంతానికి అధికారులు వచ్చి ఎప్పుడైనా మీ సమస్యలు అడిగారామ్మా? భద్రమ్మ : మా బాధలు పట్టించుకునేటోరు ఎవరు లేరయ్యా. అధికారులు అప్పుడప్పుడు వచ్చినా పరిష్కారం చూపడం లేదు సారు. ఇట్ల వచ్చి అట్ల పోతున్నరు. మరుగుదొడ్ల బిల్లులు రాలేదు. సైడుకాల్వలో నీరు నిల్వ ఉంటాంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. పాయం: ఏమిటమ్మా బాధపడుతున్నావు.. ఏమైంది? పెంటమ్మ: అయ్యా నాకు ముసలోళ్ల పింఛన్ రావట్లేదయ్యా. రెండునెలలు అయిందయ్యా. వస్తదో రాదో తెల్వడం లేదయ్యా. ఎన్నిసార్లో సార్ల చుట్టూ తిరిగినా..ఎవరూ పట్టించుకోలేదయ్యా. పాయం: బాబూ నీ సమస్య ఏమిటి? చిన్నారావు: నాకు వికలాంగుల పింఛన్ రావడం లేదు. దరఖాస్తు పెట్టినాను. నెలరోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతాన్న. ఎవరూ పట్టించుకోవడం లేదు. పాయం: ఏం చిన్న నీ ప్రాబ్లమ్ ఏమిటి? ఆంజనేయులు: సర్ నేను ఐటీఐ పూర్తి చేశాను. ఎక్కడా ఉపాధిలేక నిరుద్యోగిగా తిరుగుతున్నా. మాకు ఉపాధి మార్గం చూపండి సారు. పాయం: ఏంటమ్మా..ఏమి చదువుతున్నావ్? ఏమైనా సమస్యలున్నాయా? జరిపెటి చిన్నారి : సారు నే ను మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. మాకు ఇప్పటివరకు స్కాలర్షిప్లు రావడంలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వట్లేదు. పాయం: ఏమ్మా అందరూ బాగున్నారా? పిల్లలు మంచిగున్నరా? సువార్త, గంగ, రాణి: పిల్లలు బాగనే ఉన్నరన్న. బంగారుతల్లి పథకం మా పిల్లలకు ఇవ్వడంలేదన్న. జర వచ్చేలాగా చూడండి. పాయం: బాగున్నావా ఆనందరావు? అరుంధతీనగర్ సమస్యలు ఏమిటి? చెన్నం ఆనందరావు: సారు బాగున్నాను. మా ప్రాంతంలో తాగునీటి సమస్య బాగా ఉంది. అంతర్గత రోడ్లు లేవు. వీధి లైట్లు లేవు. మా ప్రాంతానికి రోడ్లు వేయిస్తామన్నారు..సంతోషంగా ఉంది. వృద్ధుల పింఛన్ల విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పాయం: అమ్మా నీ సమస్య ఏమిటి? చిలక శిరోమణి: అరుంధతీ నగర్లో ఎంతోకాలంగా ఉంటున్నానయ్యా. వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. ఆఫీసులచుట్టూ తిరుగుతన్నా. ఏదైనా ఆధారం చూపండయ్యా. -
గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు(ఖమ్మం) : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సెంబ్లీ సమావేశం జీరో అవర్‌లో ఈసమస్యపై చర్చించినట్లు ఆయన ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలి పారు. 1998లో కోల్ఇండియా వ్యాప్తంగా సింగరేణిలో సైతం కార్మికులను కుదించాలనే నిర్ణయంతో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయడంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై నిషేధం విధించారని అన్నారు. అప్పటినుంచి సింగరేణిలో రిక్రూట్ మెంట్ సైతం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ భారీగా తగ్గిపోతోందని, ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న యాజమాన్యం కార్మికుల సంఖ్యను పెంచడం లేదని చెప్పారు. గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్) డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని వాగ్దానం చేసిందని, అసెంబీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి త్వరలో ఉద్యోగ విరమణ పొందే కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట వాస్తవమేనని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హమీఇచ్చినట్లు పేర్కొన్నారు. -
మణుగూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయూలి
మణుగూరు : మణుగూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి ఫోన్లో సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైబల్ వెల్పేర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టికి నియోకవర్గ సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టు కిన్నెరసాని కాలువ పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలని కోరామని చెప్పారు. 11ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తిచేయా ని, చెరువులు, కుంటలకు మరమ్మతులు చే యూలని, గిరిజన బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరి నట్టు వివరించారు. పీహెచ్సీలో సిబ్బంది ని నియమించాలని, గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మిం చాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. మణుగూరు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేయూలని కోరినట్లు చెప్పారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పం దించారని తెలిపారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.