ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా.. | development should be done by MLA-funded | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..

Published Mon, Dec 1 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..

ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..

మీకు తోడుంటా. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో మీ కాలనీలను అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయించి గోదావరి నుంచి తాగునీరు సక్రమంగా అందేలా చూస్తా. అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించేలా చూస్తా.

అధికారులతో మాట్లాడి పింఛన్లు అందేలా కృషి చేస్తా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. త్వరలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశుధ్య పనులపై పంచాయతీ అధికారులతో మాట్లాడుతా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దుతా.

- పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
 
అక్కడికి వెళ్లాలంటే దుర్గంధం.. రోడ్లమీదే మురుగు నీరు.. వీధుల వెంట ముక్కుమూసుకొని నడక సాగించాలి.. రాత్రైందంటే దోమల స్వైరవిహారం..అక్కడ ఉండే వారు నిత్యం రోగాలతో అల్లాడుతున్న వైనం..ఇంతేనా.., తాగునీరు, పక్కాఇళ్లు, పింఛన్‌లు, ఉపాధి...ఇలా ఎన్నో సమస్యలు ఆ కాలనీలను వేధిస్తున్నాయి.  నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని వెంకటపతినగర్, అరుంధతీ నగర్, బీసీ కాలనీ, బుడిగజంగాల కాలనీలను పినపాక ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తోడుంటానని హామీ ఇచ్చారు.
 
పాయం వెంకటేశ్వర్లు : అమ్మా బాగున్నారా? మీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మీ సమస్యలేంటో చెప్పండమ్మా?
చిరిగిరి సబ్బుమ్మ : వెంకటపతినగర్‌లో ఎంతో కాలంగా ఉంటున్నానయ్యా. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదయ్యా.
పాయం:  పోషయ్య బాగున్నారా? మీ వాడలో ఉన్న సమస్యలేంటి?
పోషయ్య : బాగానే ఉన్నాము సారు..మా వాడలో అంతర్గతరోడ్లు లేక ఇబ్బంది పడతున్నాం. తాగునీరు లేదు సారు. నల్లాలు వారానికి ఓసారి కూడా రావట్లేదయ్యా.  
పాయం: ఏమ్మా బాగున్నావా? మీ కాలనీలో ఏమైనా ఇబ్బందులున్నాయా?
పచ్చిపులుసు అన్నపూర్ణ : మా వాడలో సరైన రోడ్లు లేవయ్యా. ఇండ్ల మధ్యనే మురికి నీరు ఉంటోంది. దోమలు విపరీతంగా ఉన్నాయయ్యా. పిల్లపెద్దలకు రోగాలొస్తన్నాయ్. లెట్రిన్‌గదుల్లేక ఆడోళ్లం ఇబ్బంది పడతాన్నం. మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధిలేక ఖాళీగా ఉంటుండ్రు. వారికి ఉపాధి చూపించడయ్యా.
పాయం: ఏం తాతా బాగున్నావా? పింఛన్ వస్తుందా?
గంగయ్య: రావడం లేదయ్యా. ఆఫీసుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేద య్యా. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా.
పాయం: ఏమి బాబూ? నీ సమస్య ఏమిటీ?
దాసరి పెంటయ్య: మాకు పక్కా ఇళ్లు లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నామండి. సైడ్‌కాల్వలు సక్రమంగా లేవు. పక్కా ఇళ్లు ఇప్పించండి.
పాయం : దుకాణం ఎట్ల నడుస్తుందమ్మా? మీ ప్రాంత సమస్యలు చెప్పండమ్మా? దుకాణం కోసం అవసరమైతే ఐటీడీఏ లోన్ తీసుకోమ్మా..
కారం సీత: దుకాణం బాగనే నడస్తందయ్యా. మాకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పూర్తి రాలేదయ్యా. మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వడం లేదు. సంతోషమయ్యా అవసరమైనప్పుడు ఐటీడీఏ లోన్ తీసుకుంటనయ్యా.
పాయం: బాగున్నారామ్మా మన బీసీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా?
వీరమ్మ: గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఇప్పటి వరకు ఎవరూ రోడ్డు వేయలేదు సారు. సైడు కాల్వలు లేక రోడ్డుమీద మురికి నీరు నిల్వ ఉంటోంది సారు. సైడ్‌కాల్వలు, రోడ్లు వేయించండి సారు.
పాయం: మీ ప్రాంతానికి అధికారులు వచ్చి ఎప్పుడైనా మీ సమస్యలు అడిగారామ్మా?
భద్రమ్మ : మా బాధలు పట్టించుకునేటోరు ఎవరు లేరయ్యా. అధికారులు అప్పుడప్పుడు వచ్చినా పరిష్కారం చూపడం లేదు సారు. ఇట్ల వచ్చి అట్ల పోతున్నరు. మరుగుదొడ్ల బిల్లులు రాలేదు. సైడుకాల్వలో నీరు నిల్వ ఉంటాంది. దోమలు విపరీతంగా ఉన్నాయి.
పాయం: ఏమిటమ్మా బాధపడుతున్నావు.. ఏమైంది?
పెంటమ్మ: అయ్యా నాకు ముసలోళ్ల పింఛన్ రావట్లేదయ్యా. రెండునెలలు అయిందయ్యా. వస్తదో రాదో తెల్వడం లేదయ్యా. ఎన్నిసార్లో సార్ల చుట్టూ తిరిగినా..ఎవరూ పట్టించుకోలేదయ్యా.
పాయం: బాబూ నీ సమస్య ఏమిటి?
చిన్నారావు: నాకు వికలాంగుల పింఛన్ రావడం లేదు. దరఖాస్తు పెట్టినాను. నెలరోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతాన్న. ఎవరూ పట్టించుకోవడం లేదు.
పాయం: ఏం చిన్న నీ ప్రాబ్లమ్ ఏమిటి?
ఆంజనేయులు: సర్ నేను ఐటీఐ పూర్తి చేశాను. ఎక్కడా ఉపాధిలేక నిరుద్యోగిగా తిరుగుతున్నా. మాకు ఉపాధి మార్గం చూపండి సారు.
పాయం: ఏంటమ్మా..ఏమి చదువుతున్నావ్? ఏమైనా సమస్యలున్నాయా?
జరిపెటి చిన్నారి : సారు నే ను మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. మాకు ఇప్పటివరకు స్కాలర్‌షిప్‌లు రావడంలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వట్లేదు.
పాయం: ఏమ్మా అందరూ బాగున్నారా? పిల్లలు మంచిగున్నరా?
సువార్త, గంగ, రాణి: పిల్లలు బాగనే ఉన్నరన్న. బంగారుతల్లి పథకం మా పిల్లలకు ఇవ్వడంలేదన్న. జర వచ్చేలాగా చూడండి.
పాయం: బాగున్నావా ఆనందరావు? అరుంధతీనగర్ సమస్యలు ఏమిటి?
చెన్నం ఆనందరావు: సారు బాగున్నాను. మా ప్రాంతంలో తాగునీటి సమస్య బాగా ఉంది. అంతర్గత రోడ్లు లేవు. వీధి లైట్లు లేవు. మా ప్రాంతానికి రోడ్లు వేయిస్తామన్నారు..సంతోషంగా ఉంది. వృద్ధుల పింఛన్‌ల విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు.
పాయం: అమ్మా నీ సమస్య ఏమిటి?
చిలక శిరోమణి: అరుంధతీ నగర్‌లో ఎంతోకాలంగా ఉంటున్నానయ్యా. వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. ఆఫీసులచుట్టూ తిరుగుతన్నా. ఏదైనా ఆధారం చూపండయ్యా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement